NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు
ABN, Publish Date - Nov 27 , 2024 | 09:25 PM
టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..
తెలుగు భాష గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతూ.. భాష ఔనత్యాన్ని భావి తరాలకు చాటి చెప్పాలనే గురుతర బాధ్యతతో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే నెల నెలా తెలుగు వెన్నెల 208వ సాహిత్య సదస్సు డాలస్ నగరంలో నిర్వహించారు. లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతం తో సదస్సును ప్రారంభించారు. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ప్రముఖ రచయిత సత్యం మందపాటి రచయిత మధురాంతకం రాజారాం, నరేంద్రతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. మధురాంతకం రాజారాం మేనల్లుడు భాస్కర్ పులికల్ రాజారామ్తో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్రతో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించారు.
ముఖ్య అతిథి ఏమన్నారంటే..
నెల నెలా తెలుగు వెన్నెల 208వ సాహిత్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ తన తండ్రి మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. తద్వారా కథ చదివే ప్రతి వ్యక్తి ద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్ష గా పేర్కొన్నారు. తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరిగిన, జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడు అని రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందని, తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినప్పుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చునన్నారు. మననుండి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిల్, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు ,మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు.
మధురాంతకం రాజారామ్తో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి సాహితీ ప్రియులతో పంచుకున్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి , చంద్రహాస్ మద్దుకూరి, డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటిలు నరేంద్ర ప్రసంగంపై తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. ఆ తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధ్యక్షులు హరి సింఘం, సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్రకు టాంటెక్స్ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సత్కరించారు. ఎంతోమంది సాహితీ ప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ ఆచార్య మధురాంతకం నరేంద్ర తన కృతజ్ఞతలు తెలియజేశారు. సభలో ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. దయాకర్ మాడ వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సదస్సులో అధ్యక్షులు సతీష్ బండారు తన అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ , సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకు, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 27 , 2024 | 09:26 PM