ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali 2024: దీపావళి పరమార్థం తెలుసా.. పండుగ 5 రోజులెందుకు

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:22 PM

నిరాశకూ, అజ్ఞానానికీ చీకటి ప్రతీక అయితే దీపం ఆనందానికీ, ఉత్సాహానికీ, జ్ఞానానికీ చిహ్నం. చీకటిని తొలగించగల శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. ఆ శక్తినే ‘పరమాత్మ అంటారు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.

ఇంటర్నెట్ డెస్క్: నిరాశకూ, అజ్ఞానానికీ చీకటి ప్రతీక అయితే దీపం ఆనందానికీ, ఉత్సాహానికీ, జ్ఞానానికీ చిహ్నం. చీకటిని తొలగించగల శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. ఆ శక్తినే ‘పరమాత్మ అంటారు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞాన కాంతులతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకున్నప్పుడు మానవుడే దైవ సమానుడవుతాడు. ఈ సత్యాన్ని చాటిచెప్పే పర్వదినమే దీపావళి. నిత్యం రెండు సంధ్యలు ఉంటాయి. రాత్రి చంద్రుడు అస్తమించడానికీ, పగటి సూర్యుడు ఉదయించడానికీ మధ్య ఉండే సంధ్యను ‘ప్రాతఃసంధ్య’ లేదా ‘ఉదయ సంధ్య’ అంటారు. పగటి సూర్యుడు అస్తమించడానికీ, రాత్రి చంద్రుడు ఉదయించడానికీ నడుమ ఉండే సంధ్యను ‘సాయం సంధ్య’ అంటారు. ఉదయ సంధ్యా దీపాన్ని భగవంతుడి ముందు వెలిగిస్తారు. సాయం సంధ్యా దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం మీద వెలిగించి, భక్తితో నమస్కరిస్తారు.

పరమార్థం అదే..

మానవుల్లో స్వార్థానికీ, మూర్ఖత్వానికీ, అజ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక చీకటి. దాన్ని పారద్రోలి... జ్ఞానానికి ప్రతిరూపమైన కాంతిని జగతిలో నింపడమే దీపం పరమార్థం. దీపం ప్రేమకు, మంచితనానికీ, ధర్మానికీ సంకేతం. దీపం ఐశ్వర్యం అయితే అంధకారం దారిద్య్రం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుంది. దీపం సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ దేవి సకలైశ్వర్యప్రదాయని. ‘దీప లక్ష్మీ నమోస్తుతే’ అంటూ దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి, భక్తితో దీపావళి రోజున ఆరాధిస్తారు.

ఈ రోజున దీపలక్ష్మి తన కిరణాలతో లోకాన్ని కాంతిమయం చేస్తుంది. దీపలక్ష్మికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలూ చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపంలో కనిపించే ఎర్రని కాంతి సృష్టికర్త అయిన బ్రహ్మకూ, నీలి కాంతి విష్ణుమూర్తికీ, తెల్లని కాంతి పరమ శివుడికీ ప్రతీకలు. అలాగే దీపం ఇచ్చే వెలుగు శక్తిని, విజ్ఞానాన్నీ, ఐశ్వర్యాన్నీ ఇచ్చే దుర్గ, సరస్వతి, లక్ష్మీ దేవతలకు చిహ్నం. సమస్త భారాలనూ భరించగలిగే భూదేవి దీపం వేడిని భరించలేదట! అందుకే నేల మీద దీపాన్ని నేరుగా పెట్టకూడదు. కింద ఏదైనా ఆధారం ఉంచి, దాని మీద దీపపు కుందె ఉంచాలి. ప్రమిదను మరో ప్రమిదలో పెట్టి దీపాన్ని వెలిగించడంలో ఆంతర్యం అదే.


ఆ దివ్వెకు అన్నీ సాధ్యమే!

దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని రకాల చీకటులనూ పారద్రోలుతుంది. దీపం సమస్తాన్ని సాధించగలదు. దీపం లేనిదే ఏదీ సాధ్యం కాదు. కనుక సంధ్యా సమయంలో పెట్టిన దీపానికి నమస్కరిస్తున్నానని అర్థం. అలాంటి పవిత్రమైన దీపాలను వెలిగించి చేసుకొనే పండుగే దీపావళి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబం దీపావళి పర్వదినం. ‘దీప + ఆవళి’ అంటే దీపాల వరుస. రాక్షసత్వం మీద దైవత్వం సాధించిన విజయానికి చిహ్నమైన దీపావళి పండుగను ‘దివ్వెల పండుగ’, ‘దివిటీల పండుగ’ అని కూడా పిలుస్తారు. ఆసేతు హిమాచలం ఆశ్వయుజ అమావాస్య రోజున చీకట్లను చీల్చుతూ ఎటు చూసినా ప్రమిదల్లో దీపాలు వెలుగుతూ ఉంటాయి. మానవ శరీరం మట్టితో చేసిన వస్తువుతో సమానం. ఆ శరీరంలో ప్రకాశించే జ్యోతి ప్రాణం. ఆ ప్రాణం భగవంతుడి ప్రసాదం. భక్తులు భగవంతుడికి చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ ఒకటి. దీపావళి రోజున ఇంటి ముందు వెలిగించే దీపాన్ని ‘బలి దీపం’ అంటారు. దీన్నే ‘సంధ్యాదీపం’ అని కూడా అంటారు. సంధ్యాదీపం పెట్టి యమధర్మరాజును పూజిస్తే అపమృత్యు దోషం, మృత్యువుతో సమానమైన శారీరక నష్టం కలగదంటారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుందని పెద్దలు చెబుతారు.

కార్తీక శుద్ధ విదియ వరకు..

దీపావళి అయిదు రోజుల పాటు నిర్వహించే పర్వదినం. వీటిలో ప్రతి రోజూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశి అంటే ధన త్రయోదశి రోజున ప్రారంభమవుతాయి. కార్తీక శుద్ధ విదియ వరకూ కొనసాగుతాయి.


ధన త్రయోదశి: ఆశ్వయుజ బహుళ త్రయోదశితో దీపావళి సంరంభం మొదలవుతుంది. ఆ రోజును ‘ధనత్రయోదశి’ అంటారు. క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించిన దినం. ఆమెనూ, ధనాధిపతి కుబేరుడినీ, ఆరోగ్యప్రదాత ధన్వంతరినీ, ఆయుఃప్రదాత యముడినీ ఈ రోజు అర్చించడం శుభప్రదంగా భావిస్తారు.

నరక చతుర్దశి: ప్రజాపీడకుడైన నరకాసురుడి వధ జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని రోజును ‘నరక చతుర్దశి’ అని పిలుస్తారు. ఈ రోజున దీపాలను వెలిగిస్తే పితృదేవతలకు స్వర్గ లోకం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కొన్ని చోట్ల గడ్డి, తాకాలువంటి వాటితో నరకాసురుని బొమ్మలు తయారుచేసి దహనం చేస్తారు.

దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజును ‘దీపావళి’గా జరుపుకొంటారు. ఈ రోజు ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. లక్ష్మీ పూజ అనంతరం సాయంత్రం పిల్లలూ, పెద్దలూ బాణాసంచా కాలుస్తూ ఈ పండుకను వేడుకగా నిర్వహిస్తారు.

బలి పాడ్యమి: వామనావతారి అయిన విష్ణువు పదఘట్టనకు పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి రోజున తాను పాలించిన ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు భూలోకానికి వస్తాడట! అందుకే ఈ రోజును ‘బలి పాడ్యమి’ అంటారు. ఈ రోజు దానం చేసినవారికి సిరిసంపదలు లభిస్తాయని నమ్మిక. శ్రీకృష్ణుడు గోవర్ధ గిరిని ఎత్తి నందగోకులాన్ని కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గోవర్ధన పూజ చేసే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాగే ఈ రోజున గోవర్థన గిరి పరిక్రమను కూడా జరుపుతారు. గుజరాతీయుల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది.

యమ విదియ: కార్తీక శుద్ధ విదియకు ‘యమ విదియ’ లేదా ‘యమద్వితీయ’, ‘భాతృ విదియ’ అనే పేర్లున్నాయి. యమధర్మరాజును ఆయన సోదరి యమునా దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి అపమృత్యు, నరక బాధలు ఉండవని వరం ఇచ్చాడట! దీన్నే ‘భగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. ఉత్తరాదిన ‘భాయ్‌ దూజ్‌’ అంటారు. అలాగే లోకుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడి జయంతి కూడా యమ విదియ రోజేనట.

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా


For Latest News and National News click here..

Updated Date - Oct 24 , 2024 | 03:22 PM