‘లక్ష’ణమైన టీ
ABN, Publish Date - Dec 08 , 2024 | 12:39 PM
పది రూపాయలకు టీ అంటే పర్వాలేదు. స్టార్ బక్స్‌లో మహా అయితే ఐదువందల నుంచి వెయ్యి రూపాయలదాకా ఉండొచ్చు. కానీ దుబాయిలోని ఓ కెఫేలో మాత్రం ఒక కప్పు టీ కోసం అక్షరాలా లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. అదే మరి ‘బొహో కెఫే’ ప్రత్యేకత.
దుబాయ్ ఫైనాన్షియల్ టవర్స్‌లో ఉన్న ఈ కెఫెలో టీ ఆర్డర్ ఇవ్వగానే... వెండి కప్పులో వేడివేడి టీ పోసి, పైన 24 క్యారెట్ల బంగారు రేకుతో అలంకరించి ఇస్తారు. చాయ్‌తో పాటు తినడానికి బంగారం చల్లిన క్రోసెంట్ కూడా అందిస్తారు. టీ తాగిన తర్వాత కస్టమర్లు సదరు వెండి కప్పు, సాసర్‌ను ఎంచక్కా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చట. కేవలం టీ మాత్రమే కాదండోయ్... ఇక్కడ గోల్డ్ కాఫీ, గోల్డ్ ఐస్‌క్రీమ్, బంగారం పూత కలిపిన బర్గర్లు, గోల్డ్ వాటర్ కూడా దొరుకుతాయి. ఈ కెఫేలో రెండు రకాల మెనూ కార్డులు ఉంటాయట. ఒకవైపు సరసమైన ధరలకు నోరూరించే వంటకాలను అందిస్తూనే, మరోవైపు ఖరీదైన స్పెషల్ ఐటమ్స్‌ను సర్వ్ చేస్తున్నారు.
‘లగ్జరీని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాం. అదే సమయంలో అందరికీ అందు బాటులో ఉండే వంటకాలను కూడా అందిస్తున్నాం. అందుకే ఇలా రెండు రకాలుగా మెనూ ప్లాన్ చేశాం’ అంటున్నారు కెఫే యజమాని, భారత సంతతికి చెందిన సుచేత శర్మ. ఈ ఖరీదైన కెఫేకు సంబంధించిన మెనూ కార్డు, స్నాక్స్ ఫొటోలను ఒక యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరలయ్యాయి. లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లతో నెట్టింట ‘హాట్’ టాపిక్‌గా మారింది. ‘ఈ టీ తాగడానికి ఈఎంఐ కట్టాలేమో’ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Updated Date - Dec 08 , 2024 | 01:04 PM