Kamala Harris: నేను ఈ స్థితిలో ఉన్నానంటే అమ్మే కారణం: కమలా హ్యారిస్
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:46 PM
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతి నేత కమలా హారిస్ తన తల్లిపై ప్రశంసలు కురిపించారు. ఆమె ధైర్యం పట్టుదల వల్లే తానీ స్థితికి ఎదిగానని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతి నేత కమలా హారిస్ తన తల్లిపై ప్రశంసలు కురిపించారు. ఆమె ధైర్యం పట్టుదల వల్లే తానీ స్థితికి ఎదిగానని అన్నారు. తన విజయాలకు తల్లే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తల్లితో తన చిన్ననాటి ఫొటోను కమలా హారిస్ షేర్ చేశారు. ‘‘మా అమ్మ డా. శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా అమెరికాకు వచ్చారు. ఆమె పట్టుదల, ధైర్యస్థైర్యాలే నన్నీ స్థితికి చేర్చాయి’’ అని పోస్టు పెట్టారు (USA).
US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..
గతంలోనూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన ప్రసంగాల సందర్భంగా పలు మార్లు తల్లి గురించి ప్రస్తావించారు. ఆమె స్ఫూర్తితోనే తాను జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎలుగెత్తానని ఓ సందర్భంలో తెలిపారు. ఇటీవల వాషింగ్టన్ ర్యాలీ సందర్భంగా కమల.. డోనాల్డ్ ట్రంప్ తరువాత ఎక్కువగా మాట్లాడిందని తన తల్లి గురించేనని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. ఇక శ్వేతజాతీయేతర వ్యక్తిగా తన తల్లి అమెరికాలో ఎదుర్కొన్న అనుభవాలను కమలా పలుమార్లు వెల్లడించారు. ఈమారు ఎన్నికల్లో గెలిస్తే కమల అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా, తొలి నల్లజాతి, దక్షిణాసియాకు చెందిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. అయితే, ఓటర్లను ఆకట్టుకునేందుకు కమల ఈ విషయాలేవీ చెప్పకపోవడం ఆసక్తికరమని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది.
పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యాక కమల తన తొలి ప్రసంగంలో తల్లి గురించి చెప్పుకొచ్చారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె 19 ఏళ్ల వయసులోనే అమెరికాకు వచ్చిందని గుర్తు చేశారు. ఇక అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన శ్యామలా హ్యారిస్ ఆ తరువాత బ్రెస్ట్ క్యా్న్సర్‌పై అనేక పరిశోధనలు చేశారు. ఈ వ్యాధికి సంబంధించి వివిధ చికిత్సల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. 1960ల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శ్యామలకు జమైకా నుంచి వచ్చిన డోనాల్డ్ హ్యారిస్ పరిచయమయ్యారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిరుగురించడంతో ఇద్దరూ వివాహ బంధంలో ఒక్కటయ్యారు. ఈ జంటకు 1964లో కమలా హ్యారిస్ జన్మించారు. ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడు శ్యామలా, డోనాల్డ్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శ్యామల ఒంటరిగానే పిల్లలిద్దర్నీ పెంచి పెద్ద చేశారు. ‘‘సమస్యలు గురించి బాధపడటం మాని వాటిపై పోరాడి, పరిష్కరించడాన్ని తల్లిని చూసే నేర్చుకున్నాను’’ అని కమలా హ్యారిస్ ఓ సందర్భంలో చెప్పారు. తల్లి అవసాన దశలో తాను ఆమెకు దగ్గరుండి సేవలు చేశానని కూడా ఓ సందర్భంలో తెలిపారు.
Updated Date - Nov 03 , 2024 | 12:48 PM