పవిత్రాహారాలు ‘అపూపాలు’
ABN, Publish Date - Nov 17 , 2024 | 09:26 AM
అనేక యజ్ఞాలు చేసిన మాంధాత పాయసం, అపూపం, మోదకాలతో వేదపండితులకు విందు ఇచ్చినట్టు భారతం ద్రోణపర్వంలో తిక్కనగారి వర్ణన ఇది. ‘‘సూపా పూపై శ్శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః’’ యజ్ఞానంతరం వేదవిదులకు సూపం (పప్పు), పంచదార చల్లిన అపూపం, పాయసం, పండ్లతో భోజనం పెట్టాలని శంకరాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యంలో చెప్పారు. తిక్కన అదే రాశారు.
‘‘... అధ్యరములు పెక్కు లొనర్చి వేడుకఁ,
బాయసమ్ములు నపూపములు
మోదకములు లోనుగాఁ గల
వంటకముల నుర్వీ సురావళులకు బ్రీతిఁజేసి’’
అనేక యజ్ఞాలు చేసిన మాంధాత పాయసం, అపూపం, మోదకాలతో వేదపండితులకు విందు ఇచ్చినట్టు భారతం ద్రోణపర్వంలో తిక్కనగారి వర్ణన ఇది. ‘‘సూపా పూపై శ్శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః’’ యజ్ఞానంతరం వేదవిదులకు సూపం (పప్పు), పంచదార చల్లిన అపూపం, పాయసం, పండ్లతో భోజనం పెట్టాలని శంకరాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యంలో చెప్పారు. తిక్కన అదే రాశారు.
అందరూ తినే ప్రాణరక్షక ఆహారం అన్నం. ధనాధికులు తినగలిగే పోషకాహారం ‘అన్నాద్యం’. మహానివేదన పెట్టదగిన పవిత్రాహారం ‘వాజం’. ఈ మూడు అన్నాలూ కలిసినది వాజజితి. మన భోజనం వాజజితంగా ఉండాలంటే అది కల్తీ కలవని, నాణ్యమైన పోషకాహారం కావాలి! అందులో అపూప, పాయస, ఫలాలు కూడా ఉండాలి.
అపూపాలంటే యజ్ఞంగానీ, యాగం గానీ, పూజగానీ, వ్రతంగానీ చేసుకున్నాక వేదపండితులకు పెట్టి మనం తినేవని! పండగనాడు పూజచేసుకుని పప్పు, పాయసం, అప్పచ్చులు భగవంతుడికి నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో కలిసి తినే ఆచారం వెనుక ఇంత కథ ఉంది.
ఈ అపూపాలను తినేవాడు (అగ్ని) అపూపికుడు. అపూపాలను అప్పచ్చుల్లా వండుకోవటానికి, యజ్ఞం కోసం వండటానికి తేడా ఉంది. ‘‘అగ్నయే గృహపతయే పురోడాశం .. కృష్ణానాం వ్రీహీణాగుం’’ అగ్నిలో వ్రేల్చేం దుకు చేసే అపూపాలను కృష్ణవ్రీహులుతో అంటే, నల్లని బియ్యంతో వండుతారు. యజ్ఞం కోసం వండే అపూపాలను పురోడాశం అని పిలుస్తారు.
అపూపం అంటే, అట్టు, అప్పచ్చి, అప్పడం అని ఆంధ్రవాచస్పత్యం; కజ్జము, అప్పం, అప్పచ్చి, కజ్జాయం అని అచ్చతెలుగుకోశం; ‘పిండివంటలన్నీ అపూపాలే’ అని ఆంధ్రదీపిక; ‘‘పూపో పూపః పిష్టక స్స్యాత్’’ పిండితో చేసేవి పూపాలు, అపూపాలు అని అమరకోశం పేర్కొన్నాయి. అపూపాల్ని అనేక రకాలుగా చేస్తారు.
గోధుమ అపూపాలు: రోటీలు, చపాతీలు పూరీలు, కరకరపూరీలు, సొజ్జప్పాలు.
మాష అపూపాలు: మినప్పిండితో చేసే గారెలు, దోసెలు, అట్లు, దిబ్బరొట్టెలు, కుడు ములు, ఇడ్డెనలు, చక్రాలు జంతికలు వగైరా.
పిష్ట అపూపాలు: బియ్యప్పిండితో చేసే వంటకాలు - చలిమిడి అరిసెలు, బూరెలు.
క్షీర అపూపాలు: బియ్యం, పాలు, నెయ్యి కలి సిన పాయసాలు, పిండితో చేసే హల్వా, కేసరి.
ఎఫ్ బి జె క్వీపర్ అనే భాషావేత్త రుగ్వేదంలో 350కి పైగా పదాలను ఏరి వీటికి రుగ్వేద మూలాలు లేవని ఈ పదాలు ద్రావిడ లేదా ముండా భాషల్లోంచి రుగ్వేదంలో చేరి ఉంటాయని పేర్కొన్నాడు. వాటిలో అపూపం కూడా ఒకటి. అపూపం మన నుండే రుగ్వేదంలోకి వెళ్లింది. రుగ్వేదకాలానికే ద్రావిడ జాతుల ఉనికి ఉన్నదనటానికి ఇది సాక్ష్యం. తొలుత రుగ్వేద కాలంలో అపూపాలంటే బార్లీ పిండి వాడకమే ఎక్కువ. ఆ తరువాత గోధుమ, వరి వంటకాలు వాడకంలో కొచ్చాయి. ముద్గ (పెసర) మాష (మినుము), చణక (శనగ) ఇవి ప్రాచుర్యానికొచ్చాక అప్పచ్చుల మీద దక్షిణాదిలో కొత్త ప్రయోగాలు జరిగాయి. ఈనాటి మన పిండివంటలన్నీ అలా మొదలైనవే!
అపూపాలంటే పవిత్రాహారాలు. వాటిని తయారు చేసేందుకు వాడే ద్రవ్యాల నాణ్యత మీద, వాటిలోని పోషక విలువల మీద, వాటిని ఆరోగ్యదాయకంగా వండే విధానం మీద వాటి పవిత్రత ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన పోషకాలున్న ఆహారాన్నే మనం తింటున్నామని దేవుడికి చూపించే సాక్ష్యం నైవేద్యం. నెయ్యి నెయ్యికాదు, నూనె నూనె కాదు, తేనె తేనె కాదు, పాలు పాలు కావు. ఆఖరికి నీళ్లు కూడా నీళ్ళు కాకుండా పోతుంటే మనల్ని మనం కాపాడుకోగలగటం కష్టమే! మన దృష్టి పవిత్రా హారాల మీద ఉండాలని అపూపాల కథ మనకు గుర్తుచేస్తోంది. మన ఆహారాలు పవిత్రం కావాలంటే నాణ్యత లేని కల్తీ సరుకుల అమ్మకాల మీద కూడా ప్రభుత్వాలు పట్టు బిగించాలి.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
Updated Date - Nov 17 , 2024 | 09:26 AM