ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూలోకవీరులు..

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:55 AM

లోకం చుట్టిరావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ సగటు మనిషి జీవితకాలంలో ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో రెండు మూడు దేశాలకు వెళ్లడమే మహాగొప్ప. అభిరుచి, ఆసక్తి ఉన్నవారైతే పదో, ఇరవయ్యో దేశాలు చుట్టి మురిసిపోతారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా మహా అయితే పాతికో, యాభై దేశాలో పర్యటిస్తారు.

లోకం చుట్టిరావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ సగటు మనిషి జీవితకాలంలో ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో రెండు మూడు దేశాలకు వెళ్లడమే మహాగొప్ప. అభిరుచి, ఆసక్తి ఉన్నవారైతే పదో, ఇరవయ్యో దేశాలు చుట్టి మురిసిపోతారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా మహా అయితే పాతికో, యాభై దేశాలో పర్యటిస్తారు. అయితే మొత్తంగా 195 దేశాలు చుట్టొచ్చిన ‘భూలోకవీరులు’ కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆ లిస్టులో మన తెలుగువాడు కూడా ఉన్నాడండోయ్‌... ఆ విశేషాలే ఈ వారం కవర్‌స్టోరీ.

అతి పిన్న వయస్కురాలు......

పాతికేళ్లు కూడా నిండకుండానే ప్రపంచాన్ని చుట్టి రావచ్చా అంటే అసాధ్యమని అంటారు. కానీ సాధ్యమే అని నిరూపించారు అమెరికాకు చెందిన 21 ఏళ్ల లెక్సీ ఆల్‌ఫోర్డ్‌. 2019 మే 31న ఉత్తర కొరియాలో అడుగుపెట్టడం ద్వారా భూమండలంపై ఉన్న అన్ని దేశాలను చుట్టి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కారు.


గతంలో ఈ రికార్డు జేమ్స్‌ అస్క్విత్‌ పేరున ఉండేది. 24 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదు చేశారు. ఇప్పుడా రికార్డును లెక్సీ తిరగరాశారు. 21 ఏళ్ల వయసులోనే అన్ని దేశాలు చుట్టి వచ్చారామె. లెక్సీకి తెలియకుండానే చిన్న వయసులోనే దేశాలు తిరగడం ప్రారంభమయింది. వారికి కాలిఫోర్నియాలో ట్రావెల్‌ ఏజెన్సీ ఉండేది. దాంతో తెలియకుండానే ట్రావెల్‌ ఆమె జీవితంలో భాగమయింది. ‘‘నేను పెరిగే కొద్దీ కుటుంబసభ్యులతో కలిసి చాలా దేశాలు తిరిగాను. కాంబోడియాలోని ఫ్లోటింగ్‌ విలేజ్‌లు, దుబాయ్‌, ఈజిప్టు పిరమిడ్లు ఇలా చాలా ప్రాంతాలు తిరిగాను’’ అంటారు లెక్సీ. ‘‘ఇతరుల జీవనవిధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నాకు చాలా ఎక్కువ. అంతేకాకుండా వాళ్లు ఎలా సంతోషంగా ఉంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది.


అదే నన్ను అన్ని దేశాలు తిరిగేలా చేసింది. 2016లో ట్రావెలింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నా’’ అంటున్నారు లెక్సీ. ఆమెకు 18 ఏళ్లు వచ్చేనాటికి 72 దేశాలు తిరిగింది. అప్పుడే అన్ని దేశాలు ఎందుకు చుట్టి రాకూడదనే ఆలోచన తనకు తట్టిందట. ‘‘అక్టోబర్‌ 2016లో మొదటిసారి వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేయడం గురించి ఆలోచించాను. అప్పటిదాకా నాకు దానిపై ఎలాంటి ఆలోచన లేదు’’ అని అంటారు లెక్సీ. ఇన్ని దేశాలు తిరగడానికి అవసరమైన డబ్బును తనే సమకూర్చుకున్నారు. కొన్ని బ్రాండ్‌ల క్యాంపెయిన్‌లలో పాల్గొని తన ప్రాజెక్టుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకున్నారు. దొరికిన పని చేశారు. ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన సమయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లెక్సీ. చివరగా ఉత్తర కొరియాకు వెళ్లడం ఛాలెంజింగ్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ దేశంలో యూఎస్‌ పౌరుల పర్యటనలపై నిషేధం ఉంది. అయితే ఒక లూప్‌హోల్‌ ద్వారా అధికారికంగా ఆమె ఉత్తర కొరియాలో కాలు మోపారు. ‘‘ప్రస్తుతం నా అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను’’ అంటున్న లెక్సీ ఈతరం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


తెలుగోడి సత్తా...

ప్రపంచాన్ని చుట్టివచ్చిన వాళ్ల జాబితాలో ఒక భారతీయుడు ఉన్నారు. అందులోనూ అతను తెలుగోడు కావడం విశేషం. అతడి పేరు రవిప్రభు. పుట్టింది ఒడిశాలోనైనా పెరిగిందంతా విశాఖపట్టణంలోనే. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. ఉన్నతవిద్య కోసం 1996లో అమెరికా వెళ్లారు. తరువాత అక్కడే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడిపోయారు. ఏటా రెండుసార్లు స్వదేశానికి వస్తుంటారు. రవిప్రభు మొదట పర్యటించిన దేశం భూటాన్‌. ‘‘నాకు ప్రయాణాలంటే ఇష్టం. ఆ ఇష్టమే ప్రపంచాన్ని చుట్టి వచ్చేలా చేసింది’’ అని అంటారు రవిప్రభు. అయితే వరల్డ్‌ టూర్‌ అంత సులభంగా పూర్తి కాలేదు. అన్ని దేశాలు చుట్టి రావడానికి 27 ఏళ్లు పట్టింది. ఉద్యోగం చేసుకుంటూనే సమయం దొరికనప్పుడల్లా ఒక్కో దేశం చుట్టి వచ్చారు. వెయ్యికి పైగా విమానాలు ఎక్కారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి 30 లక్షల ఎయిర్‌ మైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది.


కొన్ని దేశాల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. లెబనాన్‌ మీదుగా సిరియా వెళ్లే క్రమంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా కూడా వెనకంజ వేయలేదు. ‘‘ఒక్కో దేశంలో అక్కడి ప్రజల అలవాట్లు, జీవన విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే కొత్త కొత్త దేశాలకు వెళ్లాలని ఆసక్తి కలుగుతుంది’’ అని అంటారు రవిప్రభు. అతన్ని ఎవ్వరూ స్పాన్సర్‌ చేయలేదు. ఉద్యోగం చేసుకుంటూనే కూడబెట్టిన డబ్బులతో దేశాలన్నీ చుట్టొచ్చారు. చిట్టచివరగా వెళ్లిన దేశం వెనిజులా. అక్కడ 9 రోజులు ఉన్నారు. దాంతో అతని ప్రపంచయాత్ర పూర్తయింది. తన అనుభవాలతో ‘రవి తెలుగు ట్రావెలర్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు.


నల్లజాతి కెరటం

నల్లజాతీయులు అందులోనూ ఒక మహిళ ప్రపంచాన్ని చుట్టి రావడమంటే సాధారణ విషయం కాదు. ఉగాండా మూలాలు కలిగి ఉన్న 39 ఏళ్ల జెస్సికా నబోంగో ఈ ఘనత సాధించారు. ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌’ మాజీ ఉద్యోగి. ‘‘నా నాలుగేళ్ల వయసులోనే కుటుంబసభ్యులతో కలిసి ట్రావెల్‌ చేయడం ప్రారంభించాను. నా ప్రయాణం చాలామందికి బ్లూప్రింట్‌గా ఉపయోగపడింది. చాలామందిలో భయాలను తొలగించింది. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు’’ అని అంటారు జెస్సికా. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌, పాజిటివ్‌ ఎనర్జీ ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఉదాహరణగా నిలుస్తారు జెస్సికా. తన పర్యటన మొత్తాన్ని, తన అనుభవాలను కెమెరాలో బంధించారామె.


100 దేశాలు... 100 కథలు అంటూ ‘క్యాచ్‌ మి ఇఫ్‌ యు కెన్‌’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ‘‘అమెరికా పౌరులు సౌత్‌ సూడాన్‌లో పర్యటించకూడదని, అది ప్రమాదకరమైన ప్రదేశం అని హెచ్చరికలు జారీ చేసింది. నా దృష్టిలో ఏ దేశం కూడా పూర్తిగా సేఫ్‌ అని చెప్పలేం. అలాగే ఒక దేశంలో పూర్తిగా అభద్రతే ఉంటుందని అనుకోను. నీకేం కావాలో వెతుక్కోవాలి. నేను ప్రేమ, మానవత్వాన్ని వెతుక్కుంటూ తిరిగాను. ఆసక్తి అనేది ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య తేడాలు, సారూప్యతలను తెలుసుకోవానే బలమైన కోరిక నాకు ఉంది. అదే నన్ను ప్రపంచమంతా తిరిగేలా చేసింది’’ అని అంటారు జెస్సికా.


విమానం ఎక్కకుండా ...

విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టి రావడం సాధ్యమేనా? రోజూ 2 వేల రూపాయల లోపు ఖర్చుతో విదేశాలను చుట్టి రావొచ్చా? అంటే సాధ్యమే అని నిరూపించారు డెన్మార్క్‌కు చెందిన టోర్బ్‌జోర్న్‌ పెడెర్సన్‌. ప్రపంచంలో ఉన్న 195 దేశాలను ఒక్కసారి కూడా విమానం ఎక్కకుండా చుట్టి వచ్చారు పెడెర్సన్‌. కొన్ని దుస్తులు, ఫస్ట్‌ ఎయిడ్‌కిట్‌తో 2013లో పెడెర్సన్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ముందుగా డెన్మార్క్‌ నుంచి జర్మనీకి రైలులో ప్రయాణం చేయడం ద్వారా తన ప్రపంచయాత్రను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పెడెర్సన్‌ 3 లక్షల 82 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తన ప్రయాణంలో రైళ్లు, బస్సులు, ట్రక్కులు, టూవీలర్లు, పడవలు... ఇలా రకరకాల ప్రయాణ సాధనాలను ఎంచుకున్నారు. ఎక్కడా విమానం మాత్రం ఎక్కలేదు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చిన్న చిన్న హోటళ్లలో, గదులలో బస చేసే వారాయన. ప్రతీ దేశంలోనూ 24 గంటలు గడిపారు.


అయితే అతని ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. చాలాచోట్ల కఠినమైన సవాళ్లు ఎదరయ్యాయి. నార్వే నుంచి ఫారో ద్వీపానికి వెళ్లేందుకు బోట్‌ దొరకలేదు. షిప్పింగ్‌ కంపెనీ వాళ్ల అనుమతి దొరక్కపోవడంతో మూడు రోజులు ఆగిపోయారు. ఘనా దేశంలో పర్యటించే సమయంలో సెరెబ్రల్‌ మలేరియా బారినపడ్డారు. ఆ సమయంలో ప్రయాణాన్ని ఆపేసి ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని కూడా అనిపించిదట. మరోదేశంలో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డారు. ‘‘ఆఫ్రికాలో ముగ్గురు వ్యక్తులు తుపాకులు ఎక్కుపెట్టి చంపేస్తామని బెదిరించారు. వాళ్లు బాగా తాగి ఉన్నారు. అదే చివరి రోజు అని నాకనిపించింది. కానీ అదృష్టవశాత్తు 45 నిమిషాల తరువాత వాళ్లు వెళ్లిపొమ్మని వదిలేశారు’’ అని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు పెడెర్సన్‌. 2020లో హాంకాంగ్‌కు చేరుకున్నాక కొవిడ్‌ విలయం మొదలయింది. దాంతో అక్కడే రెండేళ్లపాటు ఉండిపోయారు. చర్చ్‌లో పనిచేస్తూ తాత్కాలిక శరణార్థిగా ఆశ్రయం పొందారు. చివరగా మాల్దీవులను సందర్శించి తన ప్రపంచయాత్రను ముగించారు. అన్ని దేశాలను చుట్టిరావడానికి పెడెర్సన్‌కు పదేళ్ల సమయం పట్టింది.


79 ఏళ్ల బామ్మ రికార్డు

ఆసక్తి ఉండాలే కానీ వయస్సు అడ్డంకి కాదు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు చక్కని ఉదాహరణ మియామికి చెందిన 79 ఏళ్ల ల్యూసా యు. ప్రపంచాన్ని చుట్టి రావడానికి వయసుతో పనిలేదని నిరూపించారు ల్యూసా. యూఎన్‌ గుర్తించిన 193 దేశాలను చుట్టివచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారామె. ఈ ఫీట్‌ను సాధించడానికి ఆమెకు 50 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని దీక్షతో వాటిని అధిగమించి గత ఏడాది నవంబర్‌లో సెర్బియా దేశంలో పర్యటించడం ద్వారా ఆమె తన ప్రపంచయాత్రను ముగించారు. ‘‘ప్రతీ ఒక్కరూ నన్ను సొమాలియాకు మాత్రం వెళ్లకు. చాలా ప్రమాదకరం అని హెచ్చరించారు. కానీ నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం.


అది ఉత్తేజాన్ని అందిస్తుంది’’ అని అంటారు ల్యూసా. ఆమె తన 23 ఏళ్ల వయసులో మొదటిసారిగా ట్రావెల్‌ చేశారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరిని ‘యూఎన్‌ మాస్టర్స్‌’గా నోమాడ్‌ మానియా గుర్తించింది. అందులో ల్యూసా ఒకరు. ‘‘నా పర్యటనలో రకరకాల వ్యక్తులు, సంస్కృతులు, వారి జీవన విధానాలను చూసి ఎంతో నేర్చుకున్నాను. అందరికీ మంచి ఉద్యోగాన్ని సాధించాలని డ్రీమ్‌ ఉంది. చాలామంది ఇతరులకు సహాయపడే గుణం కలవారే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఇతరుల కోసం వేచి చూస్తూ ఆగిపోకూడదు. ఆ అవకాశం మళ్లీ రాకపోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. అసాధ్యం అంటూ ఏదీ లేదు’’ అని అంటారు ల్యూసా. తన పర్యటన అనుభవాలు ఈతరం వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.


అంధురాలైనా.... అవాక్కయ్యేలా...

పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చేది అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి. విదేశాలకైనా, మరోచోటకైనా అక్కడి సుందరదృశ్యాలను చూసి అనుభూతి చెందడానికే వెళుతుంటాం. మరి చూపులేని వారి పరిస్థితి ఏంటి? వారు ఇంటికే పరిమితమా? అంటే కానే కాదని నిరూపించారు లండన్‌కు చెందిన హేలీ కెన్నెడీ. ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలన్నీ తిరిగిన మొదటి డిసేబుల్డ్‌ పర్సన్‌గా గుర్తింపు పొందారామె. చూపు లేకున్నా 193 దేశాలు తిరిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. గత ఏడాది లిబియా దేశాన్ని సందర్శించడంతో ఆమె చరిత్ర సృష్టించారు. ‘నోమాడ్‌’ మ్యానియా సైతం హెలీని అన్ని దేశాలు తిరిగిన మొదటి అంధురాలిగా గుర్తించింది. అయితే ఈ ఘనత సాధించడానికి ఆమె ఎంతో శ్రమించారు.


ఈ గుర్తింపు ఆమెకు సులభంగా రాలేదు. విమానాశ్రయాల్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ఆమె ఓపికగా ఎదుర్కొన్నారు. ‘‘విమానాశ్రయాల్లో డిసేబుల్డ్‌ పర్సన్స్‌ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల నేను అంధురాలిని కాదని ఎయిర్‌పోర్టు సిబ్బంది వాదించేవారు. ప్రత్యేక లైన్‌లో వెళ్లేందుకు అనుమతించేవారు కాదు’’ అని విచారం వ్యక్తం చేశారు హెలీ. ఆమె పుట్టుకతో అంధురాలు కాదు. 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కంటి జబ్బు వల్ల చూపు కోల్పోయారు. ‘‘నేను న్యూస్‌పేపర్‌ చదవలేను. డ్రైవింగ్‌ చేయలేను. మాగ్నిఫయర్‌ సహాయంతో ఫోన్‌ ఉపయోగిస్తాను. బ్రెయిలీ లిపి కూడా నేర్చుకోలేదు’’ అంటారు హెలీ. అయినా సరే ఆత్మవిశ్వాసంతో భూలోకమంతా తిరిగారు.


‘నోమాడ్‌’ మేనియా

ప్రపంచపర్యటన చేయాలనుకునే వారికి ఈ సంస్థ సహాయసహకారాలు అందిస్తుంది. ‘నోమాడ్‌’ సంస్థ 2012లో ప్రారంభమయింది. 2017లో రీబ్రాండ్‌ అయింది. పర్యాటకులను చైతన్యవంతం చేయడం, కావలసిన సమాచారాన్ని అందించడం, ప్రోత్సహించడం, ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. కొత్త ప్రదేశాలను కనుగొనడంలో పర్యాటకులను మోటివేట్‌ చేయడం, సహాయం చేయడం వంటి పనులు చేస్తుంది. మెరుగైన ప్రపంచం కోసం పర్యాటకం బాగా పనికొస్తుందని ఈ సంస్థ చెబుతుంది. భూమిని కాపాడుకోవడానికి ట్రావెల్‌ ప్రభావంతమైన మార్గంగా ఉపయోగపడుతుందని ఈ సంస్థ విశ్వసిస్తోంది.

Updated Date - Sep 15 , 2024 | 08:55 AM

Advertising
Advertising