‘ఐస్ కప్స్’ వచ్చేస్తున్నాయ్...
ABN, Publish Date - Sep 15 , 2024 | 08:01 AM
ఏ కూల్‌డ్రింక్స్ షాపులోనైనా, కిరాణ దుకాణంలోనైనా ఫ్రిజ్ నిండా రకరకాల కూల్‌డ్రింక్స్ కనిపిస్తాయి. వేసవిలో అయితే గిరాకీ మొత్తం వీటిదే. సాఫ్ట్‌వేర్ రంగంలో సంక్షోభం అనుకోండి... మారుతున్న యువతరం అభిరుచి అనుకోండి... ఇటీవల ట్రెండ్ మారుతోంది. ఫ్రిజ్‌ల్లో సరికొత్తగా ‘ఐస్ కప్స్’ వచ్చి చేరుతున్నాయి.
ఏ కూల్‌డ్రింక్స్ షాపులోనైనా, కిరాణ దుకాణంలోనైనా ఫ్రిజ్ నిండా రకరకాల కూల్‌డ్రింక్స్ కనిపిస్తాయి. వేసవిలో అయితే గిరాకీ మొత్తం వీటిదే. సాఫ్ట్‌వేర్ రంగంలో సంక్షోభం అనుకోండి... మారుతున్న యువతరం అభిరుచి అనుకోండి... ఇటీవల ట్రెండ్ మారుతోంది. ఫ్రిజ్‌ల్లో సరికొత్తగా ‘ఐస్ కప్స్’ వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లలో పాపులరైన ఈ క్రేజ్ ఇటీవల చైనాకు చేరింది. మన దగ్గర కూడా మొదలయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఏమిటివి?...
యువతరం ఎక్కడైనా, ఎప్పుడైనా కొత్త రుచుల వెంట పడుతుంది. కూల్‌డ్రింక్‌లు, కోల్డ్ కాఫీలు, జ్యూస్‌లు... రకరకాల ఫ్లేవర్లలో ఇన్నేళ్లు ఆకర్షించాయి. అయితే చాలాకాలంగా వాటినే సేవించడమో, లేదంటే వాటి ధరలు అధికంగా ఉండటమో తెలియదు కానీ ఒక్కసారిగా యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చిన భారీ కుదుపు కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఫలితంగా ఆయా షాపుల్లో ఉన్న ఫ్రిజ్‌ల్లోని కూల్‌డ్రింక్స్, కోల్డ్ కాఫీలు, ఇతరత్రా ఫ్యాన్సీ డ్రింక్స్ గిరాకీ లేక పేరుకుపోయాయి. వాటి స్థానంలో సరికొత్తగా ఐస్ కప్స్ పుట్టుకొచ్చాయి. ఈ కప్ గ్లాసుల్లో ఫ్రెష్ ఐస్ క్యూబ్స్, మంచు గోళాలు ఉంటాయి.
మీకు నచ్చినట్టుగా ...
కాఫీ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లకు సంబంధించి యువతరంలో ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్’ (డీఐవై) కాన్సెప్ట్ బాగా పెరిగింది. అంటే ఒక కాఫీ షాప్‌లోకిగానీ, కూల్‌డ్రింక్ షాప్‌లోకిగానీ వెళ్లి అక్కడ ఉండే ఫ్లేవర్స్ రుచి చూడటం అనే పాత పద్ధతి నుంచి... తమకు నచ్చిన ఫ్లేవర్స్ కాంబినేషన్‌లో ఆస్వాదించడం ఎక్కువయ్యింది. కొన్ని ప్రసిద్ధ బ్రాండ్లలో ఈ తరహా కాంబినేషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వాటి ధర సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ‘ఐస్ కప్స్’ ప్రత్యేకంగా నిలిచి, యువతరం ఆస్వాదించే రుచులకు తాజాదనాన్ని తీసుకొచ్చాయి.
ఐస్‌తో నిండి ఉన్న ఒక ఐస్‌కప్... ఇతరత్రా కూల్‌డ్రింక్స్, కాఫీల కన్నా చాలా చవకగా లభిస్తుంది. దాంట్లో ‘డీఐవై’ కాన్సెప్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇష్టమొచ్చిన ఫ్లేవర్లను ఈ కప్‌లో ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఈ ఐస్ కప్‌తో అనేక ప్రయోగాలు చేస్తూ యువతరం వాటిని సోషల్ మీడియాలో పెడు తోంది. ఉదాహరణకు ఒక ఐస్ కప్‌లో మూడొంతులు జాస్మిన్ టీ పోసుకుని, దాని పైన లిచీ జ్యూస్‌తో టాపప్ చేస్తున్నారు. మరొక అమ్మాయి ఆరెంజ్ జ్యూస్‌లో బ్లాక్ కాఫీ కలుపు కుని సరికొత్త కోల్డ్ కాఫీని ఆస్వాదిస్తోంది. ఈ విధంగా అనేక ప్రయోగాలను అతి చవకలో ఐస్‌కప్‌లతో యువతరం చేస్తోంది.
ప్రముఖ కంపెనీలు కూడా...
జపాన్, దక్షిణ కొరియాలో ఇప్పటికే పాపులర్ అయిన ఈ ఐస్‌కప్స్ ట్రెండ్ ఈ వేసవిలో చైనాలోకి కూడా అడుగుపెట్టింది. ఒక డ్రింక్ లేదా కాఫీ కోసం వందలు వెచ్చించే బదులు కేవలం 35 రూపాయలు (3 యెన్స్) పెట్టి ‘డీఐవై’ ప్రయోగాలు చేసేందుకు చైనా యువతరం ఉత్సాహం చూపింది. దాంతో అక్కడ ఐస్‌కప్స్ క్రేజ్ ఊపందుకుంది. ఐస్‌కప్స్ తయారుచేసేందుకు ప్రసిద్ధ పానీయాల కంపెనీలు కూడా ముందుకొచ్చాయి. దాంతో వీటి ధర మూడొంతులు తగ్గి 11 రూపాయలకు వచ్చింది. చైనాలోని అతి పెద్ద బాటిల్డ్ వాటర్ సప్లయర్స్ అయిన ‘నాంగ్ ఫూ స్ర్పింగ్స్’ కూడా 160 గ్రాముల ఐస్‌కప్స్‌ను తయారుచేస్తోంది. ఈ ట్రెండ్ వచ్చే వేసవి నాటికి మనదేశంలో కూడా మొదలయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
Updated Date - Sep 15 , 2024 | 08:01 AM