NRI: దుబాయిలో తెలుగు ముఠాల బ్యాంకు మోసాలు
ABN, Publish Date - Feb 26 , 2024 | 03:30 PM
దుబాయిలో తెలుగు ముఠాల ఆర్థిక మోసాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో సునాయాసంగా లభించే బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డుల విధానాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు తెలుగు ప్రవాసీ వ్యాపారవేత్తలు భారీ ఎత్తున మోసాలకు (Financial Fraud) పాల్పడుతున్నారు. దుబాయి టూర్ పేర మరీ యువకులను తీసుకువచ్చి దర్జాగా ఈ కుంభకోణం చేస్తున్నారు. బ్యాంకులకు తిరిగి చెల్లించవల్సిన గడువులోపే బురిడి కొట్టి స్వదేశానికి తిరిగి పంపిస్తున్నారు.
ఈ రుణాలను పొందే అర్హత కోసం ఏకంగా నకిలీ కంపెనీలను సృష్టిస్తూ వాటి పేర అడ్డదారిలో ఉపాధి వీసాలను పొంది మరీ ఈ అడ్డగోలు దందాకు పాల్పడుతున్నారు. ఉపాధి వీసాపై పని చేస్తూ మూడు నెలల వేతనం పొంది ఉంటే విదేశీయులకు దుబాయిలోని బ్యాంకులు సులభంగా అప్పులు మంజూరు చేస్తాయి. క్రెడిట్ కార్డులూ జారీ చేస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకొని నూతనంగా తెలుగు రాష్ట్రాల నుండి యువకులను తీసుకొచ్చి వారికి ప్రతినెలా సక్రమంగా వేతనాలు చెల్లిస్తున్నట్లుగా రికార్డులు చూపి బ్యాంకులను మోసం చేస్తున్నారు. ఈ ఉద్యోగుల పేర డెబిట్, క్రెడిట్ కార్డులు ఈ ముఠాలే తమ వద్ద ఉంచుకొంటూ వారి పేర లావాదేవీలన్నీ జరుపుతాయి. ఈ మొత్తం తతంగంలో సెల్‌ఫోన్ సిమ్ కార్డు కీలకం కాగా వాటినీ సూత్రధారులు తమ వద్దే ఉంచుకొని మొత్తం తతంగం నడుపుతున్నారు.
Indian Passports: భారత్‌లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్‌పోర్టుల జారీ! సగటున ఒక రోజులో..
పదవ తరగతి ఉత్తీర్ణులై ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేని వారికి పది, పదిహేను వేల దిర్హాంలు (సుమారు రెండు, మూడు లక్షల రూపాయాలు) వేతనాన్ని ఠంచనుగా వేజ్ ప్రొటెక్షన్ సిస్టం క్రింద అభ్యర్థుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
కొన్ని సందర్భాలలో యువకులను మోసం చేస్తుండగా అత్యధిక కేసులలో మాత్రం వారి సమ్మతితో వారికి ఆకర్షణీయ ప్యాకేజీలు ఇస్తూ దుబాయికి తీసుకొచ్చి ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారు.
బ్యాంకు రుణాలలో చేరి సగం వాటా అని చెప్పి రుణాలు పొందిన తర్వాత అసలైన అభ్యర్థుల చేతిలో కొంత పెట్టి మిగిలిందంతా కుట్రదారులు స్వాహా చేస్తున్నారు. ఇక క్రెడిట్ కార్డుల విషయంలో కూడా క్యాష్ అడ్వాన్స్ తీసుకొని కైంకర్యం చేస్తున్నారు. వాటాల పంపకంలో విబేధాలు రావడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన కొందరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కొందరు యువకులు ఇటీవల ఏకంగా నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీసుకొన్న డబ్బు తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరిగి డిఫాల్ట్ అయిన తర్వాత మాత్రమే వీరిని బ్లాక్ లిస్ట్ చేసి దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధిస్తారు కానీ ఈ ప్రక్రియ కంటే ముందే వీరు హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళిపోతున్నారు. తెలియకుండా ఎవరైనా తిరిగి మళ్ళి దుబాయికు వస్తే మాత్రం విమానశ్రాయంలో అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే దుబాయిలో పని చేస్తున్న వారిని గుర్తించి వారికి ఆశ చూపి వారి పేర రుణాలు పొందడం ఒక పద్ధతి కాగా కొత్త వారిని తెలుగు రాష్ట్రాల నుండి తీసుకువచ్చి వారి పేర రుణాలు, కార్డులు పొందడం మరో పద్దతి.
దుబాయి, షార్జా నగరాలలో వ్యాపార ప్రముఖులుగా చలామణీలో ఉన్న కొందరు తెలుగు ప్రముఖులు కూడా ఈ ముఠాలను పరోక్షంగా నడుపుతున్నారని అరోపణలు ఉన్నాయి. బ్యాంకులలో పని చేసే కొందరి ప్రమేయం కూడా ఈ కుంభకోణంలో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
పాండు కార్డులుగా దుబాయిలోని కొన్ని తెలుగు వర్గాలలో పిలిచే ఈ విధానానికి దుబాయిలో మొదట్లో తెలంగాణలో ఇటీవల పోటి చేసిన ఒక నాయకుడు శ్రీకారం చుట్టగా దాన్ని ఇప్పుడు ఇతరులు అనుసరిస్తున్నారని తెలుస్తోంది.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 26 , 2024 | 03:39 PM