ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బట్ట బొమ్మలతో బతుకులు మార్చేశారు..

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:57 AM

‘ప్లాస్టిక్‌ బొమ్మలు వద్దు.. బట్ట బొమ్మలే ముద్దు..’ అంటున్న ఈ దంపతులు కొత్త ప్రయోగం చేశారు. బొమ్మల తయారీలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత బట్ట బొమ్మలను ఉత్పత్తి చేస్తూ.. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతిని నింపారు... సుహాస్‌, సునీత దంపతులు..

‘ప్లాస్టిక్‌ బొమ్మలు వద్దు.. బట్ట బొమ్మలే ముద్దు..’ అంటున్న ఈ దంపతులు కొత్త ప్రయోగం చేశారు. బొమ్మల తయారీలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత బట్ట బొమ్మలను ఉత్పత్తి చేస్తూ.. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతిని నింపారు... సుహాస్‌, సునీత దంపతులు..

‘‘ఇది కాదు మన జీవితం. అందరిలాగే ఉద్యోగం, నెలజీతం, ఇల్లు, కారు, ఈఎంఐలు, షాపింగ్‌, పిల్లలు.. ఇంతేనా? ఇంత పెద్ద చదువులు చదివింది ఈ మాత్రం జీవితానికా?’’ ప్రతీ శని, ఆదివారాల్లో ఈ చర్చ లేకుండా సునీత, సుహాస్‌ రామెగౌడలకు రోజు గడవదు. ‘‘ఎన్నాళ్లిలా? తెగించి ఏదో ఒకటి చేద్దాం’’ అనుకుంటూనే మళ్లీ సోమవారం వచ్చేసరికి ల్యాప్‌టాప్‌లు, లంచ్‌బాక్స్‌లు పట్టుకుని ఎవరి ఆఫీసులకు వారు పరుగులు తీయడం పరిపాటి అయ్యింది.


ఓ రోజు ‘‘చూశావా సునీతా.. మనం ఉద్యోగాల్లో చేరి అప్పుడే పదిహేనేళ్ల కాలం కరిగిపోయింది.. ఇంకేం చేస్తాం..?’’ అంటూ నిట్టూర్చాడు భర్త సుహాస్‌. నిజమే అన్నట్లు తలూపింది భార్య. మరుసటిరోజు ఎందుకో ఆమెకు హఠాత్తుగా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. తన చిన్నప్పుడు పాతచీరలు, దుస్తులతో ముచ్చటగొలిపే బొమ్మల్ని తయారుచేసిచ్చేది. అవెంత బావుండేవి? ఊర్లోని తోటి పిల్లలు అంతా ‘‘మీ అమ్మమ్మతో మాక్కూడా బొమ్మల్ని చేసివ్వమనవా?’’ అని బతిమాలేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న ప్లాస్టిక్‌బొమ్మలు చూడటానికి అందంగా ఉంటాయి కానీ.. అత్యంత ప్రమాదకర రసాయనాలు, రంగులతో తయారవు తున్నాయవి. ఇటు పిల్లల ఆరోగ్యానికీ, అటు పర్యా వరణానికీ చేటు చేస్తున్నాయని పత్రికల్లో చూసింది సునీత.


అప్పట్లో అమ్మమ్మ పెద్దగా చదువుకోక పోయినా పర్యావరణహిత బొమ్మల్ని తయారుచేయడం చాలా గొప్ప విషయం అనుకుంది. వెంటనే సుహాస్‌తో అమ్మమ్మ బట్ట బొమ్మల గురించి చెప్పింది. ‘ఐడియా భలేగుంది’’ అన్నాడాయన. వెంటనే యూట్యూబ్‌లోకి వెళ్లి చేతివృత్తుల కళాకారులు తయారుచేసే రకరకాల బొమ్మల్ని పరిశీలించారు. శిక్షణ కేంద్రాలను సంప్రదించారు. కానీ, ఎక్కడా తమకు కావాల్సిన సమాచారం లభించలేదు. ఎందుకో ఆ క్షణమే దంపతుల ఇద్దరి మదిలో ‘దుస్తులతో బొమ్మల తయారీ’ స్టార్టప్‌ ఆలోచన మొలకెత్తింది.


నగరం నుంచీ నీలగిరికి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సునీత, తమిళనాడు వాసి సుహాస్‌... ఇద్దరూ నగర జీవితంలో నలిగిపోయారు. ఇక, హర్రీబర్రీ బతుకులు వద్దని తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడికెళ్లి ఏం చేయాలన్న ఆందోళన లేదు. స్థానిక గిరిజన మహిళలతో బొమ్మల తయారీ కేంద్రాన్ని పెట్టాలన్నది వారి ఆలోచన. కనుచూపుమేర సుందరమైన నీలగిరి పర్వతాలు. కనువిందు చేసే పచ్చదనం. ప్రేమతో పలకరించే గిరిజనం. అటవీప్రాంతంలోనే సొంతంగా మట్టి ఇంటిని నిర్మించుకున్నారు. కొండల్లో నుంచీ వాగుల ద్వారా ప్రవహించే నీటిని వాడుకున్నారు. సేంద్రీయసేద్యంతో ఆకుకూరలు, కూరగాయలు పండించుకున్నారు.


సౌరవిద్యుత్‌తో కరెంటు సదుపాయం కల్పించుకున్నారు. నగరంలోని హంగులు, ఆర్భాటాలు లేవు. మినిమలిస్టు జీవితం. హాయిగా, ప్రశాంతంగా ఉంది. 2019లో ‘ఇండియన్‌ యార్డ్స్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్చందసంస్థను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతం కావడంతో పెద్దగా వ్యవసాయ పనులు ఉండవు. పర్యాటకం బాగా తగ్గిపోయింది. గిరిజన మహిళలకు తేయాకు తోటల్లో పనులు తప్ప మరొక ఉపాధి లేదు. ఆదాయం సరిపోవడం లేదు. ఇది గమనించిన సునీత, సుహాస్‌ దంపతులు స్థానిక మహిళలతోనే దుస్తులతో బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు.


కల ఫలించింది..

‘ద గాడ్‌ గిఫ్ట్‌’ అనే స్టార్టప్‌ నీలగిరి కొండల్లోని గిరిజన గూడేల్లో వెలసింది. సునీత తమిళనాడులోని రెడీమెడ్‌ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలకు వెళ్లి.. బట్టలు కుట్టేప్పుడు వృథాగా మిగిలిపోయిన చీలికలు పేలికలను సేకరించే పనిపెట్టుకుంది. ‘‘ఇవన్నీ పడేస్తే మట్టిలో కలిసిపోవు. సాగుభూములు పాడైపోతాయి. పర్యావరణానికీ హాని కలుగుతుంది’’ అంటూ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీల యజమానులను ఒప్పించింది. ఇలా పనికిరాని బట్ట ముక్కలను సేకరించి.. వాటితో బొమ్మల్ని తయారుచేసే ప్రక్రియ మొదలైంది. ఫ్యాక్టరీలలో సేకరించిన దుస్తుల ముక్కల్ని నీలగిరి ప్రాంతంలోని గిరిజన మహిళలకు అందజేయడం, వారితో బొమ్మలు చేయించడం, మార్కెటింగ్‌ చేయడం.. ఒకదాని వెంట మరొకటి జరిగిపోయాయి.


సుమారు 8 వేల కిలోల వృథా దుస్తుల పేలికలతో అర్థవంతమైన అందమైన ఆట బొమ్మల్ని చేశారు. వీటికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. దేశవ్యాప్తంగా 60 దుకాణాల్లో అమ్మే స్థాయికి ఎదిగిందీ స్టార్టప్‌. గిరిజనులకూ ఆదాయం పెరిగింది. గత ఏడాది సునీత, సుహాస్‌ దంపతులు సుమారు రూ.75 లక్షల విలువైన బొమ్మల్ని విక్రయించారు. ‘‘ఇన్నాళ్లూ జీవితం మనతో ఆడుకుంది.. ఇప్పుడు బొమ్మలతో మనం ఆడుకుంటున్నాం... అందుకే జీవితంలోకి కొత్త ఆనందం వచ్చేసింది.. మనం అనుకున్నది సాధ్యం అయ్యింది’’ అంటున్న ఈ దంపతుల కల ఫలించింది.

Updated Date - Sep 01 , 2024 | 08:57 AM

Advertising
Advertising