NRI: యుఏఈలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం!
ABN, Publish Date - Sep 19 , 2024 | 01:50 PM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు సమాజంలో ప్రప్రథమంగా నవరాత్రుల ఆధ్యాత్మికతతో గణనాథుడు అరేబియా సముద్రం ఒడిలోకి చేరుకొన్నాడు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు సమాజంలో (NRI) ప్రప్రథమంగా నవరాత్రుల ఆధ్యాత్మికతతో గణనాథుడు అరేబియా సముద్రం ఒడిలోకి చేరుకొన్నాడు.
ఆజ్మాన్‌లో ప్రవాసీ ప్రముఖుడు కేసరి త్రిమూర్తుల ఆధ్వర్యంలో అతని మైత్రీ ఫాంలో ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి దుబాయి, షార్జా, ఆబుధాబి, ఆజ్మాన్, ఇతర ఎమిరేట్ల నుండి నిత్యం వందల సంఖ్యలో తెలుగు ప్రవాసీ కుటుంబాలు పూజలు చేసి భక్తితో పరవశించిపోయారు. హైందవ సంప్రదాయక మంగళ వాద్యాల మధ్య దుబాయిలోని పురోహితులు పండిట్ సాయి పవన్ ఆధ్వర్యంలో అర్చకులు రెండ్ల శ్రీనివాస్, ప్రవీణ్‌ల వేదమంత్ర ఘోష ప్రతిధ్వనులతో 1008 ఉండ్రాళ్ళ హోమం, విశేష ఏకవార రుద్రాభిషేకం, భగవద్గీత పారాయణం, విశేష సహస్రనామ దుర్వార్చన, సహస్ర ఫలార్చన, విశేష లలితా సహస్రనామ కుంకుమార్చన, సహస్రపూర్వక పుష్పార్చన(పువ్వులతో) రుద్ర హోమం , పూర్ణాహుతి, సహస్ర మోదక హోమం, పూర్ణాహుతి,కైంకర్యాలు స్వామి వారికి నిర్వహించడంతో భక్తులు భారతగడ్డలో ఉన్నామనే అనుభూతికి లోనయ్యారు.
NRI: సౌదీలో తెలుగు ఆత్మీయ సమ్మేళనం కోసం జోరందుకున్న ఏర్పాట్లు!
పేరుకు తగినట్లుగా డోలక్ శ్రీను బృందం వాయించిన మంగళ వాయిద్యాలతో భక్తులు మైమరచిపోయారు. ఈశ్వర్, వినోద్‌ల భజన బృందాలు బొక్క వెన్నెల భజన గీతాలతో భక్తుల మనస్సులను దోచుకోగా పలువారి తేజస్విని, గుబ్బల శాన్వి, శాన్వి బంగారి, సంపత్ కర్రీ తదితరుల నృత్య గీతాలు మంత్రమగ్ధులను చేసాయి.
భక్తులకు ప్రతి రోజూ అన్నప్రసాద వితరణ చేసినట్లుగా కేసరి త్రిమూర్తులు పేర్కొన్నారు. నిమజ్జనం రోజున అంబాజిపేటకు చెందిన యర్రంశెట్టి వెంకటేష్ సమర్పించిన లడ్డూను మంచాల శ్రీను (కువైత్) హైదరాబాద్‌కు చెందిన సుధీర్‌లు దక్కించుకున్నారు.
మాతృదేశంలో తెలుగుదేశం - జనసేన కూటమి ఉత్సాహంలో ఉన్న దుబాయిలోని జనసేన కార్యవర్గం సమర్పించిన లడ్డూను స్థానిక జనసేన నాయకులు పాపారావు, మాదాసు శ్రీకాంత్‌లు దక్కించుకొన్నారు.
పూజల అనంతరం జరిగిన ఊరేగింపులో తెలంగాణ సంప్రదాయ డప్పులు, మహారాష్ట్ర నాసిక్ డప్పులు తెలుగు రాష్ట్రలకు చెందిన మహిళల నృత్య ప్రదర్శనలు, చిన్నారుల కూచిపూడి ప్రదర్శన, భక్తి గీతాలతో గణపయ్య నిమజ్జనం జరిగింది.
Updated Date - Sep 19 , 2024 | 02:09 PM