Viral News: ఐదేళ్ల వయసులో కాయిన్ మింగాడు.. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత..
ABN, Publish Date - Jun 07 , 2024 | 10:18 PM
ఒక్కోసారి చిన్నపిల్లలు తమ చేతికి దొరికిన వస్తువులను తినేస్తుంటారు. అవి తినొచ్చా? లేదా? అనే అవగాహన వారికి ఉండదు. ఓ అబ్బాయి కూడా తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు ఒక కాయిన్...
ఒక్కోసారి చిన్నపిల్లలు తమ చేతికి దొరికిన వస్తువులను తినేస్తుంటారు. అవి తినొచ్చా? లేదా? అనే అవగాహన వారికి ఉండదు. ఓ అబ్బాయి కూడా తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు ఒక కాయిన్ మింగేశాడు. కట్ చేస్తే.. ఏడేళ్ల తర్వాత అది అతనిపై తీవ్ర ప్రభావం చూపడంతో, వైద్యులు చికిత్స చేసి దాన్ని తొలగించారు. ఇది అత్యంత అరుదైన వ్యవహారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హార్దోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆ బాలుడి పేరు అంకుల్. అతని వయసు 12 సంవత్సరాలు. బఘౌలీలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన ఆ బాలుడికి ఏప్రిల్ నెలలో తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీంతో.. అతనిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అప్పుడు అతను త్వరగానే కోలుకున్నాడు. కానీ.. జూన్ 4వ తేదీన తనకు గొంతులో తీవ్ర నొప్పి ఉందని అతను చెప్పాడు. ఏదైనా పెద్ద సమస్య అయ్యుండొచ్చని భావించి.. జిల్లా ఆసుపత్రిలో అంకుల్‌ని చూపించాల్సిందిగా అతని తాత అజయ్ సూచించాడు. ఆ ఆసుపత్రిలోని వివేక్ సింగ్ అనే డాక్టర్ అతనిని పరీక్షించగా.. అతని గొంతులో రూపాయి నాణెం కనిపించింది. అది అతని గొంతులో ఇరుక్కున్నట్టు ఎక్స్-రేలో కనిపించింది. దీంతో వైద్యులు టెలిస్కోప్ పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసి.. ఆ కాయిన్‌ని తొలగించారు.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను డా. వివేక్ సింగ్ పంచుకుంటూ.. ఇదొక సంక్లిష్టమైన చికిత్స అని పేర్కొన్నారు. ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు అంకుల్ రూపాయి నాణేన్ని మింగాడని అతని మామ చెప్పాడని, అప్పటి నుంచి అది అతని గొంతులోనే ఉండిపోయిందని చెప్పారు. ఇది చాలా అరుదైన కేసు అని తెలిపారు. ఇది బాలుడి ఎదుగుదలనే కాకుండా శారీరక ఎదుగుదలపై కూడా ప్రభావితం చేసిందన్నారు. అసలు అంకుల్ 12 ఏళ్ల బాలుడిలా లేడని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని, సర్జరీ చేసి కాయిన్‌ని తొలగించాక కూడా అబ్బాయికి ఇతర సమస్యలు తలెత్తొచ్చని చెప్పుకొచ్చారు. అందుకే.. రెగ్యులర్ చెకప్స్ కోసం అంకుల్‌ని తీసుకురావాలని ఫ్యామిలీకి చెప్పామన్నారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jun 07 , 2024 | 10:18 PM