Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?
ABN, Publish Date - Jun 09 , 2024 | 01:02 PM
పోలింగ్ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..
కొంపముంచిన క్రాస్ ఓటింగ్
కిరణ్‌ను దెబ్బతీసిన మైనార్టీలు
20,448 ఓట్లతో గెలవాల్సిన బీజేపీ..
70,071 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుపు
రాజంపేట పార్లమెంట్ పరిధిలో జరిగిన భారీ క్రాస్ ఓటింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంప ముంచింది. కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసిన వారంతా పార్లమెంటు విషయంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆ నాలుగుచోట్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసినా, పార్లమెంటు విషయంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి (Nallari Kiran Kumar Reddy) కాకుండా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఓటు వేశారని స్పష్టమవుతోంది.
అసలేం జరిగింది..?
అన్నమయ్య జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీ విజేతల ఓట్లను లెక్కిస్తే క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అంశం నిర్ధారణ అవుతోంది. జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాయచోటి, రైల్వేకోడూరులో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వీరికొచ్చిన మెజార్టీ లెక్కిస్తే 44,186 ఓట్లు నమోదయ్యాయి. అలాగే తంబళ్లపల్లె, రాజంపేట, పుంగనూరులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరి మెజార్టీ తీసుకుంటే 23,738 ఓట్లు నమోదయ్యాయి. అయితే పార్లమెంటులో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి 76,071 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదిలా ఉండగా కూటమి అభ్యర్థులు ఎం.షాజహాన్‌బాషా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, అరవ శ్రీధర్ ఓట్లు మొత్తం కలిపి మెజారిటీ 44,186 ఓట్లు వచ్చాయి. అలాగే వైసీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మొత్తం మెజారిటీ ఓట్లు 23,738 ఓట్లు ఉన్నాయి. విజయం సాధించిన నలుగురు కూటమి అభ్యర్థుల మెజారిటీ ఓట్లను, ముగ్గురు వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లలో తీసేస్తే 20,448 ఓట్లు మిగులుతాయి. ఈ ఓట్లతో రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మెజారిటీతో గెలివాల్సి ఉంది. కానీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కంటే 76,071 ఓట్లతక్కువతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. అంటే కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసిన వారంతా పార్లమెంటు విషయంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆ నాలుగుచోట్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసినా, పార్లమెంటు విషయంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి కాకుండా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఓటు వేశారని స్పష్టమవుతోంది.
అంచనాలు తారుమారు..
పోలింగ్ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అలాగే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల విష యంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ తీరా చూస్తే అనుకున్నది ఒకటైతే.. అక్కడజరిగింది మరొకటి కావడంపై అటు అభ్యర్థులే కాదు..రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న మదనపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరులోని ఓటర్లు ఎక్కువగా వైసీపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. బీజేపీకి కాదనుకున్నా.. వారంతా అటు వైసీపీకి లేదా పెద్దిరెడ్డి కుటుంబానికి ఓటు వేయడానికి ఇష్టపడని వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నది ఫలితాలను బట్టి వెల్లడవుతోంది.
సానుకూలత ఉన్నా...
సీఎం హోదాలో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు, ముఖ్యంగా పీలేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూలత ఉన్నా బీజేపీ గుర్తుకు ఓటు వేయలేదని చెబుతున్నారు. అదే టీడీపీ నుంచో లేక జనసేన నుంచి పోటీ చేసి ఉన్నా.. నమోదైన ఫలితాల మేరకు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా 20,448 ఓట్ల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేకు ఓటు వేసిన ఓటరే.. ఎంపీకి కూడా వేసేవారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా చేసిన ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 6,250 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జి.శంకర్‌యాదవ్‌తో ఓడిపోతే, అదే నియోజకవర్గంలోని వైసీపీ నుంచి రాజంపేటకు పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుమారు పదివేల ఓట్లు మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా మెజార్టీ పరిశీలిస్తే...
మదనపల్లెలో కూటమి అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా (97,980 ఓట్లు), సమీప ప్రత్యర్థి ఎస్.నిసార్ అహమ్మద్ (92,471 ఓట్లు)పై 5,509 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పీలేరు నుంచి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి(1,05,582), సమీప వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి(80,501)పై 25,081 ఓట్ల మెజారీతో గెలుపొందారు. రాయచోటి నుంచి కూటమి అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి(95,925), ప్రత్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి (93,430)పై 2,495 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రైల్వేకోడూరులో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ (78,594), ప్రత్యర్థి కొరముట్ల శ్రీనివాసులు (67,493)పై 11,101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, రాజంపేట వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (92,609), ప్రత్యర్థి, కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం (85,593)పై 7,016 ఓట్ల మెజారిటీ సాధించారు. తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి (94,856), కూటమి అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి (85,119)పై 10,103 ఓట్ల మెజారిటీ సాధించారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (99,774), కూటమి అభ్యర్థి చల్లా బాబురెడ్డి (93,155)పై 6,619 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.
Updated Date - Jun 09 , 2024 | 01:18 PM