ABN Andhra Jyothi: జనం గొంతుకగా నిలిచిన దమ్మున్న ఛానెల్
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:09 PM
ఏబీఎన్ మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఏడాది ఏబీఎన్‌కు నవ వసంతమే. పండుగ కంటే ప్రజలే ముఖ్యమనుకునే ఛానెల్ ఏబీఎన్. అందుకే అనుభవాన్ని, అనుభూతిని అందుకుంటూ.. దాన్ని తెలుగు ప్రజల ప్రయోజనానికి వినియోగిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఛానెల్ ఆవిర్భావమే సెన్సెషనైతే.. ప్రతినిత్యం సహేతుకమైన జర్నలిజంతో ముందుకు సాగుతోందీ ఏబీఎన్...
అక్షరమే ఆయుధం, దృశ్యమే అస్త్రం. అక్రమార్కుల పాలిట గాండీవం, బాధితులకు శ్రీరామ రక్ష అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్థానం. జనం గొంతుకై, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే పాలకులకు సింహస్వప్నమై.. జర్నలిజానికి తిరుగులేని నిర్వచనమై... పోరాటయోధులకు మార్గదర్శనమై.. నిన్న.. నేడు.. రేపు ఒకే తీరున నడుస్తున్న ఏకైక ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. సమస్య ఎవరిదైనా... పోరాటం నాదేనంటూ.. బాధితులెవ్వరైనా... ఆపన్నహస్తం నాదేనంటూ క్షణక్షణం ముందుకు సాగుతోందీ తెలుగు ప్రజల ఏబీఎన్.
నిన్న ఛైల్డ్ ప్రాడిజీ..నేడు టీనేజ్ సెన్సేషన్...
ఎంట్రీ ఇచ్చింది మొదలు..అలుపెరుగని పోరాటమే...
కష్టపెట్టిన ప్రతీ ఒక్కరిపై పోరాడి గెలిచింది...
నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావ్....
అలుపెరగని పోరాటం
నిన్న ఛైల్డ్ ప్రాడిజీ.. నేడు టీనేజ్ సెన్సేషన్. పురుడు పోసుకుని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలోకి ఎంట్రీ ఇచ్చిందీ మొదలు....అలుపెరుగని పొరాటమే కొనసాగింది. కష్టాల్ నష్టాల్ వస్తే రానీ,,, పోతే పోనీ.. అన్నట్లుగా ప్రతీ కష్టాన్ని ఏబీఎన్ నవ్వుతూ ఎదుర్కొంది. కష్టపెట్టిన ప్రతీ ఒక్కరిపై పోరాడి ఓడించింది. తన పోరాటం ప్రజల కోసమేనని ప్రతీ సారి నిరూపించింది. అందుకే ఏబీఎన్ దమ్మున్న ఛానెల్ అయ్యింది. దృఢనిశ్చయంతో ఆటంకాలను తృణప్రాయంగా పక్కకు నెట్టింది. నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావ్ అని గట్టిగా హెచ్చరించి.. అవి ఉడుత ఊపులు కాదని, తాటాకు చప్పుళ్లు కూడా కాదని నిరూపించింది.
మరో వసంతంలోకి అడుగుపెట్టిన ఏబీఎన్
తెలుగు ప్రజల ప్రయోజనమే లక్ష్యం
ఏబీఎన్ మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఏడాది ఏబీఎన్‌కు నవ వసంతమే. పండుగ కంటే ప్రజలే ముఖ్యమనుకునే ఛానెల్ ఏబీఎన్. అందుకే అనుభవాన్ని, అనుభూతిని అందుకుంటూ.. దాన్ని తెలుగు ప్రజల ప్రయోజనానికి వినియోగిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఛానెల్ ఆవిర్భావమే సెన్సెషనైతే.. ప్రతినిత్యం సహేతుకమైన జర్నలిజంతో ముందుకు సాగుతోందీ ఏబీఎన్...
దిక్కులు అదిరేలా గర్జించిన ఏబీఎన్ గొంతు
జూలు విదిల్చి జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించింది
కొత్త నెత్తుటి అలజడిని అక్షరాల్లోకి తెచ్చిన ఘనత వేమూరి రాధాకృష్ణదే...
జర్నలిస్టే యజమాని, యజమానే జర్నలిస్టు
జ్యోతి వెలిగించిన అక్షర జ్వాలకు దృశ్యం తోడైంది...
ఐఎస్‌ఐ మార్క్ తరహాలో ఆర్కే మార్క్
నిషేధాలను కూడా నిబ్బరంగా ఎదుర్కొన్న ఏబీఎన్
అంతా మౌనవ్రతం పూనినప్పుడు, మనకెందుకు రిస్కు అని గొంతులన్నీ ఒక్కొక్కటిగా మూగబోతున్నప్పుడు, కనీసం గుసగుసలు కూడా వినిపించని వింత కాలంలో ఒక గొంతు దిక్కులు అదిరేలా గర్జించింది. జూలు విదిల్చి జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ గర్జించిన నాలుగో సింహం ఆంధ్రజ్యోతి. జ్యోతి పునరుజ్జీవనం తెలుగునాట జర్నలిజానికి రినైజాన్స్ వంటిది. జర్నలిజంలో అంత నిజాయితీ, అంతటి నిర్భీతి, అంత దూకుడు, అంతటి సాహసం, అంతకు మించిన నిబద్ధత అంతవరకు లేవు. ఈ కొత్త నెత్తుటి అలజడిని అక్షరాల్లోకి తీసుకొచ్చిన ఘనత జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణది. నాన్ ప్లేయింగ్ కెప్టెన్లతో, నామ్ కే వాస్తే సంపాదకీయాలతో పత్రికలను హస్తభూషణంగా మార్చుకున్న అధిపతుల పరంపరకు బ్రేక్ వేసిన ఘనత కూడా ఆర్కేదే. జర్నలిస్టే యజమాని, యజమానే జర్నలిస్టు. ఇక కలాలు కదం తొక్కకుండా ఉంటాయా! అక్షరాన్ని ఆయుధం చేసి జనం చేతిలో పెట్టకుండా ఎలా ఉంటాయి!! ఇదీ తెలుగు జర్నలిజంలో జ్యోతి వెలిగించిన జ్వాల. 2009లో ఈ అక్షరానికి దృశ్యం తోడైంది. దమ్మున్న ఛానెల్ గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుమ్మురేపి చూపింది. సాహసం సవ్యసాచి అయింది. నాణ్యతకు ఐఎస్ఐ మార్క్ ఎలాగో సాహసానికి ఆర్కే మార్క్ అలా స్థిరపడిపోయింది. అది ప్రభుత్వమైనా, పార్టీ అయినా 'మఠమైనా, మందిరమైనా' ఆ వ్యక్తి సిఎం అయినా, స్వామీజీ అయినా… చివరికి రాజ్యాంగపరమైన రక్షణల మాటున దాగి ఉన్న వారిని సైతం దమ్మున్న ఛానెల్ ఏబీఎన్ దుమ్ము దులపకుండా ఉండలేదు. సాహసాన్ని మడిచి కోల్డ్ స్టోరేజీలో దాచి పెట్టలేదు. నిషేధాలను కూడా నిబ్బరంగానే ఎదుర్కొంది. ఈ సాహసమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని అనితరసాధ్యంగా మార్చింది. జనంలోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించి పెట్టింది. ఏబీఎన్ అనగానే ఆడు మగాడ్రా బుజ్జీ తరహా కామెంట్లతో పబ్లిక్ తమ ప్రేమను ప్రకటిస్తున్నారు. ఆర్కే సాహసోపేత సారథ్యానికి హాట్సాప్ చెబుతున్నారు.
దమ్మున్న వార్తలకు డెస్టినేషన్
స్పెషల్ డిబేట్స్‌కు అసలైన స్క్రీన్
ప్రత్యేక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రెస్
ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించిన ఏబీఎన్
వార్తల వెనకున్న వాస్తవాలకూ ప్రత్యేక స్థానం
నిజాల నిగ్గు తేలుస్తూ.. అక్రమార్కుల భరతం పడుతూ...
అవసరార్ధుల ఆవేదనను ప్రదర్శిస్తూ పయనం
ప్రజల పక్షానే నిలబడి ఏబీఎన్ పోరాటం
ప్రజలకోసం బిగ్‌డిబేట్‌లు నిర్వహణ
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. దమ్మున్న వార్తలకు డెస్టినేషన్. స్పెషల్ డిబేట్స్‌కు అసలైన స్క్రీన్. ఛానెల్ ప్రారంభమైంది మొదలు.. యేటికేడూ తన ప్రసారాలకు పదును పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేస్తూనే ఉంది. జనానికి ఏది అవసరమో అది అందరికంటే ముందే టెలికాస్ట్ చేస్తోంది.ఈ ప్రయాణంలో ఎన్నో, ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించింది ఏబీఎన్. ప్రజలకు అవసరమైన, ప్రజా ప్రయోజనమైన, బాధితులకు ఆసరాగా ఉండే కథనాలను అందిస్తూనే ఉంది. వార్తల ప్రసారమే కాదు.. వార్తల వెనక ఉన్న వాస్తవాలను కూడా శోధిస్తూ స్టోరీలను రూపొందిస్తోంది. నిజాల నిగ్గు తేలుస్తూ.. అక్రమార్కుల భరతం పడుతూ, అవసరార్ధుల ఆవేదనను జనం ముందుకు తీసుకొస్తూ శరవేగంగా దూసుకెళ్తోంది.ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసినా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు.. జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసినా, నష్టదాయకంగా పరిణమించినా చూస్తూ ఊరుకోలేదు ఏబీఎన్. బిగ్‌డిబేట్‌లు నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహిస్తోంది. ప్రభావితమయ్యేవాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను, నిర్ణయాలను విశ్లేషిస్తోంది.
ఛానెల్ ఆవిర్భావం నుంచి ఎన్నెన్నో కుంభకోణాలు వెలికితీత
అక్రమాలను దనుమాడింది.. మోసాలను ఎండగట్టింది...
దేనికీ మినహాయింపు ఇవ్వలేదు..
ఎవరినీ వదిలిపెట్టలేదు...
నిరంతరం తెరుచుకొని ఉండే ఏబీఎన్ కెమెరా కన్ను
ఛానెల్ ఆవిర్భావం నుంచీ ఎన్నో, ఎన్నెన్నో కుంభకోణాలను వెలికి తీసింది. మరెన్నో స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి అనేక మంది అరాచకుల గుట్టును ప్రపంచానికి చూపించింది. అక్రమాలను దనుమాడింది. మోసాలను ఎండగట్టింది. నేరస్తులను చట్టానికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. అది ప్రైవేటు సంస్థ అయినా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా దేనికీ మినహాయింపు ఇవ్వలేదు. ఉన్నతాధికారి అయినా, ఉన్నతస్థాయిలో చక్రం తిప్పే వాళ్లయినా కూడా ఎవరినీ వదిలిపెట్టలేదు. అరాచకాలు, అక్రమాల గురించి ఉప్పందితే చాలు.. కెమెరా కన్నుతో వాలిపోయింది. కంత్రీగాళ్ల భరతం పట్టింది. ఇప్పటికీ ఆ ఒరవడిని వీడలేదు. నిరంతరం ఏబీఎన్ కెమెరా కన్ను తెరుచుకునే ఉంటుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది.
Updated Date - Oct 15 , 2024 | 12:41 PM