NRI: ఎమిరేట్స్‌లో తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో వనభోజనాలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:22 PM
యూఏఈలో ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి ఇటీవల నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమం అక్షరాల వసుధైక కుటుంబాన్ని ప్రతిబింబించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవిత్ర కార్తీక మాసం గడువు పూర్తి కావాల్సి వస్తుండడంతో గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రవాసీయులలో కార్తీక వన భోజనాలు ఊపందుకుంటున్నాయి (NRI).
ఎమిరేట్స్ ఎడారి అయినా కూడా బృందావనంలో శ్రీ కృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడు, తోటి గోప బాలకులతో కలిసి బృందావనంలో వనభోజనాలు చేసినట్లుగా ఇతిహాస ప్రేరణతో యూఏఈలో ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి ఇటీవల నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమం అక్షరాల వసుధైక కుటుంబాన్ని ప్రతిబింబించింది. దుబాయి, షార్జా, రాస్ అల్ ఖైమా, అబుదాబిలతో సహా అన్ని ఎమిరేట్ల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొన్న కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుండి ప్రత్యేకంగా తెప్పించిన ఉసిరి కాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు
దేవతా వనాల మధ్య వేద శ్లోకాలతో, దీపారాధనతో ఆధ్యాత్మిక వెల్లివిరిసిన ఈ కార్యక్రమానికి తెలుగు వారి ఆత్మీయత కూడా తోడు కావడంతో సభికులు పరవశించిపోయారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన తెనాలికి చెందిన సురేఖ పట్నంను కార్యక్రమ అనంతరం అందరూ అభినందనలతో ముంచెత్తారు. స్వదేశం కంటే కూడా మిన్నగా భక్తి శ్రధ్ధలతో కార్తీక మాస వనభోజనాలను జరుపుకొన్న అనుభూతి కలిగిందని అబుదాబి నుండి బస్సులో వచ్చిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సమీర వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో దుబాయి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు వివేకానంద బలుస కార్యదర్శి కె. విజయభాస్కర్ రెడ్డి, మీడియా కార్యదర్శి ఫహీం, మహిళా విభాగం అధ్యక్షురాలు ఫ్లోరెన్స్ విమల, ప్రముఖులు శతర్ యల్చూరి, ఇప్పిరలి సమీర, తెలుగు అసోసియేషన్ అబుదాబి (తాడ్) ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హరి, భాస్కర్ గుప్తా, విష్ణు, శ్రవణ్, ధనుంజయ, రవి, వెంకీ, యు.కె.యస్ ప్రముఖులు అప్పారావు, స్వామి, అప్పాజీ, డి. నాగేంద్రలు పాల్గొన్నారు.
NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన
కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు తరంగిణి ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి రాజేశ్ కార్యదర్శి నంద, బ్రహ్మ, రామ శేషు, ప్రసాద్, వీర, లక్ష్మణ, శరత్, వీరేంద్ర, శివానంద, కేదార్, విజయ, అనిల్, కిరణ్, డాక్టర్ రాఘవేంద్ర, ఇతర కార్యవర్గాన్ని అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకట సురేశ్ మాట్లాడుతూ రానున్న సంక్రాంతి సంబురాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యచరణకు శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. జనవరి 12న సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 03:22 PM