గుణపాఠం
ABN, Publish Date - Oct 27 , 2024 | 10:39 AM
చంపానగరాన్ని చవ్యనుడు పాలించేవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. చవ్యనుడు పుట్టుకతో గుడ్డివాడు కావడంతో ఆయన తమ్ముళ్లు పాలనను పర్యవేక్షించేవారు.
చంపానగరాన్ని చవ్యనుడు పాలించేవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. చవ్యనుడు పుట్టుకతో గుడ్డివాడు కావడంతో ఆయన తమ్ముళ్లు పాలనను పర్యవేక్షించేవారు.
చవ్యనుడికి తమ్ముళ్ల ప్రవర్తనపై సందేహం కలిగింది. వెంటనే మంత్రి మారయ్యను సమావేశపరిచి తమ్ముళ్లపై నిఘా వేయాలని ఆదేశించాడు. మంత్రి తనకు నమ్మకమైన ఇద్దరు భటులను నిఘాకు నియమించాడు.
కాలం గడిచే కొద్దీ చవ్యనుడి తమ్ముళ్ల ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది. విపరీతంగా ఖర్చుపెట్టసాగారు. ‘‘ఇదేమిటి?’’ అని ప్రశ్నిస్తే ‘‘ఆ గుడ్డి రాజుకు ఏమీ తెలియదు. పాలన మాది... ఆస్తులు అనుభవించేది ఆయనా?’’ అని ఎదురు తిరగసాగారు.
అన్నకు వ్యతిరేకంగా పాలన సాగించారు. దాంతో ఆర్థికస్థితి అస్తవ్యస్తమైంది. అనవసరపు ఖర్చులు పెరిగి దివాళా తీశారు.
ఖజానాలో ధనం లేకపోవడంతో రాజుకు ఏమి చేయాలో దిక్కుతోచక మంత్రిని, ఆర్థిక సలహాదారుడిని సమావేశపరిచి కర్తవ్య నిర్వహణపై చర్చించాడు. ఆదాయ మార్గాలను అన్వేషించాడు. తమ భూభాగంలో సగానికి పైగా పక్క రాజ్యాధిపతి భూపతికి అప్పగించాడు.
తనకు శిస్తులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు.
ఇప్పుడు భూభాగం భూపతి పాలనలో వున్నందువల్ల చవ్యనుడి తమ్ముళ్లు పెత్తనం చెలాయించలేకపోయారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా భూపతి అనుమతి తప్పనిసరి అయ్యింది. ఇక చేసేదేమీ లేక అన్న చవ్యనుడి వద్దకు వెళ్లి ‘‘ఇన్నాళ్లు గుడ్డివాడివని పాలనలో సాయపడ్డాం.. మాపై అవిశ్వాసంతో రాజ్యాన్ని పరరాజుకు అప్పగించావు. మేం దండెత్తుతున్నాం.. కాచుకో..’’ అని కత్తి దూశారు.
అప్రమత్తమైన మంత్రి మారన్న భూపతికి సమాచారం అందించాడు.
దాంతో ఆయన చవ్యనుడి తమ్ముళ్లను పట్టి బంధించాడు. చెరసాలలో వేయడంతో తమ్ముళ్ల కుటుంబం ఆవేదనకు గురైంది. పాలన చక్కబడిన తర్వాత చవ్యనుడిని తమ్ముళ్ల వద్దకు తీసుకెళ్లాడు భూపతి.
సంకెళ్ల మధ్య బందీ అయిన అన్నను చూసి తమ్ముళ్లు చలించిపోయారు.
‘‘సోదరా... మమ్మల్ని క్షమించు. నువ్వు అంధుడివని ఏమీ చేయలేవని కళ్లు మూసుకుపోయి మేము ఇష్టం వచ్చినట్లు పాలించి, ఇలా పరాధీశుల పాలనలో బానిసలయ్యాం. మమ్మల్ని క్షమించండి.. మా కుటుంబాలు ఎలా వున్నాయోనని ఆందోళనతో తల్లడిల్లుతున్నాం. ఇన్ని రోజులూ కన్నుమిన్నూ కానకుండా ప్రజలను అష్టకష్టాలకు గురిచేశాం. ఇప్పటికి జ్ఞానోదయమైంది. బానిస సంకెళ్లు వీడే మార్గం వెతుకుదాం..’’ అని అన్నారు.
‘‘అలాంటివేమీ వెతుక్కోనవసం లేదు.. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయి అన్నను అష్టకష్టాలు పెడుతున్న మీ పాలనను చక్కదిద్ది... మీకు జ్ఞానోదయం కలిగించడానికి మేమాడిన నాటకం ఇది’’ అంటూ పొరుగు రాజు భూపతి అక్కడికి చేరుకుని చవ్యనుడిని సంకెళ్ల నుంచి విడిపించాడు.
అన్నను మామూలుగా చూసిన తమ్ముళ్లు అజ్ఞానం వీడి ఆనందంతో మళ్లీ చంపా నగరాన్ని అన్న కనుసన్నల్లో పాలించి ప్రశంసలు పొందారు.
- బోగా పురుషోత్తం
తంబూరు, తిరుపతి జిల్లా
Updated Date - Oct 27 , 2024 | 10:39 AM