‘లెజండరీ’ బామ్మ
ABN, Publish Date - Dec 08 , 2024 | 10:29 AM
ఎనిమిది పదులు పైబడిన వయసులో బామ్మగారికి ఇదేం ఫ్యాషన్ పిచ్చి అనుకుంటున్నారా? పెద్ద పెద్ద గాగుల్స్, కాళ్లకు హైహీల్స్, రంగురంగుల ఆభరణాలు, మోడ్రన్ దుస్తులు ధరించి... తనదైన యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసంతో స్టయిలిష్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది మార్గరెట్ ఛోళా.
ఎనిమిది పదులు పైబడిన వయసులో బామ్మగారికి ఇదేం ఫ్యాషన్ పిచ్చి అనుకుంటున్నారా? పెద్ద పెద్ద గాగుల్స్, కాళ్లకు హైహీల్స్, రంగురంగుల ఆభరణాలు, మోడ్రన్ దుస్తులు ధరించి... తనదైన యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసంతో స్టయిలిష్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది మార్గరెట్ ఛోళా.
సూటు, జీన్‌ప్యాంట్, స్కర్ట్, గౌను వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ఒక చేత్తో రోకలి పట్టుకుని, మరోవైపు పొలంలో సోఫాపై తాపీగా కూర్చొని పోజులిస్తున్న బామ్మను చూసి నెటిజన్లకు నోట మాట రావట్లేదు. సహజత్వం, ఫ్యాషన్ కలగలుపుగా ఉండటమే ఈ బామ్మగారి ఫ్యాన్‌బేస్‌కి కారణం. గతేడాది ‘లెజండరీ గ్లామా’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన మార్గరెట్‌ను లక్ష మందికి పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారంటే ఆవిడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పల్లెటూరి నేపథ్యంలో...
ఇంతకీ... బామ్మగారి మేకోవర్ వెనకున్నదెవరో తెలుసా? తన మనవరాలు, స్టయిలిస్ట్ డయానా కౌంబా. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఈమె తన తండ్రి రెండో వర్థంతి సందర్భంగా జాంబియాలోని నానమ్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలోనో డయానాకు ఓ క్రేజీ ఆలోచన వచ్చిందట. ‘బామ్మ నువ్వు నా బట్టలు వేసుకో? నేను నిన్ను సూపర్‌గా తయారుచేస్తా’ అని అడగ్గానే, ‘సరే కానీ.. నీ సరదా నేనెందుకు కాదంటాను? నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తా’ అని చిరునవ్వుతో అంగీకారం తెలిపింది బామ్మ. ఇంకేం తన దగ్గర ఉన్న మోడ్రన్ దుస్తుల్ని వేసి, ఫంకీ నగలను, కళ్లద్దాలను పెట్టి పల్లెటూరి నేపథ్యంలో విభిన్న ఫొటోలను తీసి ఇన్‌స్టాలో పెట్టింది డయానా.
‘‘మొదటి సారి నెటిజన్లు ఎలా స్పందిస్తారోనని భయపడ్డా. పది నిమిషాల పాటు ఫోన్ జోలికే వెళ్లలేదు. కొద్దిసేపటికి ఫోన్ ఆన్ చేయగానే బామ్మ ఫొటోలకు వెయ్యి లైక్స్ ఉన్నాయి. ‘మీ బామ్మ స్టైల్ సూపర్బ్. తన ఫొటోలు ఇంకొన్ని షేర్ చేయండి’ అంటూ కామెంట్లు. ఆ స్పందన చూసి నాలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రకరకాల హెయిర్ స్టైల్స్, రంగురంగుల దుస్తులు, నగలతో జాంబియా జీవన విధానాన్ని ప్రతిబింబించేలా
మా బామ్మను ముస్తాబు చేసి ‘లెజెండరీ గ్లామా’ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించా. ఏడాదిలోనే ఇంతమంది అభిమానులు సంపాదించు కోవడమంటే మామూలు విషయం కాదు. మా నానమ్మకు ధైర్యం చాలా ఎక్కువ. ఏ లుక్‌లో అయినా అద్భుతంగా కనిపిస్తారు. వయసు పైబడిన వారికే కాదు, యువతకు కూడా మా గ్రానీ రోల్ మోడలే’’ అంటోంది డయానా.
కాస్త వెరైటీగా...
ఫ్యాషన్ దుస్తులు, ట్రెండీ యాక్సెసరీలతో వెరైటీగా తన ఇంటి ముందర, దున్నిన పొలంలో, మామిడి తోటలో, మొక్కజొన్న చేనులో ఫొటోలకు పోజులిస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకోవడం మొదలెట్టిందీ ట్రెండీ బామ్మ. తలపైన పేద్ద టోపీ, హ్యాండ్ బ్యాగ్, రేడియో, రోకలి దంచుతున్నట్లు దిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల జాంబియన్ జెండా రంగు దుస్తులతో తళుక్కుమని మరోసారి తనదైన మార్క్‌ను చూపించింది. ‘ది ఫోర్ట్‌నైట్లీ గ్రానీ’ సిరీస్‌ని ఇటీవలే డయానా ప్రారంభించింది. నలుగురు మనవరాళ్లు తమ గ్రానీలను అందంగా తీర్చిదిద్దే పనిని ఈ స్టైలిష్ బామ్మకు అప్పగిస్తే, ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ఆ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.
చిన్నతనంలోనే కష్టాలు...
గ్రానీ మార్గరెట్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిందట. పన్నెండేళ్ల వయసుకే ఆమెకు రెట్టింపు వయసున్న వ్యక్తితో వివాహం జరిగింది. భర్త మద్యపానానికి బానిస కావడంతో, ఇంటి బాధ్యతలను భుజానికి వేసుకుంది. కొద్దికాలానికే భర్త విడాకులు ఇవ్వడంతో తన ముగ్గురు పిల్లల్ని వెంట బెట్టుకుని వెళ్లి, గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిన్న గుడిసె వేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత తన మనవరాలి పుణ్యమా అని తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కిందని సంబరపడుతోంది. ఏదే మైనా ముదిమి వయసులో ఓ మూలన కూర్చోకుండా, ఫ్యాషన్లతో వినోదాన్ని పంచు తున్న బామ్మగారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
డ్యాన్స్ కూడా...
‘‘మునుపెన్నడూ నేను ఇలాంటి బట్టలు గానీ, విగ్గుగానీ ధరించలేదు. మెల్లమెల్లగా ఆధునిక ప్యాషన్లని అలవర్చుకున్నా. ప్రత్యేకంగా కనిపించడం కోసం గోళ్లు పెంచుకుంటున్నా. డ్యాన్స్ కూడా చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది నన్ను అభిమానించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇదంతా నా మనవరాలి వల్లే’’ అని మురిసిపోతోంది మార్గరెట్.
Updated Date - Dec 08 , 2024 | 10:29 AM