NRI: సౌదీలో తెలుగు రోగి భాష రాక డబ్బులు లేక విలవిల
ABN, Publish Date - Oct 10 , 2024 | 07:27 AM
ఏపీకి చెందిన ఓ పేద కార్మికుడు సౌదీలో ప్రమాదం బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక, భారత్‌కు తిరిగి రాలేక నరకం అనుభవిస్తున్నాడు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పేరుకు ప్రవాసం అయినా సరిగ్గా తినడానికి తిండిలేని ప్రవాసీయులు వారు. ఒక రోజు కూలీ లభిస్తే వచ్చే డబ్బుతో తాము తినడమే కాకుండా స్వదేశంలోని ఇంట్లో పొయ్యి వెలిగించే దుస్థితి వారిది. అందులో అఖమా లేకుండా దాక్కొంటూ నివాసముంటూ దొరికితే కూలీ లేకుంటే ఆకలితో ఉండే పేదలు అయినా వారందరూ పెద్ద మనుషుల కంటే కూడ పెద్దలు. మనస్సున్న మహారాజులు ఆ తెలుగుబిడ్డలు (NRI).
సౌదీ అరేబియాలోని రియాధ్‌లో అఖమా లేకుండా కూలీ పనులు చేసుకొనే తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సనబోయిన సాయిబాబా అక్రమంగా పని చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే అతను వారం క్రితం ప్రమాదవశాత్తు గాయపడగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసియూలో ఉంచి చికిత్స చేశారు. 15 వేల రియాళ్ళు డిపాజిట్ చేయవల్సిందిగా ఆసుపత్రి డిమాండ్ చేయడంతో అతనితో పాటు కలిసి కూలీ పనులు చేసుకొనే తెలుగువారందరు తల కొంత మొత్తం చెల్లించగా వారు పడుతున్న కష్టాలను చూసిన పాకిస్తానీ, ఇథియోపియో దేశాల కార్మికులు కూడా తమకు తోచిన విధంగా సహాయం చేయడంతో ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.
సాయిబాబా ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అతనితో పాటు కలిసి పని చేసే తోటి తెలుగు ప్రవాసీయులు రవి బట్టల, వెండ్ర సత్యనారాయణ, కంఠంశెట్టి కేశవరావు, కేత దుర్గా ప్రసాద్‌లు తమ పనులు వదులుకొని ఆసుపత్రిలో సాయిబాబను కంటికి రెప్పలా చూసుకొంటున్నారు.
NRI: తానా బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా సుబ్బా యంత్ర
ఆసుపత్రి మొత్తం బిల్లు 30 వేల రియాళ్ళు కాగా మరో 15 వేల రియాళ్ళు చెల్లిస్తే గానీ సాయిబాబను విడుదల చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తుండడంతో డబ్బు లేక దిక్కుతోచని పరిస్థితిలో విలవిల్లాడిపోతున్నారు. రవి బట్టల గుంపు మేస్త్రీ ఆధ్వర్యంలో పని చేసే వీరందరూ కూడా దినసరి కూలీలు. ఒక పూట తిని పని లేకుంటే మరో పూట పస్తులుండే దయనీయస్థితి వీరిది. తమ శక్తిసామర్థ్యానికి మించి వీరు మొదటి విడతల బిల్లు కట్టారు. తమ కుటుంబాలకు కూడా డబ్బు పంపించకుండా తమ తోటి తెలుగువాడయినందున సాయిబాబాకు అండగా నిలిచామని అన్నారు. ఇప్పుడు మిగిలిన డబ్బు ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆసుపత్రికి చెల్లించవల్సిన బాకీ 15 వేల రియాళ్ళతో పాటు డిశ్చార్జి అయిన తర్వాత మందులు, స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి విమాన టిక్కెట్‌ను తలుచుకొంటే తమకు భయమేస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు.
NRI: వైభవంగా టీపాడ్ బతుకమ్మ, దసరా వేడుకలు
భాషా సమస్యతో ముప్పు
వైద్యులు అరబ్బు లేదా ఆంగ్ల భాషాలలో మాట్లాడుతూ రోగి పరిస్థితిని వివరిస్తుండడంతో ఒక్క తెలుగు భాష తప్ప ఇతర ఏ భాషలు రాని సాయిబాబా తోటి కార్మికులు డాక్టర్ చెప్పిన అరబ్బి మాటలను విడియా రికార్డింగ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ ఆసుపత్రి సెక్యూరిటి సిబ్బందిని పిలిపించి వీరిపై చర్యలు తీసుకోవల్సిందిగా చెప్పడంతో సైగల ద్వారా తమకు భాష రాదని, ఈ విడియోను తమ తోటి కార్మికుడు ఒకరికి చూపిస్తే అతను అరబ్బి నుండి తెలుగులో అనువాదం చేస్తాడనే ఉద్దేశ్యంతో రికార్డు చేసామని వివరించడతో డాక్టరు కూడా వీరి పరిస్ధితిపై జాలి పడ్డాడు.
ఈ ఆసుపత్రి బిల్లుతో పాటు సాయిబాబా వద్ద అఖమా లేకపోవడంతో అతను స్వదేశానికి తిరిగి వెళ్ళడం కూడా అంత సులువు కాదు.
సాయిబాబా దయనీయ స్థితిపై స్పందించిన సాటా సభ్యులు గోపాల్, సత్తిబాబులు విషయాన్ని సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ షేక్ దృష్టికి తీసుకురాగా ఆయన రోగిని పరామర్శించారు. త్వరగా డిశ్చార్జి చేయడం ద్వారా బిల్లు పెరగకుండా చూడాలని ఆసుపత్రి వారిని కోరారు.
సాయిబాబాను భారతీయ ఎంబసీ, సౌదీ అధికారుల సహాయంతో వీసా రద్దు చేసి ఎగ్జిట్‌పై పంపించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా ముజ్జమ్మీల్ వెల్లడించారు. సాయిబాబాకు సహాయం చేయాలనుకొనే వారు 919866202421 పై ఫోన్‌పే చేయవచ్చని ముజ్జమీల్ సూచించారు.
తమకు వీలయిన విధంగా ఆపదలో ఉన్న తెలుగు వారికి చేయూత అందిస్తామని సాటా కోఫౌండర్ (రియాధ్) రంజీత్ పేర్కొన్నారు.
Updated Date - Oct 10 , 2024 | 09:11 AM