జొన్నాయుధాలు
ABN, Publish Date - Nov 03 , 2024 | 10:53 AM
‘‘జొన్నకలి జొన్నయంబలి/ జొన్నన్నము జొన్నపినరు జొన్నలు తప్పన్ సన్నన్నము సున్నగదా/ పన్నుగ పల్నాట నున్న ప్రజలందఱకున్’’ అనేక రోగాలపైన ఔషధం కావటాన జొన్న సామాన్యుడి జొన్నాయుధంగా మారిందిప్పుడు. ఒకనాడు కూటికి లేనివాళ్లు తినేది! ఇప్పుడు బియ్యమే చవక. ‘ఓడలు-బండ్లు’ అంటే ఇదే! తిట్టుకుంటూనే శ్రీనాథుడు కొన్ని జొన్నవంటకాల్ని ఈ చాటువులో పేర్కొన్నాడు.
‘‘జొన్నకలి జొన్నయంబలి/
జొన్నన్నము జొన్నపినరు జొన్నలు తప్పన్
సన్నన్నము సున్నగదా/
పన్నుగ పల్నాట నున్న ప్రజలందఱకున్’’
అనేక రోగాలపైన ఔషధం కావటాన జొన్న సామాన్యుడి జొన్నాయుధంగా మారిందిప్పుడు. ఒకనాడు కూటికి లేనివాళ్లు తినేది! ఇప్పుడు బియ్యమే చవక. ‘ఓడలు-బండ్లు’ అంటే ఇదే! తిట్టుకుంటూనే శ్రీనాథుడు కొన్ని జొన్నవంటకాల్ని ఈ చాటువులో పేర్కొన్నాడు.
జొన్నకలి: జొన్నరవ్వని ముందురాత్రి నానబెట్టి, ఎసట్లో వేసి పలుచగా జావకాచి, కుండలో ఒక రోజంతా ఉంచి పులవనిస్తే అదే జొన్నకలి. కుండలోంచి రోజూ కొంత కలిని ఇవతలకు తీసి కొత్తగా జొన్నజావ కలుపుతుంటారు. ఇది జొన్న తరవాణి.
జొన్నంబలి: జొన్నపిండికి 8 రెట్లు నీళ్లు పోసి ఉడికించినది అంబలి. సంస్కృతంలో మండం అంటారు. చంటిపిల్లలక్కూడా ఇవ్వదగింది. ఇంకొంచెం ఎక్కువ పిండి కలిపి కాచిన చిక్కని అంబలిని పేయం అనీ, మరింత పిండి కలిపి పేస్టులాగా ఉడికిస్తే విలేపి అనీ పిలుస్తారు. జీర్ణశక్తి ననుసరించి తీసుకోవాలి. ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఎండు ఖర్జూరం పొడి, కొద్దిగా బెల్లం, జీడిపప్పు వగైరా కలుపుకోవచ్చు. దీంట్లోనే పెరుగు కలిపి చిలికితే పుల్లంబలి అంటారు. జొన్నపేలాలతో ఇంకా తేలికగా అరుగుతుంది.
జొన్నన్నం: జొన్నల్ని లేదా జొన్నరవ్వని పైపైన వేగించి ముందురాత్రే నానబెట్టి తగినంత ఎసట్లో ఉడికించిన అన్నం రుచిగా ఉంటుంది. ఇందులో కూరగాయముక్కలు ఉల్లిముక్కలు కలిపి ఖిచిడీ లేదా ఉప్మా వండుకోవచ్చు.
జొన్నపిసరు: సన్నటి జొన్న రవ్వలో తెర్లే నీళ్లు పోసి ఇడ్లీ పిండిలాగా చిక్కగా కలుపుకొని వాసెన కట్టి ఆవిరిమీద ఉడికించినది జొన్నపిసరు. 1917 తరువాతే మనకు ఇడ్లీపాత్రలు అందుబాటలో కొచ్చాయి. అప్పటిదాకా ఇడ్లీలను ఇలా వాసెనకుడుములు గానే వండేవారు. ఈ పిండిలో కూరగాయ ముక్కలు కలిపి ఉడికిస్తే ఆరోగ్యకరం. సాంబారుతో తింటే కమ్మగా ఉంటుంది.
గుండ్రని ధాన్యం కాబట్టి, జొన్నల్ని ‘వృత్త తండులం’ అంటారు. తెల్లజొన్నలు ఉత్తమం. బలకరం. రుచికరం. క్యాలరీలు తక్కువ. వీర్యకణాల్ని, లైంగికశక్తిని పెంచుతాయి. గర్భాశయ దోషాల్ని పోగొట్టి సంతానం కలిగిస్తాయి. వేగంగా శరీరంలో వ్యాపిస్తాయి. ఆపరేషన్లు అయినవారికి, సెప్టిక్ వ్రణాలు, క్యాన్సర్, షుగర్‌వ్యాధిలో పిటికలు (కార్చన్‌కుల్స్)తో బాధపడేవారికి జొన్నలే మంచివి. వాతవ్యాధులు, రక్తహీనత, ధాతుక్షయం, శరీరం ఆర్చుకుపోవటం, శుష్కించి పోవటం, షుగరు అదుపు కాకపోవటం వీటన్నింటికీ జొన్నలే ఔషధాలు. లోహలవణాలు, ప్రొటీన్లు జొన్నల్లో రెట్టింపు ఉంటాయి కాబట్టే, శ్రీనాథుడన్నట్టు నిస్సారమైన తెల్లన్నం వద్దని కుసుమాస్ర్తుండైన (మన్మథుడు) జొన్నకూడే కుడుచున్! మీరైనా, నేనైనా ఎవరైనా అంతే!
జొన్నలకు సంబంధించిన తెలుగుపదాలు తెలుగువారికి జొన్నలతో ఉన్న అనుబంధాన్ని చాటుతాయి. అలము=జొన్నచేలలో మొలిచే గడ్డి; ఊచబియ్యం= ఇంకా ముదరని జొన్నలు; పిసికిళ్లు=ఊచబియ్యపు పేలాలు. కండె= జొన్నకంకి; కుచ్చెల= జొన్నకండెల పోగు. కొయ్య= జొన్న కంకి కోయగా మిగిలిన కాండం. నాము= చిగిర్చిన జొన్నకొయ్య; ఒగుడు= ఎండిన జొన్న ఆకు. పుంజము= మెట్టభూముల్లో పండే జొన్నలు. బొంతు= పొట్టుతో ఉన్న జొన్నలు, మండె= కోసిన జొన్నకంకుల కుప్ప, సుంకు: జొన్నగింజ ఇంకా ఏర్పడకమునుపు ప్రతీ గింజమీద ఉండే జొన్న పువ్వు. సుంకుపోసుకున్న జొన్న అంటారు. తోటజొన్న, ముదురుజొన్న, పయిరు జొన్న, లోగుపెద్దజొన్న, తెల్ల జొన్న, పాలపుజొన్న(పచ్చజొన్న), గిడ్డజొన్న, గడ్డిజొన్న, కొండజొన్న, ఎర్రజొన్న, మొక్కజొన్న ఇలా జొన్నల్లో రకాలున్నాయి. పొట్టి తిమ్మడి జొన్న అంటే చాలా తక్కువ రకం జొన్నఅని! పాళము అనే ఒకరకం జొన్నకూడా ఉంది.
బాగా తెర్లుతున్న వేడివేడి నీళ్లలో జొన్నపిండి వేసి కలియబెట్టి చల్లార్చి జొన్నరొట్టెలు చేస్తారు. ఇలా చేయటాన్ని ఉప్పుట అనీ ఈ పిండిని ‘జొన్న ఉప్పిండి’ అనీ పిలుస్తారు. జొన్న ఉప్పిండితో పుల్కా, చపాతీ పరోటాలు చేసుకోవచ్చు. బేకరీరొట్టెలు, కుడుములు, ఉండ్రాళ్లు, వండుకోవచ్చు.
జొన్నలు మనల్ని కాపాడే అన్నలు! ఆయుధ సంపన్నులు! వాటిని ఈసడించకుండా కమ్మగా తినడానికి ఆలోచనలు చెయ్యండి!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
Updated Date - Nov 03 , 2024 | 10:53 AM