‘అభయ్‌ ప్రభావన’ ఓ ఆలోచనాత్మక మ్యూజియం

ABN, Publish Date - Nov 17 , 2024 | 06:56 AM

మానవ నాగరికత వికాస పరిణామం అనేక దారుల్లో సాగింది. బౌద్ధం, జైనం... ఎన్నో శతాబ్దాలుగా ఈ భూమిపై విరాసిల్లుతూనే ఉంది. ఎన్నో ప్రాంతాల్లో ఆయా ధర్మాలు, సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలో జైన మతం విలసిల్లిన పాలేజైన గుహలకు సమీపంలో ఆధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన ‘అభయ్‌ ప్రభావన మ్యూజియం’ ఇటీవల ప్రారంభ మైంది.

‘అభయ్‌ ప్రభావన’ ఓ ఆలోచనాత్మక మ్యూజియం

మానవ నాగరికత వికాస పరిణామం అనేక దారుల్లో సాగింది. బౌద్ధం, జైనం... ఎన్నో శతాబ్దాలుగా ఈ భూమిపై విరాసిల్లుతూనే ఉంది. ఎన్నో ప్రాంతాల్లో ఆయా ధర్మాలు, సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలో జైన మతం విలసిల్లిన పాలేజైన గుహలకు సమీపంలో ఆధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన ‘అభయ్‌ ప్రభావన మ్యూజియం’ ఇటీవల ప్రారంభ మైంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద జైన మ్యూజియం. దాని విశేషాలే ఇవి...


జైనమత సంస్కృతీ సంప్రదాయాలు నేటి తరానికి ఆచరణీయం. అహింస, సత్యం, దయ, క్షమ, నీతి, నిజాయితీ లాంటి సదాచారాలను వందల ఏళ్ల క్రితం నుంచే ప్రభోధిస్తూ జైన మత బోధకులు నడయాడిన ప్రాంతంలో... వాటి ఆచరణతో కలిగే దివ్యానుభూతిని పొందడానికి అనువుగా ‘అభయ్‌ ప్రభావన’ మ్యూజియం ఆవిర్భవించింది. భారతీయ వైభవ వారసత్వ సంస్కృతీ సంప్రదాయ విలువలను ప్రతి ఒక్కరికీ చాటి చెప్పాలనే లక్ష్యంతో ఈ మ్యూజియంను ఏర్పాటుచేశారు.

100 అడుగుల ‘మనస్థంభం’

పూణే నుంచి ముంబై వెళ్లే దారిలో (50 కిలోమీటర్లు) పర్వాడి అనే గ్రామం ఉంది. దాని శివారు ఇంద్రాయణినదీ తీరంలో సుమారు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 400 కోట్లతో, 10 ఏళ్లు కష్టపడి ఆధునిక హంగులతో జైన మ్యూజియాన్ని నిర్మించారు.


‘మ్యూజియం ఆఫ్‌ ఐడియాస్‌’గా వలయాకారంలో విస్తరించిన దీని నిర్మాణం మధ్య భాగంలో... సుమారు 100 అడగుల ఎత్తులో చతుర్ముఖంగా నిర్మించిన ‘మనస్థంభం టవర్‌’ జైనమత చరిత్రను ప్రదర్శిస్తుంది. పశుపక్ష్యాదులు, జంతుజీవాలు... అనంతరం మానవ జన్మతో సదాచార సంపన్నులై, దైవకృపతో మోక్షం పొందే మార్గాలను ‘మనస్థంభం’ సందర్శకులకు ప్రబోధిస్తుంది. చుట్టూ వలయాకారంలో 30 గ్యాలరీలతో విస్తరించిన మ్యూజియంలో సుమారు 350కి పైగా అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇవి జైనమత విలువల్ని వివరిస్తాయి. జైన సన్యాసుల విగ్రహాలు, దిగంబరుల ప్రతిమలు వారు సజీవంగా ఉన్నట్టు భ్రమింపజేస్తాయి.


ఇక్కడే పాలరాతితో చేసిన సరస్వతి దేవి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయా గ్యాలరీల్లోని కళాఖండాల గురించి, జైన మత సిద్దాంతాల గురించి హిందీ, ఇంగ్లీష్‌లో ఆడియో వీడియో ప్రదర్శనలు, ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మ్యూజియంలోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన పురాతన శిల్పసంపద గూర్చి తెలుసుకునేందుకు ఎల్‌ఈడీ టీవీ, కియోస్కోలు, 8 వేలకు పైగా లైటింగ్‌ పిక్చర్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లోని అనేక మ్యూజియాల పనితీరును అధ్యయనం చేసిన నిపుణులు ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించారు. ఈ తరహా మ్యూజియం మన దేశంలో ఇదే మొదటిదని చెప్పొచ్చు.


నాలుగు విభాగాలుగా...

మ్యూజియం ముఖ్యంగా నాలుగు విభాగాలుగా, 15 ప్రత్యేక గ్యాలరీలుగా ఉంటుంది. మొదట జైన మత మూల సిద్ధాంతాన్ని అక్కడ ఏర్పాటుచేసిన కళా ఖండాల ద్వారా అవగాహన చేసుకోవచ్చు. జైన మతాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన 24 మంది తీర్థంకరుల పాలరాతి ప్రతిమలు జీవ కళతో దర్శనమిస్తాయి. ఇక ఆయా తీర్ధంకరుల ప్రత్యేకత, వారి జన్మస్థలం, వారి ఉద్భోదల సారాంశం తదితర అంశాలను ఆడియో వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. చరిత్ర, జాతికి అందించిన సందేశాలను, సాంస్కృతిక పరిణామాలను తెలుసుకునేందుకు రెండో విభాగం గ్యాలరీలను కేటాయించారు.


జైనుల మత విధానాలు, పూజలు, చారిత్రక మందిరాల ప్రతిరూపాలతో మూడో విభాగాన్ని విస్తరించారు. ఆరుబయట సువిశాల క్షేత్రంలో ఇంద్రాయణి నదీలోయ పైభాగంలో ఎత్తయిన వేదికపై ధ్యానముద్రలో జైనుల తొలి తీర్థం కరుడైన వృషభదేవ్‌ విగ్రహం, ఆలయ నిర్మాణ నమూనాలో మహావీరుని నిలువెత్తు శిల్పాలు, పురాతన శిల్పకళను ప్రతిబింబించే స్వాగత తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఎంతో మంది జైన పరిశోధకులు, మత బోధకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ‘అభయ్‌ ప్రభావన మ్యూజియం’ ఒక అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- వరకాల యాదగిరి,

99854 11061


ఇక్కడి పాలే గ్రామానికి సమీపంలో ఉన్న పాలే గుహ 2200 ఏళ్ల క్రితం జైనమత ప్రచారకుల కేంద్రంగా గుర్తింపు పొందినట్టు చరిత్ర స్పష్టం చేస్తోంది. కొంకణ్‌ నుంచి కుసుర్‌, ధాక్‌ సమీపంలోని దక్కన్‌ పీఠభూమి వరకు పశ్చిమ ఘాట్‌ శిఖరం పైకి ఎక్కే పురాతన వాణిజ్య మార్గానికి పాలే దగ్గరగా ఉంది. ఈ మార్గం దక్కన్‌ పీఠభూమిలోని తూర్పు ఆర్థిక కేంద్రాల నుంచి భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న సోపారా, కళ్యాణ్‌ ఓడరేవులకు సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించినట్టు చరిత్రకారులు గుర్తించారు. దీనికి సమీపంలోనే ప్రసిద్ధ బౌద్ధ మతానికి చెందిన కార్లే గుహలు, భాజే గుహలు బెడ్సే గుహలున్నాయి.

Updated Date - Nov 17 , 2024 | 06:56 AM