హిప్ ‘యాప్’ హుర్రే!
ABN, Publish Date - Oct 27 , 2024 | 07:12 AM
స్మార్ట్‌ఫోన్‌ను సరైన రీతిలో ఉపయోగిస్తే అరచేతిలో అన్నీ ఉన్నట్లే. వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం దగ్గర నుంచి మహిళలకు భద్రత కల్పించడం వరకు... కొన్ని ‘యాప్స్’ సాయంతో స్మార్ట్‌ఫోన్ చాలానే చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం...
స్మార్ట్‌ఫోన్‌ను సరైన రీతిలో ఉపయోగిస్తే అరచేతిలో అన్నీ ఉన్నట్లే. వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం దగ్గర నుంచి మహిళలకు భద్రత కల్పించడం వరకు... కొన్ని ‘యాప్స్’ సాయంతో స్మార్ట్‌ఫోన్ చాలానే చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం...
- స్మార్ట్ రిమోట్‌గా
టీవీ రిమోట్ పోయిందా? లేదా రిమోట్ సరిగ్గా పనిచేయట్లేదా? కంగారేం లేదు. స్మార్ట్‌ఫోన్‌ని రిమోట్‌గా మార్చి స్మార్ట్ టీవీని ఆపరేట్ చేయవచ్చు. ఇందుకోసం మొదటగా ఫోన్, స్మార్ట్ టీవీ రెండింటికీ బ్లూటూత్ లేదా వైఫై కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి, ‘గూగుల్ టీవీ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని టీవీని, స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవడమే. టీవీ వాల్యూమ్ తగ్గించడం, పెంచడం, మ్యూట్ చేయడం, ఛానల్స్ మార్చడం, వాయిస్ సెర్చ్ లాంటివన్ని సులువుగా చేయొచ్చు.
- వాతావరణ హెచ్చరికలు
వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని దామిని, మౌసమ్, యాహూ వెదర్ వంటి యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఉన్న ప్రాంతాన్ని అందులో టైప్ చేస్తే చాలు. వాతావరణ మార్పులు, వాతావరణ పరిణామాలపై ముందస్తు హెచ్చరికలను జారీచేయడంతో పాటు, అప్రమత్తం చేస్తాయి.
- డాక్యుమెంట్ స్కానర్
ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేయాలంటే స్కానర్ ఉండాలి. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా డాక్యుమెంట్స్‌ను సులువుగా స్కాన్ చేసుకోవచ్చు. అడోబ్ స్కాన్, కాగజ్ స్కాన్, టర్బో స్కాన్, ఫైన్‌రీడర్ పీడిఎఫ్ యాప్స్ ద్వారా డాక్యుమెంట్‌లో ఉన్న టెక్ట్స్‌ని పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ సైజ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇవి బుక్ స్కానర్, ఫొటో స్కానర్, స్లైడ్ స్కానర్, బిజినెస్ కార్డ్ స్కానర్‌లా కూడా పనిచేస్తాయి.
- డిజిటల్ వ్యాలెట్
ఈ డిజిటల్ వ్యాలెట్ ద్వారా బ్యాంకు కార్డులు, టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపరుచుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు లాయల్టీ, గిఫ్ట్ కార్డులను సైతం ఈ వ్యాలెట్‌కు యాడ్ చేసుకోవచ్చు. చెల్లింపు కార్డులను గూగుల్ వ్యాలెట్‌కు అనుసంధానిస్తే.. గూగుల్ పే, ఫోన్‌పే పనిచేసే ఎక్కడైనా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు. పైగా చెల్లింపు వివరాలన్నీ సురక్షితంగా ఉంటాయి.
- ఫిట్‌నెస్ కోసం
జిమ్‌కి వెళ్లకుండానే ఇంట్లోనే ఫిట్‌గా తయారయ్యేందుకు కొన్ని ఫిట్‌నెస్ యాప్స్ ఎంతో తోడ్పతాయి. ఎలాంటి ఆహారం తీసు కోవాలి? రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? వంటి విషయాలతో పాటు, ఆహార వివరాల ఆధారంగా ఫిట్‌నెస్ గోల్స్‌ను సూచిస్తాయి. బరువు తగ్గడానికి, పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇందులో వివరంగా ఉంటుంది. వీటిలో ప్రొఫెషనల్ ట్రైనర్స్, అథ్లెట్స్ రూపొందించిన వీడియోలు ఉంటాయి. కార్డియో, స్ట్రెంగ్త్, యోగా తదితర కేటగిరీల వర్కవుట్స్ జాబితా ఉంటుంది. అలాగే గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు వంటి వివరాలను ఈ యాప్‌ల ద్వారా పొందొచ్చు.
- పిల్లలకు ప్రత్యేకం
వార్షిక పరీక్షలు, పోటీ పరీక్షల ప్రిపరేషన్ సమయంలో విద్యార్థులు తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతారు. వాటి నుంచి ఉపశమనం కల్పించడానికి బ్రీత్2రిలాక్స్, మైండ్‌ఫిట్, సాన్‌వెల్లో వంటి యాప్స్ తోడ్పతాయి. ఒత్తిడిని తగ్గించి, విశ్వాసాన్ని పెంచుకునే చిట్కాలు ఇందులో తెలియజేస్తారు. ఆలోచనలను రికార్డు చేయడం ద్వారా ఒత్తిడికి గురిచేసే అంశాలను గుర్తించే వెసులుబాటూ ఉంది. అలాగే పిల్లలకు చదువులో ఏవైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసేందుకు బ్రెయిన్లీ, డౌట్‌నట్, టాపర్, డౌట్‌బడ్డీ యాప్స్ ఉన్నాయి.
- కొలతలు... పర్‌ఫెక్ట్‌గా...
ఇంట్లో టీవీ ఎన్ని సెం.మీ ఉంది? గది విస్తీర్ణం ఎంత? అనేది తెలుసుకోవడానికి ఇకపై ఎలాంటి టేపు ఉపయోగించాల్సిన పనిలేదు. కేవలం ఫోన్ ద్వారానే ఎలాంటి కొలతలనైనా సులువుగా కొలవచ్చు. ఇందుకోసం రూలర్, ఏఆర్ ప్లాన్ 3డీ, స్మార్ట్ మెజర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
- మెటల్ డిటెక్టర్‌గా...
శరీరంపై లేదా బ్యాగుల్లో ఉండే లోహపు ఆనవాళ్లను సులువుగా గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్ యాప్స్ ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న సెన్సార్ల సాయంతో ఏదైన స్థలం లేదా వస్తువు దిశను కనుగొనొచ్చు.
మహిళల భద్రత
ఒంటరిగా వెళ్లేటప్పుడు, ప్రయాణ సమయంలో, పని ప్రదేశాల్లో మహిళల భద్రతా రక్షణ కోసం కొన్ని యాప్స్ సహాయపడతాయి. మై సేఫ్టీపిన్, టీ-సేఫ్(ట్రావెల్ సేఫ్), ఫైట్‌బ్యాక్, బీ సేఫ్ వంటి యాప్‌లు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మహిళలకు రక్షణగా నిలుస్తాయి.
మానసిక ఆరోగ్యం కోసం
మానసిక రుగ్మత నుంచి బయటపడేసేందుకు డేలియో, టాక్‌స్పేస్ వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి మానసికంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయి. ఈ యాప్‌లు మానసిక రుగ్మతలను గుర్తించకపోవచ్చు కానీ సమస్య నుంచి బయటపడటానికి మార్గనిర్దేశనం చేస్తాయి.
Updated Date - Oct 27 , 2024 | 07:17 AM