అనెగొందిలో ‘రాయల’ వారసులు
ABN, Publish Date - Oct 27 , 2024 | 09:50 AM
అనెగొందిలో నివాసం ఉండే సుదర్శనవర్మ విజయనగర రాజ కుటుంబీకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం కొప్పల్, బళ్ళారి జిల్లాల్లో విజయనగర కాలం నాటి కాలువల పుసరుద్ధరణ డిమాండుతో రైతు ఉద్యమాన్ని నడుపుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో గ్రావిటీతో ప్రవహించే పదహారు కాలువలు ఉండేవని గుర్తించిన ఆయన, వాటి పునరుద్ధరణకు నడుం బిగించారు.
అనెగొందిలో నివాసం ఉండే సుదర్శనవర్మ విజయనగర రాజ కుటుంబీకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం కొప్పల్, బళ్ళారి జిల్లాల్లో విజయనగర కాలం నాటి కాలువల పుసరుద్ధరణ డిమాండుతో రైతు ఉద్యమాన్ని నడుపుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో గ్రావిటీతో ప్రవహించే పదహారు కాలువలు ఉండేవని గుర్తించిన ఆయన, వాటి పునరుద్ధరణకు నడుం బిగించారు. పదహారు కాలువలలో ఒక కాలువ తుంగభద్రా ప్రాజెక్టులో మునిగిపోగా... మిగిలిన పదిహేను కాలువలకు సంబంధించిన ఉనికి కోసం పరిశోధనలు, పరిశీలనలు చేయగా... అందులో 14 కాలువలను గుర్తించారు. స్థానిక రైతులను కూడగట్టుకొని కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సుమారు 8 కాలువల పునరుద్ధరణకు ప్రభుత్వ అనుమతిని సంపాదించారు.
కర్నాటక ప్రభుత్వం ఆ 8 కాలువల పునరుద్ధరణకు దాదాపు 500 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే స్థానిక నాయకులు, అధికారుల అలసత్వం కారణంగా పనులు వేగవంతంగా సాగడం లేదనే ఆవేదనలో ఉన్నారాయన. ప్రసుత్తం జరుగుతున్న పనుల విధానం పట్ల కూడా వర్మగారు అసంతృప్తితో ఉన్నారు. కాలువల నిర్మాణంలో కాంక్రీట్‌ను వాడడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంక్రీట్ వాడకం వలన అనేక చేపల జాతులు నశించి పోతాయని సోదాహరణంగా వివరిస్తారు. అంతేగాకుండా ప్రత్యామ్నాయ విధానాలను కూడా సూచిస్తారు. ‘ప్రాచీన కాలువల మీద ఉన్న శిలాశాసనాల రాళ్ళపై కాంక్రీట్ వేయడం వలన విలువైన సమాచారాన్నిచ్చే శిలా శాసనాలు కాంక్రీట్ లోపల భూస్థాపితమై పోతున్నాయ’నే ఆవేదన వ్యక్తం చేస్తారు.
రాంపురం కాలువ పునరుద్ధరణ కోసం...
‘16 కాలువలలో 15 కాలువల ఉనికిని గుర్తించామని, ఒక కాలువను గుర్తించలేక పోయామనీ, అది ఆంధ్రలో ఉంద’ని నాతో చెప్పినప్పుడు నేను ‘రామాపురం కాలువనా?’ అని అడిగాను. ‘అవునన్నా’రాయన. ‘మంత్రాలయం మండలంలో రామాపురం అనే గ్రామం వద్ద శిథిలావస్థలో ఉండే రాంపురం కాలువ అని వుందనీ, నేను అక్కడి సమీపాన ఉండే తుంగ భద్ర అనే ఊర్లో పనిచేస్తున్నప్పుడు అక్కడి రైతులు ఈ కాలువ గురించి చెప్పార’ని అనడంతో ఆయన సంతోషానికి అవధుల్లేవు. వెంటనే ఆయన కాలువ పునరుద్ధరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో మునిగిపోయారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాంపురం కాలువ పునరుద్ధరణ ప్రతిపాదనలతో కలవడానికి సంబంధించిన సన్నాహాలు చేసుకొంటున్నారు. విజయనగర సామ్రాజ్య కాలం నాటి సాగునీటి, త్రాగునీటి సౌకర్యాల కల్పనకు సంబంధించిన సాంకేతిక విషయాలపైన సుదర్శన వర్మకు అపారమైన అవగాహన ఉన్నది. నేను అనెగొందికి వెళ్ళినప్పటికీ చైన్నె నుండి వచ్చిన ఒక టీం విజయనగర సామ్రాజ్య కాలంనాటి నీటి వనరుల కల్పనపై ఒక డాక్యుమెంటరీ నిర్మాణ విషయమై సుదర్శన వర్మతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అంజనాద్రి బెట్ట పరిసర ప్రాంతాలలో రిసార్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా కూడా ఆయన స్థానిక రైతులను కలుపుకొని ఒక ప్రతిఘటన ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. రిసార్టుల నిర్మాణం వలన పర్యావరణ సమతౌల్యం కూడా దెబ్బ తింటుందని ఆయన అంటారు.
నేను అనెగొంది గ్రామంలో రెండు రోజులు ఉన్నాను. గ్రామస్తులకు సుదర్శనవర్మ పైన అపారమైన గౌరవం ఉంది. ఒక స్థానికుడిని ఆయన గురించి చెప్పమని అడిగినపుడు ‘‘ఒక మంచి రైతు నాయకుడు’’ అని చెప్పాడు. వారి ఆహ్వానం మేరకు నేను నా కుటుంబ సభ్యులతో కలసి దసరా ఉత్సవాలకు వెళ్లాను. దసరా పండుగ రోజున ఉదయం హోన్న మహాద్వార దగ్గర ఉన్న కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి అందరం ప్రక్కనే ఉన్న మీటింగ్ హాల్‌కు వెళ్ళాం. గంగావతిలోని ప్రముఖ వైద్యులు డా. సోమరాజుగారు ఏర్పాటు చేసిన సమావేశంలో హంపీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌శాస్త్రి ఉపన్యాసం నన్ను విస్మయానికి గురి చేసింది. హంపీలో ప్రతి నిర్మాణాన్ని శ్రీకృష్ణదేవరాలయలు చేశారనీ, ప్రతి విధ్వంసమా ముస్లింలే చేశారనే అపోహ ఒకటి ఉందని... ఇది తప్పని ఆయన వివరించారు.
హిందూ ధర్మ రక్షణ కోసమే విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిందని చెప్పడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. విజయనగర రాజులు అన్ని మతాలను సమానంగా ఆదరించారని చెబుతూ అనేక నిదర్శనాలు చూపారు. హంపీలోని గైడులు సందర్శకులను తమ మిడిమిడి జ్ఞానంతో తప్పడు వ్యాఖ్యానాల ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కృష్ణదేవరాయల వంశీకులు అయిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కుమారులు తిరుమల దేవరాయలు, ఆయన భార్య, కూతుళ్లు, రాజమాత పాల్గొన్నారు. దసరా ఉత్సవాలలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. అనేక కళారూపాల ప్రదర్శన కన్నులపండువగా అనిపించింది.
సరళ తెలుగులో ‘ఆముక్తమాల్యద’
విజయనగర సామ్రాజ్య ప్రభువుల కుటుంబాలు తెలుగుభాషకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం నన్ను విస్మయానికి గురిచేసింది. నేటికీ వారి సాంప్రదాయం ప్రకారం ఇంట్లో తెలుగే మాట్లాడుతున్నారు. సుదర్శనవర్మ గారి అన్న ప్రస్తుతం ‘ఆముక్తమాల్యద’ ను సరళ తెలుగులో రాసే పనిలో ఉన్నారు. కృష్ణదేవరాయల కుమారుడు తిరుమల దేవరాయలు, ఆంగ్లంలో 1446 సంవత్సరం నుంచి 1556 వరకు విజయనగర సామ్రాజ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక కాల్పనిక చారిత్రక నవలను రాశారు. త్వరలో అది విడుదల కాబోతున్నది. ఆ నవలలను వారు తెలుగులో అనువదింపజేసే ఆలోచనలో ఉన్నారు. నిజమైన చారిత్రక విషయాలను ప్రస్తుత యువతకు తెలియ జెప్పాలన్నది కృష్ణదేవరాయల వారసుల ఆకాంక్ష. వారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.
- మారుతి పౌరోహితం, 94402 05303
Updated Date - Oct 27 , 2024 | 09:50 AM