ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లిటిల్‌ లైబ్రరీలు వచ్చేస్తున్నాయ్‌!

ABN, Publish Date - Nov 17 , 2024 | 08:10 AM

ఒకప్పటిలా కాదిప్పుడు. ఏదైనా చిటికెలో అయిపోవాలి. అంతా ఇన్‌స్టంట్‌! చాటింగ్‌లా ఒక్క ముక్కలో చెప్పాలి. యూట్యూబ్‌ షార్ట్స్‌లా అర నిమిషంలో టాలెంట్‌ చూపించాలి. ఇన్‌స్టాలో రీల్స్‌లా అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలంతే! అందుకే నానో కల్చర్‌ను ఇష్టపడుతోంది కొత్తతరం.

ఒకప్పటిలా కాదిప్పుడు. ఏదైనా చిటికెలో అయిపోవాలి. అంతా ఇన్‌స్టంట్‌! చాటింగ్‌లా ఒక్క ముక్కలో చెప్పాలి. యూట్యూబ్‌ షార్ట్స్‌లా అర నిమిషంలో టాలెంట్‌ చూపించాలి. ఇన్‌స్టాలో రీల్స్‌లా అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలంతే! అందుకే నానో కల్చర్‌ను ఇష్టపడుతోంది కొత్తతరం. ఎంత చిన్నదైతే అంతిష్టం. ఎంత దగ్గరుంటే అంత సులభం. సరిగ్గా ఈ సూత్రంతోనే పుట్టుకొచ్చింది ‘లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’... బుల్లిపెట్టె.. అందులోకి ఇలా వచ్చి అలా వెళ్లే పుస్తకాలు. కాలనీలు, సూపర్‌మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు, కాఫీషాప్‌లు, రైల్వేస్టేషన్లు.. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కడుంటే


అక్కడికే వచ్చేసిందీ లిటిల్‌ లైబ్రరీ..

గ్రంథాలయం అంటే బూజు పట్టిన పాత భవనం.. విరిగిన చెక్క కుర్చీలు, మురికిపట్టిన బల్లలు.. దుమ్ముకప్పిన పుస్తకాలు.. ఇలానే ఎందుకుండాలి? పేరుకే లైబ్రరీ కానీ.. అక్కడ ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఉంటుందా? నిజం చెప్పాలంటే మన దేశంలోని ఏ ప్రభుత్వ గ్రంథాలయం అంత పరిశుభ్రంగా ఉండదు. అరల్లోని ఏ పుస్తకాన్ని తెరిచినా ఠక్కున తుమ్ములు వస్తాయి. అరగంట కూర్చుంటే అలర్జీ పట్టేస్తుంది. వచ్చినంత సేపట్లోనే వెనక్కి వెళ్లక తప్పదు. ఇదీ నేటి పరిస్థితి..! లైబ్రరీ అంటే ఇలానే ఎందుకుండాలి? కాలానికి తగ్గట్టు అన్నీ మారుతున్నాయి కదా! మరి పుస్తకాలయాలు ఎందుకు మారవు? మనందరికీ వచ్చే ధర్మాగ్రహమే అమెరికాలోని టోడ్‌ బోల్‌, రిక్‌బ్రూక్స్‌లకు వచ్చింది.


‘మనం లైబ్రరీకి వెళ్లడం కాదు.. మన దగ్గరికే లైబ్రరీ వస్తే ఎంత బావుంటుంది’; ‘పుస్తకం అంటే ఇంట్లో దాచుకునే వస్తువు కాదు.. పదిమందికిచ్చి చదివించేది’ అన్నది వీరి ఆలోచన. ఇద్దరూ కలిసి కొత్తతరం ఇష్టపడే గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘ద లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’. ఇంటిగే టు ముందు ఉత్తరాల డబ్బా అంతటి సైజున్న లిటిల్‌ లైబ్రరీ.. ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలతో పాటు సుమారు 121 దేశాలకు వెళ్లింది ‘లిటిల్‌’ ఉద్యమం. 1.75 లక్షల లైబ్రరీల మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 40 కోట్ల పుస్తకాలు చేతులుమారాయి.


పుస్తకప్రియుడి ఆలోచన..

పేరులోనే ఉంది ‘లిటిల్‌’ లైబ్రరీ అని!. నేటి హర్రీబర్రీ జీవితంలో లైబ్రరీకి వెళ్లాలంటే అదొక కార్యక్రమం.. ప్రత్యేక పనిగా పెట్టుకుంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడున్నవన్నీ ఒకప్పుడు వచ్చిన గ్రంథాలయాలే! కాబట్టి నగరాలు, పట్టణాల్లోని రద్దీ కూడళ్లలోనే వెలిశాయవి. ట్రాఫిక్‌ను ఛేదించుకుని వెళ్లడం అంత సులభం కాదు. అందులోనూ లైబ్రరీల నిర్వహణ అధ్వానంగా మారింది. కుంటి కుర్చీలు, మురికి బల్లలు, దుర్వాసన కొట్టే రాక్‌లు, పుస్తకాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా లైబ్రరీలకు వెళ్లొస్తే.. మరుసటి రోజు అలర్జీ తప్పడం లేదు. అందులోనూ కొత్తతరం ఇష్టపడే వర్ధమాన పుస్తకాలను ప్రభుత్వ లైబ్రరీలు అంత త్వరగా తెప్పించవు.


నిర్వహణకే నిధులు లేనప్పుడు.. ఖరీదైన పుస్తకాల కొనుగోళ్లకు డబ్బులెక్కడ? అన్నది లైబ్రరేరియన్ల ఆవేదన. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో సారస్వత వికాసం మొదలైనప్పుడు గ్రంథాలయోద్యమం విప్లవంలా జనంలోకి వెళ్లింది. పుస్తక పఠనం పెంచింది. ఇలాంటి పుస్తకోద్యమాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు పాఠకులు పెరిగారు. ప్రపంచీకరణ పుణ్యమాని ప్రాథమ్యాలు మారడంతో అన్ని దేశాల్లో లైబ్రరీలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొత్తతరం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిణామాలన్నీ గమనించిన అమెరికా మిత్రద్వయం టోడ్‌ బోల్‌, రిక్‌బ్రూక్స్‌లు సరికొత్త ఆలోచనతో లిటిల్‌ లైబ్రరీలకు శ్రీకారం చుట్టారు.


టోడ్‌ తండ్రి వైద్య ఆరోగ్య నిపుణుడు. తల్లి ఉపాధ్యాయురాలు. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేదామె.కొడుక్కు అదే అబ్బింది. సాహిత్య, సామాజిక, తత్వశాస్త్రాలను చదువుకున్న టోడ్‌... యూఎస్‌లోని విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, సైకాలజీ లలో పట్టభద్రుడయ్యాడు. పుస్తకాల పిచ్చి కదా.. అందుకే బోధనారంగం ఆకర్షించింది. కొన్నాళ్లు టీచరై పాఠాలు చెప్పాడు. ‘‘ఇతర దేశాల్లోనే కాదు.. అమెరికాలో కూడా మూడు కోట్ల మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు. చదువరుల్లో కూడా పుస్తకాలు చదవడం తగ్గింది. ఏదో రకంగా తిరిగి చదివించే అలవాటును బతికించాలన్న తపన వెంటాడేది. ఏ జాతి అయినా సాంస్కృతిక వికాసంతోనే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది. తద్వార మానవీయ, నైతిక, సాంస్కృతిక విలువలు పెంపొందుతాయి. అందుకు పుస్తకపఠనమే అత్యుత్తమ ఆదర్శ మార్గం’’ అన్నది టోడ్‌ నమ్మిన సిద్ధాంతం.


అలా పుట్టుకొచ్చింది..

విస్కాన్సిన్‌ (యూఎస్‌)లోని హడ్సన్‌.. ఒక చిన్న గది. అచ్చం క్లాస్‌రూం లాగే ఉంది. అందులో కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలు. రాక్‌లలో పద్ధతిగా అమర్చారు. వయోబేధం లేకుండా వస్తున్నారు పాఠకులు. ‘‘హాయ్‌ టోడ్‌.. నీదొక అద్భుతమైన ఆలోచన దీనిని అమెరికా వరకే పరిమితం చేయొద్దు. ప్రపంచమంతా తీసుకెళ్లు..’’ అంటూ ఒక పెద్దాయన టోడ్‌ భుజం తట్టి అభినందించాడు. ‘గుడ్‌ ఐడియా అంకుల్‌’ అంది మరో విద్యార్థిని. వారం గడిచింది.. ఇరుగుపొరుగు వారొచ్చారంతా. కొందరు ఇక్కడి పుస్తకాలను ఉచితంగా తీసుకెళుతుంటే... మరికొందరు తమ ఇళ్లలోని పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వచ్పిపోయేవాళ్లందరూ రిజిస్టర్‌ నోట్‌బుక్‌లో పేర్లు నమోదు చేశాక తెలిసింది.. డిమాండ్‌ ఎంత పెరిగిందో!. టోడ్‌ పెట్టిన ‘లిటిల్‌ లైబ్రరీ’కి అంత పేరొస్తుందని అస్సలు ఊహించలేదు.


ప్రపంచమంతా... లిటిల్‌

లిటిల్‌ లైబ్రరీ విషయంలో ఇద్దరు మిత్రుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ‘పుస్తకాలను ఎవరైనా ఇవ్వొచ్చు.. ఎవరైనా తీసుకెళ్లొచ్చు’ అనే అంశం తప్పిస్తే.. మనది కూడా సాధారణ లైబ్రరీలాగే మిగిలిపోతుందేమో’’ అన్నాడు రిక్‌బ్రూక్స్‌. అందుకు టోడ్‌ విభేదించినా.. కొన్నాళ్లకు పునరాలోచనలో పడ్డాడు. మనం అనుకున్న ఆధునిక గ్రంథాలయోద్యమం ఇది కాదు.. అన్న ఏకాభిప్రాయానికి వచ్చారిద్దరూ. ‘పాఠకులు లైబ్రరీలకు వెళ్లడం కాదు.. లైబ్రరీలే వాళ్ల వద్దకు వెళ్లాలి’ అనే ఏకసూత్రం ఆధారంగా ‘ద లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’కి అంకురార్పణ జరిగింది. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఓ చిన్న చెక్కపెట్టెను మనిషి ఎత్తులో అమర్చితే చాలు.. అదే లిటిల్‌ లైబ్రరీ. నిర్వహణకు సిబ్బంది అక్కర్లేదు. భవనాలు అసలే అవసరం లేదు.


పుస్తకాలను ఎవరైనా ఇవ్వొచ్చు.. ఎవరైనా తీసుకెళ్లొచ్చు. ఇదీ కాన్సెప్ట్‌. అమెరికాలోని న్యూయార్క్‌, కాలిఫోర్నియా, చికాగో, టెక్సాస్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా, హ్యూస్టన్‌, ఫ్లోరిడా.. ఇలా అనేక ప్రాంతాల్లోని పబ్లిక్‌ పార్కులు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాఫీహౌస్‌లు, కూడళ్లు, మైదానాలు, ఖాళీ ప్రదేశాలు, మార్కెట్లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ లిటిల్‌ లైబ్రరీలు వెలిశాయి. మొదట్లో వింతగా చూశారంతా!. కొందరైతే కుతూహలంతో ఈ రోజు ఏ పుస్తకాలు వచ్చాయి? అని పెట్టెను తెరిచేవారు. నచ్చిన పుస్తకాన్ని పట్టుకెళ్లేవారు. ‘లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’ ఏర్పాటుకు ఖర్చు తక్కువ. ఈ చెక్కపెట్టెల్ని లిటిల్‌ లైబ్రరీ సంస్థ అమ్మడం మొదలుపెట్టింది. పలు అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల వాళ్లు పెట్టెల్ని కొనుగోలు చేసి.. తమ ప్రాంగణాల్లో బుల్లి లైబ్రరీలను ఏర్పాటు చేశారు.


వాటికి పుస్తకదానం చేసే వాళ్లందరూ ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టసాగారు. ఇదొక ట్రెండ్‌ అయ్యింది. అమెరికా ప్రధాన మీడియా కూడా స్పందించింది. సమాజానికి ‘లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలు’ అవసరం అంటూ టోడ్‌, బ్రూక్స్‌లను అభినందించింది. చూస్తుండగానే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి లిటిల్‌ లైబ్రరీలు. ఆఖరికి అమెరికాలోని మొక్కజొన్న తోటలు, సరస్సులు, సబ్‌వే స్టేషన్లు, ఫామ్‌హౌస్‌లలో కూడా లిటిల్‌ లైబ్రరీలు వెలిశాయి. కార్లలో వెళ్లే వాళ్లు అక్కడ కాసేపు ఆగి.. ఒక పుస్తకాన్ని తీసుకెళ్లడమో.. ఇంటి నుంచి తెచ్చిన పుస్తకాలను అందులో పెట్టడమో జరిగేది. ప్రజల్లోకి అంత విస్తారంగా వెళ్లిందీ ట్రెండ్‌. అందుకే అమెరికన్‌ అసోసియేషన్‌ అవార్డ్‌, లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ లిటరసీ అవార్డ్‌ వంటివి వరించాయి.


న్యూయార్క్‌టైమ్ప్‌ పత్రిక ఇదొక ‘గ్లోబల్‌ సెన్సేషన్‌’గా కితాబునిచ్చింది. ఈ క్రమంలో.. కాలానికి కన్నుకుట్టింది. టోడ్‌ను అనారోగ్యం వెంటాడింది. క్యాన్సర్‌తో మరణించాడాయన. అయినా లిటిల్‌ లైబ్రరీ ఉద్యమం ఆగలేదు. ఆయన ఆఖర్న ఒక సందేశం ఇచ్చాడు ఇలా.. ‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరి చేతిలో ఒక పుస్తకం ఉండాలి. జనం ఎక్కడుంటే అక్కడ ఒక లిటిల్‌ లైబ్రరీ రావాలి. ఈ పుస్తకసేవను వ్యవస్థీకృతం చేస్తే నాకంటే ఆనందించే అదృష్టవంతుడు మరొకడు ఉండడు.’ అని ఆశ పడ్డాడు టోడ్‌. ఆయన స్ఫూర్తితో మన కాలనీలో, మన అపార్ట్‌మెంట్‌ సముదాయంలో లేదంటే ఒక కూడలిలో లిటిల్‌ లైబ్రరీ పెడితే .. ఆయన కల ఫలిస్తుంది. మళ్లీ ఒక ఆధునిక గ్రంథాలయ ఉద్యమం బయలుదేరుతుంది. పుస్తకం.. మన వారసులకు అందించే అపురూప కానుక.. వెలకట్టలేని ఆస్తి..!.

- మల్లెంపూటి ఆదినారాయణ


మన దగ్గర మొదలైందిప్పుడే..

భారత్‌లో కూడా లిటిల్‌ లైబ్రరీ ఉద్యమం నగరాల్లో ఇప్పుడిప్పుడే మొదలైంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు చందాలు వేసుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ముంబయిలోని ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎదుట ఇలాంటి లైబ్రరీ ప్రత్యక్షమైంది. ‘ఈ బాక్స్‌లో మహాత్మాగాంధీ, డోనాల్డ్‌ట్రంప్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి రోజూ కొత్తకొత్త పుస్తకాలు వస్తూనే ఉంటాయి’ అంది ఆ స్కూల్‌ విద్యార్థిని. ఇక, కేరళలోని కొచ్చి మెట్రో రైల్వేస్టేషన్‌లో కూడా బుల్లి లైబ్రరీ ఏర్పాటైంది. రైలుప్రయాణికులు ఆ పుస్తకాలను బాగానే చదువుతున్నారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. చెన్నైలోని అన్నై ఇందిరానగర్‌ వాసి ఎస్‌.జయకుమార్‌ సైతం తన ఇంటి గేటు పక్కనే లిటిల్‌బాక్స్‌ను పెట్టారు. ‘నాకు ప్రతి ఉదయం కుతూహలమే! నిద్రలేచిన వెంటనే ఎవరైనా అందులో కొత్త పుస్తకాలు పెట్టారేమోనని వెదుకుతాను. మొన్నామధ్య ఒక అపరిచితుడు కొన్ని విలువైన పుస్తకాలను పెట్టెలో వేశారు’ అన్నాడాయన. జయకుమార్‌ ఇంట్లోని బుక్స్‌ను కూడా ఆ లిటిల్‌బాక్స్‌లో ఉంచుతుంటాడు. ఆయనది ఉచిత అక్షరసేవ.


కాఫీ తాగండి.. పుస్తకం చదవండి..

- బెంగళూరులోని కోరమంగళలో ఉన్న ‘అట్ట గలాటా’కు వెళితే చాలు.. కాఫీ సువాసనతో పాటు.. కొత్త పుస్తకాల పరిమళం మనల్ని ఆపేస్తుంది. లోపలికి వెళుతూనే అది లైబ్రరీనా? లేదంటే కాఫీ హౌసా? అన్న సందేహం కలుగుతుంది. ఒక చేత్తో కాఫీ ఆస్వాదిస్తూ.. మరో చేత్తో పుస్తకం చదువుతూ ఆనందించవచ్చు. ‘అట్టాగలాటా’లో కనీసం పదివేల పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ పుస్తకాలు చదవొచ్చు.

- పుణెలోని ఔంధ్‌లో ఉన్న మెక్‌డోనాల్డ్‌ వెనకున్న ‘బుక్‌ కేఫ్‌ సాంగ్‌’ మరో కొత్తరకం కాఫీబుక్‌ షాప్‌. రెండు అంతస్థుల ఈ భవనం పుస్తకప్రియులకు చక్కటి వేదిక. పుణెలోని కొన్ని మిత్ర బృందాలు, చదువరులు, యువ రచయితలు, సినీప్రియులకిది అడ్డా. మార్కెట్‌లోకి వచ్చే కొత్త పుస్తకాలన్నీ కాఫీ ఖర్చుతో హాయిగా కూర్చుని చదువుకోవచ్చు.


- ‘బుక్స్‌ ఎన్‌ బ్రూ’ చండీగఢ్‌లోని మరో కాఫీబుక్‌ షాప్‌. యువత ఆహార అభిరుచులకు ప్రాధాన్యమిస్తూనే.. పుస్తకాలను అందుబాటులో ఉంచారిక్కడ. ‘‘కొత్తతరానికి చదవడం అలవాటు చేయాలంటే.. వాళ్ల ఆలోచనలకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. ఆర్డర్‌ ఇచ్చిన ఆహారపదార్థాలు వచ్చే లోపు.. రెండు మూడు పుస్తకాలు చూస్తారు.. అందులో కనీసం మూడు నాలుగు పేజీలైనా చదువుతారు కదా!. అలా రీడింగ్‌ను అలవాటు చేయడమే మా ఉద్దేశ్యం..’’ అంటారు కాఫీషాప్‌ యాజమాని.

- ఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఉన్న మెహర్‌చాంద్‌ మార్కెట్‌ పరిధిలోని ‘కేఫ్‌ సిఎంవైకె’ చక్కటి కెఫెటేరియా. ఇక్కడ బయోగ్రఫీ, స్టాక్‌మార్కెట్‌, ఆర్కిటెక్చర్‌, లైఫ్‌స్టయిల్‌, ఫొటోగ్రఫీ, ఆర్ట్స్‌.. ఇలా పలు రంగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

- కోల్‌కతాలోని ‘కేఫ్‌ స్టోరీ’, గురుగ్రామ్‌లోని ‘ కేఫ్‌ వండర్‌లస్ట్‌’, ముంబయిలోని ‘కితాబ్‌ఖానా’, గోవాలోని ‘లిటరాటి కేఫ్‌’, పుణెలోని ‘పగ్దండి కేఫ్‌’, సికింద్రాబాద్‌లో ఉన్న సైనిక్‌పురిలోని ‘ద కాఫీ షాప్‌’ ఇలా చాలానే వచ్చాయి. ఇవన్నీ రీడర్స్‌ కేఫ్‌లే!. లిటిల్‌ లైబ్రరీల్లాంటివే!.


ఎందుకు చదవాలంటే?

- శరీరంలోని కండరాలు దృఢంగా ఉండేందుకు వ్యాయామం ఎంత ముఖ్యమో.. మెదడు ఆరోగ్యానికి పుస్తక పఠనం అంతే ముఖ్యం. ప్రతిరోజూ చదివే అలవాటున్న వాళ్లకు అల్జీమర్స్‌, డిమెన్షియా వంటివి అంత త్వరగా రావు. కొత్త పుస్తకాలు సానుకూల దృక్పథాన్ని ప్రేరేపించి.. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతికూల ఆలోచనలను రానీయవు. మెదడు చురుగ్గా ఉంటుంది.

- రోజువారీ జీవితంలో ఒత్తిడి సహజం. ఇల్లు, ఆఫీసు, పిల్లలు, బాధ్యతలు.. మానసిక ఒత్తిళ్లతో ఆలోచనలు చుట్టుముడతాయి. మనతో మనం గడిపేందుకు అవకాశమే లేకుండా పోతుంది. ఇలాంటప్పుడు పుస్తక పఠనం మనల్ని మనదైన కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. చదవడంలోని సంతృప్తి.. చక్కటి ఔషధంలా పనిచేసి.. ఒత్తిడిని మాయం చేస్తుంది.


- విజ్ఞానం అనేది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? పనికొస్తుందో చెప్పలేం. మనం చదివే ప్రతి అక్షరం పొదుపంత విలువైనది. అదే కొన్నాళ్లకు సారస్వత సంపద అవుతుంది. ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అంత సమర్థంగా ఎదుర్కొనే స్థైర్యం అలవడుతుంది. ‘నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌’ అన్నది అందుకే..!.

- చక్కటి సంభాషణా చాతుర్యం, ఆకట్టుకునే పదబంధాలు, ప్రభావితం చేసే వాక్యాలు.. ఇవన్నీ పుస్తకపఠనం ఉన్న వాళ్లలో ఎక్కువ. మాటలతో ఇతరుల్ని ఆకర్షించే చాతుర్యం అలవడుతుంది. అందుకే వ్యక్తిత్వ వికాస నిపుణులు సైతం చదవటానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుంటారు. నిత్యం పుస్తకాలు చదువుతూ వర్తమానంలో ఉన్నామా.. లేదంటే చదవడం ఆపేసి పాతవాసనలతోనే జీవిస్తున్నామా? అనేది సంభాషణల ద్వారా ఎదుటి వాళ్లకు అర్థం అవుతుంది.


- తార్కికపరిజ్ఞానం, విశ్లేషణా సామర్థ్యం కేవలం చదవడం వల్లే సాధ్యం అవుతుంది. హేతుబద్ధంగా ఆలోచించడం, సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి సందిగ్ధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలకు కుంగిపోకుండా పరిష్కారాలను వెదకడం.. ఇవన్నీ పుస్తకాల నుంచి వచ్చే నైతిక బలాలు.

- ఒక పనిని విజయవంతంగా చేయాలంటే ఏకాగ్రత తప్పనిసరి. చదవడం అంటే అక్షరం అక్షరం మెదడుతో స్కాన్‌ చేసుకుంటూ వెళ్లడం అన్నమాట. ఆ సహనం ఏకాగ్రతను పెంపొందిస్తుంది. ఏ పని చేసినా ఇతరులకంటే సృజనాత్మకంగా చేయగలుగుతాం. రకరకాల అభిరుచులున్న విజేతలందరిలో సారూప్య అభిరుచి ఒకటి ఉంటుంది. అదే పుస్తక పఠనం.


‘..కానీ చదవరు’

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌బఫెట్‌ను కొలంబియా విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. ఆయన ప్రసంగం పూర్తయ్యాక ఒక విద్యార్థి లేచి.. ‘‘సార్‌, మీలాగ మేము కూడా కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలో ఒక చిన్న చిట్కా ఏదైనా ఉంటే చెబుతారా?’’ అనడిగాడు. అందుకు బఫెట్‌ చిరునవ్వుతో తన వెంట తెచ్చుకున్న గంపెడు కాగితాలు, కట్టల నివేదికలను చూపిస్తూ.. ‘‘మీరు కూడా నాలాగే రోజుకు 500 పేజీలు చదవగలిగితే చాలు. మీరు అనుకున్నది నెరవేరుతుంది. చదవడం అనేది ఏదో ఒక రోజు చక్రవడ్డీలాగా సంపదను సృష్టిస్తుంది. మీ అందరికీ చదివే సామర్థ్యం ఉంది.. కానీ మీలో ఎవ్వరూ చదవలేరనీ, అంత ఓపిక లేదనీ మాత్రం చెప్పగలను..’’ అంటూ నవ్వేశారాయన.


వారెన్‌బఫెట్‌ పెట్టుబడిదారుడే కావొచ్చు కానీ.. ఆయన ప్రతీ కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తనకు అంత ఓపిక కేవలం పుస్తకపఠనం వల్లే వచ్చిందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడాయన. వారెన్‌బఫెట్‌ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వచ్చే కొత్తకొత్త పుస్తకాలను కొంటుంటారు. ఆయన ఏటా క్రమం తప్పకుండా కనీసం 30 పుస్తకాలను చదివితీరతారట. పుస్తకం చదవడం మొదలుపెట్టేముందే దాని గురించి తెలుసుకుని.. అప్పుడు మొదలుపెడతారట. ఆయన ఏ పుస్తకాన్నీ చదవకుండా మధ్యలోనే ఆపేయరు. ఈ వయసులోనూ బఫెట్‌ పుస్తక పఠనాన్ని మాత్రం వదల్లేదు. చిన్నప్పుడు పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేని కష్టకాలంలో కూడా గ్రంథాలయాలకు వెళ్లి చదివేవాడు. వీధుల్లో పత్రికల్ని తిరగేసేవాడు. అలా అభిరుచిగా మారిన ఆ పుస్తక పఠనమే ఆర్థికసాహిత్యం (ఫైనాన్షియల్‌ లిటరసీ) వైపు అడుగులు వేసేలా చేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్‌గా ఎదిగేందుకు తోడ్పడింది.

Updated Date - Nov 17 , 2024 | 08:10 AM