డాలస్, టెక్సాస్: అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20న జన్మదినం సందర్బంగా డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం)లో అక్కినేని అభిమానులందరి మధ్య ఏఎన్నార్ శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షుడు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎ.ఎఫ్.ఎ ప్రస్తుత అధ్యక్షుడు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు.