MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే ఇదీ.. ఆశ్చర్యపోయిన బెంగళూరు దంపతులు..
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:54 AM
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఎంత హుందాగా ఉంటాడో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అయితే ధోనీ దంపతులు ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసే ఆసక్తికరమైన ఘటన మరొకటి జరిగింది.
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఎంత హుందాగా ఉంటాడో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అయితే ధోనీతో భార్య సాక్షి, కూతురు జీవా ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసే ఆసక్తికరమైన ఘటన ఒకటి ఈ మధ్యే జరిగింది. ఇటీవల ధోనీ, భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ప్రయాణిస్తున్న విమానంలో బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేసింది. సరిగ్గా తమ పాప నాలుగవ పుట్టిన రోజునాడే ఎంఎస్ ధోనీని కలవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ధోనీ కుటుంబంతో సంభాషణ అనుభవాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా పాపకు ధోనీ, సాక్షి, జీవా బర్త్‌డే విషెస్ చెప్పారు. పాప అమ్మానాన్నతో ఆప్యాయంగా మాట్లాడారు. ధోనీ ఫ్యామిలీతో హృదయపూర్వకమైన ఈ అనుభవాన్ని చిన్నారి తల్లి నేత్ర గౌడ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. క్రికెట్ ఐకాన్‌ను కలుసుకోవడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. తన భర్త కల నిజమైందని ఆమె అన్నారు. ‘‘మా కూతురు నాలుగవ పుట్టినరోజున ఇది ఉత్తమమైన బహుమతి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘ధోనీ మాస్క్ పెట్టుకొని ఉండడంతో చిన్నారి ఆయన దగ్గరకు వెళ్లేందుకు భయపడింది. సాక్షి కలగజేసుకొని.. ఆయనను చూస్తే భయం వేస్తుందా?. నన్ను కూడా భయపెడతాడు అని సరదాగా అన్నారు’’ అని నేత్ర గౌడ వెల్లడించారు. దీంతో ధోనీ మాస్క్ తీసేశాడు. సాక్షి, ధోనీ చాలా వినయంగా ఉన్నారని, వారి సన్నిహిత వ్యక్తుల మాదిరిగా తమతో సాక్షి మాట్లాడారని చెప్పారు.
కాగా నేత్ర గౌడ షేర్ చేసిన వీడియోలో చిన్నారితో సాక్షి ఆప్యాయంగా మాట్లాడుతుండడం కనిపించింది. పక్కనే ఉన్న ధోనీ, జీవా చిరునవ్వులు చిందిస్తున్నారు. ధోనీ ఫ్యామిలీ చాలా హృదయపూర్వకంగా వ్యవహరించడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ ఫ్యామిలీ హుందాతనంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోనీ అంటే ఇది అని ఓ అభిమాన వ్యాఖ్యానించాడు. ఈ వీడియోకు ఇప్పటికే 9.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పెద్ద సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
Updated Date - Nov 08 , 2024 | 09:59 AM