ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టోరీలు చెప్పడానికే స్టీరింగ్ తిప్పారు..

ABN, Publish Date - Oct 27 , 2024 | 08:08 AM

లారీ డ్రైవర్లు దేశమంతా తిరిగినా సరే.. తమ జీవిత కథల్ని మాత్రం ఎక్కడా చెప్పుకోరు. ఎవ్వరూ చెప్పరు. అందుకే రహదారులపై రయ్‌మని వెళుతున్న డ్రైవరన్నలు.. టక్కున స్టీరింగ్‌ తిప్పి యూట్యూబ్‌లోకి దూసుకొచ్చారు. రావడం రావడమే తమ సాదకబాధకాల్ని గట్టిగా హారన్‌ కొట్టి చెప్పడం మొదలెట్టారు. రోడ్‌ జర్నీని లోడ్‌ చేసుకొచ్చి.. యూట్యూబ్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నారు.

లారీ డ్రైవర్లు దేశమంతా తిరిగినా సరే.. తమ జీవిత కథల్ని మాత్రం ఎక్కడా చెప్పుకోరు. ఎవ్వరూ చెప్పరు. అందుకే రహదారులపై రయ్‌మని వెళుతున్న డ్రైవరన్నలు.. టక్కున స్టీరింగ్‌ తిప్పి యూట్యూబ్‌లోకి దూసుకొచ్చారు. రావడం రావడమే తమ సాదకబాధకాల్ని గట్టిగా హారన్‌ కొట్టి చెప్పడం మొదలెట్టారు. రోడ్‌ జర్నీని లోడ్‌ చేసుకొచ్చి.. యూట్యూబ్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నారు. లారీ క్యాబిన్‌నే క్యారవాన్‌గా భావించి.. లోడ్‌ ఎత్తే ప్లేస్‌నే లొకేషన్‌గా ఫీలై.. హీరోలైపోయారు. నెటిజన్లు ఏ ట్రక్కు ఛానల్‌ను ఓపెన్‌ చేసినా సరే.. ట్రాఫిక్‌జామ్‌ అయినంత పనైపోతోంది. వీళ్ల వీడియోలకు అంత రద్దీ పెరిగింది మరి!. తెలుగులో అలాంటి స్మార్ట్‌ ట్రక్కు డ్రైవర్లు నడుపుతున్న ఛానళ్ల గురించే ఈ వారం కవర్‌స్టోరీ..


మన ట్రక్‌ వ్లాగ్స్‌

యూట్యూబ్‌లో లారీ ట్రక్‌లపై వచ్చే వీడియోల్లో ‘మన ట్రక్‌ వ్లాగ్స్‌’ కథే వేరు!. నూనూగు మీసాల కుర్రోడు... నిమ్మల మహేష్‌ ఈ ఛానెల్‌ను 2021లో గట్టిగా హార్న్‌ కొట్టి రోడ్డెక్కించాడు. ఇక, ఆగిందే లేదు. కేవలం మూడంటే మూడేళ్లు.. ఆరొందల పైచిలుకు వీడియోలు తీశాడు. వీటన్నింటినీ ఏకంగా 52 కోట్ల మంది వీక్షించారంటే... ఈ ఛానల్‌కు ఉండే క్రేజ్‌ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నట్లు ఈ ఛానెల్‌కు పదిహేను లక్షల మంది


సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు.

ఈ ట్రక్‌ వ్లాగ్‌ ఎందుకింత పాపులర్‌ అయ్యిందంటే.. డిజిటల్‌ మీడియాలో ఇలాంటి లారీల విశేషాలను చెప్పేవాళ్లు లేకపోవడం.. అందులోనూ సహజమైన కంటెంట్‌ను అందించడం. మహేష్‌కు వృత్తిపట్ల మమకారం కనిపిస్తుంది. అందుకే తన లారీని ప్రేమతో ‘బుజ్జీ..’ అంటూ మనిషితో మాట్లాడినట్లే మాట్లాడుతుంటాడు. యాక్సిడెంట్‌లో లారీకి దెబ్బలు తగిలితే ఆత్మీయుడు గాయాలపాలైనట్లు.. చిన్న పంక్చర్‌ అయితే తన కాలికి ముల్లు గుచ్చుకున్నట్లు విలవిల్లాడతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. లారీ అంటే టన్నులకొద్దీ లవ్వు. ఎంతలా అంటే.. బండిపైన కూడా ‘మన ట్రక్‌ వ్లాగ్‌’ అని రాసుకునేంత! ఇలా తనకూ, వ్లాగ్‌కు ట్రక్‌తోనే వాల్యూ వచ్చిందంటాడాయన. లారీ డ్రైవర్ల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించటంతో పాటు ప్రయాణంలోని కష్టాలను, ఆనందాలను వీక్షకులతో పంచుకుంటాడు. ఇతర రాష్ర్టాలకు వెళ్లేప్పుడు ప్రయాణ విశేషాలనూ.. అక్కడి వస్తువుల లోడింగ్‌.. అన్‌లోడింగ్‌ కబుర్లను చెబుతాడు. తన దగ్గర ఉండే కోతి, శునకాల గురించి అయితే ప్రత్యేక ముచ్చట్లు. అందుకే ఈ కంటెంట్‌ జనానికి కొత్తగా అనిపించింది... యూట్యూబ్‌లో మహేష్‌ లారీ కొత్త లోడ్‌తో ఎప్పుడొస్తుందాని ఎదురుచూస్తారు.


ఇదీ నేపథ్యం..

తెలంగాణలోని యాదాద్రి జిల్లా కోటమర్తి మహేష్‌ సొంతూరు. పేద కుటుంబం. అమ్మా,నాన్న వ్యవసాయ పనులు చేసుకుంటారు. ఇతనికో అన్నయ్య, అక్క ఉన్నారు. ఐదో తరగతి నుంచే కూలీ పనులకు వెళుతూనే చదువుకున్నాడు. పదో తరగతి నుంచి హైదరాబాద్‌లోని సోదరి ఇంట్లో ఉండి ఇంటర్‌ పూర్తి చేశాడు. అది కూడా డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ!. ఎంత పని చేసినా డబ్బులు రాకపోవటంతో.. చదువు ఆపేసి చికెన్‌ కొట్టులో పని చేశాడు. అయినా డబ్బులు సరిపోక మిత్రుడి సలహాతో ముంబైకి వెళ్లాడు. డెలివరీ బాయ్‌గా, కార్లు, హోటళ్లలో గ్లాసుల్ని శుభ్రం చేసే వాడిగా చేయని పనిలేదు. ఎక్కడికెళ్లినా ‘అమ్మను బాగా చూసుకోవాలి.. డబ్బు సంపాదించాలి’ అన్నదే అతని లక్ష్యం. తినే ఆహారం పడక అనారోగ్యానికి గురవ్వడంతో.. హైదరాబాద్‌ వచ్చాడు. తన బావ సహకారంతో కారు డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనికి కుదిరాడు.


వ్లాగ్స్‌ చేయాలనే ఆలోచన..

బావ లారీ డ్రైవర్‌. వృత్తిలో ఆయన పడే అగచాట్లను కళ్లారా చూశాడు. ‘‘ఛీ ఛీ ఏం జీవితం? లారీ డ్రైవర్లకు కాణీ విలువ లేదు..’’ అంటూ తన బావ చెప్పే బాధల్ని విన్నాడు మహేష్‌. అప్పుడొచ్చిందీ ఐడియా. లారీ కష్టాలనే వీడియోలుగా తీయాలని!. యూట్యూబ్‌లో ఛానల్‌ పెట్టాడు. తొలి సంపాదన పదిహేను వేలు. రోడ్డు మీద దొరికిన కుక్క, కోతిని పెంచుకున్నాడు. వాటితోనూ వ్లాగ్స్‌ చేశాడు. ఈ వీడియోలు చూసి అటవీ అధికారులు ఆ కోతిని తీసుకెళ్లి జూలో వదిలేశారు. ‘మిస్‌ యూ ధీర’ అని లారీలో తన సీట్‌ వెనకాల ఫొటో వేసుకున్నాడు మహేష్‌. మూగ జీవాలనే కాదు.. సాటి మనుషులనూ ప్రేమించే గుణం ఉందతనికి. అందుకే పేదవారికి సాయం చేయటానికి ‘మన ఫౌండేషన్‌’ ప్రారంభించడం విశేషం. తినటానికి తిండి లేని స్థితి నుంచి లారీ ఓనర్‌ అయ్యే వరకూ సాగిన అతని ప్రయాణం.. యువతకు స్ఫూర్తిదాయకం.


తెలుగు ట్రక్‌ వ్లాగ్స్‌ హరీష్‌

బీటెక్‌ కుర్రోడు లారీ డ్రైవర్‌ అయ్యాడు. పేరు హరీష్‌. కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన ఇతను బ్యాంకింగ్‌ రంగంలో పని చేశాడు. కెనడాలో స్థిరపడిన ఓ ఉత్తర భారతీయుడి ట్రక్‌ వ్లాగ్స్‌ చూసేవాడట. తను కూడా అలా చేయాలన్న ఆలోచన వచ్చింది. హరీష్‌ నాన్న లారీ యజమాని. దాంతో అలా బీజం పడింది ఈ ట్రక్‌ వాగ్స్‌కు. వాస్తవానికి 2011లోనే లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న ఇతను.. ఎక్స్‌ప్లోర్‌ కోసం వీడియోలు చేయాలనుకున్నాడు. అయితే తండ్రి అంగీకరించలేదు. ‘ఇంత చదువు చదివి.. లారీ డ్రైవర్‌ కావడమేంటి?’ అంటూ తిట్టిపోశాడు. అయినా పట్టించుకోలేదు హరీష్‌. వ్లాగ్స్‌ చేస్తూ నెలకు రూ.70 వేలు సంపాదించేవాడు. ఒక రోజు తండ్రితో లారీలో ప్రయాణించేప్పుడు గేర్‌ బాక్స్‌ పాడైంది. ఆయన వద్ద ఇరవై వేల రూపాయలే ఉన్నాయి. పైగా లారీకి తీసుకున్న రుణం కిస్తీలు ఇంకా అయిపోలేదు. ఇవన్నీ తెలుసు కాబట్టి హరీష్‌ దగ్గర్లో ఉండే షోరూమ్‌కు వెళ్లి తన యూట్యూబ్‌ పైసలిచ్చి గేర్‌ బాక్స్‌ తీసుకొచ్చాడు. తండ్రితో విషయం చెప్పాడు. ‘‘నాన్నా.. చూశావుగా. మనలాగ డ్రైవర్లు పడే కష్టాలను యూట్యూబ్‌లో చూపించాలన్నదే అందుకే..’’ అంటూ తండ్రిని ఒప్పించాడు.


హరీష్‌ లారీ నడుపుతుంటే.. ఆయన తండ్రి ఫోన్‌లో వీడియోలు తీసేవాడు. ‘ట్రిప్‌లో ఉండేప్పుడు మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం’ అంటాడు హరీష్‌. మొన్నా మధ్య యూట్యూబ్‌లో ఏదో సమస్య రావడంతో.. ఛానెల్‌ సస్పెండ్‌ అయింది. రెండున్నర సంవత్సరాల కష్టం.. లక్షన్నర మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉండేవారు. చిన్న పొరపాటు చేయటం వల్ల ‘తెలుగు ట్రక్‌ వ్లాగ్స్‌’ ఛానెల్‌ను తొలగించింది యూట్యూబ్‌. దీంతో హరీష్‌ చేసేదేమీ లేక మరో ఛానెల్‌ ప్రారంభించాడు. ‘తెలుగు ట్రక్‌ వ్లాగ్స్‌ హరీష్‌’ అనేది దాని పేరు. ఎనభై వేల మందికి పైగా సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారిప్పుడు. ఈ ఛానెల్‌లో దారంటా కష్టాలను, వండుకునే వంటల్ని, కొత్త వాహనాలను చూపిస్తుంటాడు.

మొత్తానికి తండ్రి, కొడుకు, ఒక లారీ కథే.. ఈ వ్లాగ్‌!.

నా ట్రక్‌ నా బలం

‘తెలుగు ట్రక్‌ ట్రావెలర్‌’ వ్లాగర్‌ పేరు దొడ్ల జగన్‌. వోల్వో ట్రక్‌కు డ్రైవర్‌. హెవీ లోడ్స్‌ను తీసుకెళ్తుంటాడు. ‘నా ట్రక్‌ నా బలం’ అంటూ ఇన్‌స్టాలో ట్రక్‌ మీద తన ప్రేమను చాటుకున్నాడు. అందమైన లొకేషన్స్‌, ట్రక్‌ డ్రైవర్ల కష్టాలు, కొత్త ఆలోచనలతో వీడియోలు చేయటమే ఇతని బలం. అన్నట్లు ఈ ట్రక్‌ ఇతనిదే. ఇటీవలే బాలాపూర్‌ గణేష్‌ను మోసిందీ తన ట్రక్కేనట.


యూట్యూబ్‌లో ఆసక్తిరేకెత్తించే థంబ్‌నెయిల్స్‌ను పెట్టడంలో ఘనాపాఠి ఇతను. ట్రక్‌ మీద ‘తెలుగు ట్రక్‌ ట్రావెలర్‌’ అని రాయించుకున్నాడు. కశ్మీర్‌ మంచు కొండల్లో ఛాయ్‌ చేసుకుని తాగటం.., రోడ్డు మీద క్యాంప్‌ వేయటం.., స్వయంగా వంట వండుకోవటం.. దొంగల బెడద నుంచి తప్పించుకోవడం వంటి విషయాలు.., రోడ్డు టాక్స్‌ పేరుతో బాదుళ్ల గురించి చక్కగా చెబుతాడీ వ్లాగర్‌. ఉత్తరాది అమ్మాయితో కలసి ఓ వ్లాగ్‌ చేయటం ఇతని వీడియోల్లో హైలెట్‌. ఇద్దరు సబ్‌స్క్రయిబర్లతో అది కూడా అమ్మాయిలతో తన ట్రక్‌ను నడిపించాడు. ఇదీ ట్రక్‌ వ్లాగర్‌ జగన్‌ ఘనత. అందుకే ట్రక్‌ వ్లాగర్స్‌లో ఇతని స్టయిలే వేరు. ఈ వీడియోలకు ఫ్యాన్‌బేస్‌ బావుంది. 449 వీడియోలను అప్‌లోడ్‌ చేశాడు. ఏడు లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 2021 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఛానల్‌ను 21 కోట్ల మంది వీక్షించారు.


విజయవాడ ట్రక్‌ వ్లాగ్‌

క్లీనర్‌ నుంచి లారీ డ్రైవర్‌ అయ్యాడు. డ్రైవర్‌ ఓనరయ్యాడు. కరీంగనగర్‌ జిల్లాలోని చౌటిపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ కేవలం మూడువేల రూపాయల జీతం కోసం క్లీనర్‌గా ఉద్యోగంలో చేరాడు. డ్రైవర్‌ ఊరు వెళ్లినపుడు లారీని నడపడం నేర్చుకునేవాడు. ఆ తర్వాత డ్రైవర్‌కు ఈ విషయం తెలిసి బండి నడపమన్నాడు. అలా డ్రైవర్‌ అయ్యాడు. ఇతను విజయవాడకి మకాం మారిన తర్వాత ఆయన ఓనర్‌ ‘నా చిన్న బండి అమ్ముతున్నా. నువ్వు ఎన్నాళ్లని డ్రైవర్‌గా ఉంటావు? నాలాగ ఓనర్‌ అవ్వు. నేను అండగా ఉంటా’ అన్నాడు. అలా లారీ ఓనర్‌గా తన జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత లారీ వ్లాగ్స్‌ చేయటం మొదలెట్టాడు.


లారీడ్రైవర్‌ జీవితాన్ని సహజంగా తెరకెక్కించాడు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు లక్నో, ఉత్తరప్రదేశ్‌, ఆగ్రా, ఢిల్లీ, భువనేశ్వర్‌, ఉత్తరాఖండ్‌ ప్రాంతాలకు తిరుగుతూ వీడియోలను అప్‌లోడ్‌ చేశాడు. పాత లారీ అమ్మి కొత్త లారీ కొన్నాడు. డ్రైవర్‌గా, ఓనర్‌గా జీవితం బావుందంటాడు రమేష్‌. 2022 సంవత్సరంలో ఈ వ్లాగ్‌ను ప్రారంభించాడు. 102 వీడియోలుండే ‘విజయవాడ ట్రక్‌ వ్లాగ్‌’కు లక్షకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.


లడ్డు ట్రక్‌ వ్లాగ్స్‌

యూట్యూబ్‌ లోగోతో కనిపించే లారీ నడిపే ఈయన ‘‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’’ అంటాడు. 193 వీడియోలు, 40 వేల సబ్‌స్క్రయిబర్లు ఉన్న ఈ లడ్డు ట్రక్‌ వ్లాగ్స్‌ 2015 సంవత్సరం నుంచే హల్‌చల్‌ చేస్తోంది. అంటే తెలుగులో తొలి ట్రక్‌ వ్లాగ్స్‌ ఛానెల్‌ అన్నమాట! ‘ప్రపంచాన్ని నడిపించేది డ్రైవర్‌. అదే డ్రైవర్‌ లేకపోతే తినే తిండి, బట్ట, ఏ వస్తువులూ మీ ఇంటికి రావు. అలాంటి డ్రైవరన్నను చిన్నచూపు చూడొద్దు. డ్రైవర్‌లకు కాస్త గౌరవం ఇవ్వండి’ అంటారు లారీ డ్రైవర్‌ లడ్డు.


లడ్డుకు రెండు లారీలున్నాయి. రెండు ఈఎమ్‌ఐలు కడుతున్నాడు. వీడియో హ్యాక్‌ అయినా, వ్యక్తిగతంగా కష్టాలు పడినా ట్రక్‌ వ్లాగ్స్‌ మాత్రం ఆపడు. లారీల సమస్యలతో పాటు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వీడియోలను ఎక్కువగా చూపిస్తాడు. ఘాట్‌ రోడ్‌ మలుపులు, రోడ్డు ప్రయాణాలు, దొంగలతో పడే ఇబ్బందులు.. లాంటి విషయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. తన జీవితాన్ని మధ్య మధ్యలో చెబుతుంటాడు. ఎన్ని సమస్యలొచ్చినా ఆగని లారీ డ్రైవర్‌ ఈ లడ్డు!.


కిట్టు ట్రక్‌ వ్లాగ్స్‌

ఈ వ్లాగ్‌ను బాలు కిట్టు నడుపుతున్నాడు. ట్రక్‌కు ఆయన పెట్టిన ముద్దు పేరు ‘టార్జాన్‌’. ట్రక్‌ సర్వీసు, కొత్త ప్రదేశాలకు లోడింగ్‌ కోసం వెళ్లినప్పుడు.. ఇలా ప్రతి దృశ్యాన్నీ చిత్రీకరించడం కిట్టుకు అలవాటు. ఇటీవలే తన ట్రక్‌కు సీసీ కెమెరాను సైతం అమర్చాడు. ట్రక్‌ మీద అంత ప్రేమ ఇతనికి!.

‘‘సరిగ్గా తినటానికి, నిద్రపోవటానికే సమయం ఉండదు. అందుకే నేను తక్కువ వీడియోలు పెడుతుంటాను. జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి అందమైన ప్రదేశాలు తిరిగినప్పుడు జ్ఞాపకాలుగా మిగలడం కోసం.. వీడియోలు చేస్తుంటా. నేను ఎవరితోనూ సన్నిహితంగా ఉండను. నా పని నేను చూసుకుంటా. నాలో నేను ఒంటరిగా ఉండటమే నాకిష్టం’ అంటాడు కిట్టు. ఈ వ్లాగర్‌ మొదట యూట్యూబ్‌లో బైక్‌ రైడ్స్‌ అప్‌లోడ్‌ చేసేవాడు. ఆ తర్వాత ఐషర్‌ లారీ, ఆ తర్వాత పెద్ద లారీని నడిపాడు. ఇప్పుడు భారత్‌ బెంజ్‌ ట్రక్‌ నడుపుతున్నాడు. దీనికి యజమాని కూడా కిట్టునే. ‘సోల్‌ఫుల్‌ మ్యూజిక్స్‌తో ఇన్‌స్టా రీల్స్‌ చేయటం.. తన జీవితాన్ని చూపించే కంటెంట్‌తో వ్లాగ్స్‌లో చూపించటంలో ఇతని తీరు విభిన్నం. డ్రైవింగ్‌ తన ప్యాషన్‌, ఎమోషన్‌ అని చెబుతుంటాడు ఈ ఇరవై ఆరేళ్ల కుర్రోడు. ఇలా చాలామంది డ్రైవరన్నలు ఒక వైపు స్టీరింగ్‌ తిప్పుతూనే.. మరోవైపు స్టోరీలు వినిపిస్తూ.. స్మార్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మిగిలిన ఏ రంగాలకూ తాము తీసిపోమని దూసుకెళుతున్నారు.

- రాళ్లపల్లి రాజావలి


ఒకప్పుడు లారీ డ్రైవర్లు అంటే చదువులేని వాళ్లు, మొరటోళ్లు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు కాలం మారింది. ఈ వృత్తిలోకి పట్టభద్రులు, సాంకేతిక అభిరుచి ఉన్న వాళ్లు వస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడున్న చాలామంది యువ డ్రైవర్లు ఎంతో స్మార్ట్‌. వృత్తి ద్వారా లారీల లోడింగ్‌, అన్‌లోడింగ్‌లతోనే కాదు.. యూట్యూబ్‌ ద్వారా కూడా సంపాదిస్తున్నారిప్పుడు. నాచురల్‌ కంటెంటే వీరి బలం. నిత్యం కొత్త ప్రదేశాలను, కొత్త వ్యక్తులను చూపించటం వల్ల.. ఈ వీడియోలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కమాటలో లారీ డ్రైవర్‌ అంటే సామాన్యుడు. మనలోని వ్యక్తి. పల్లెల్లోని నెటిజన్లు ఎక్కువగా డ్రైవర్ల వీడియోలను తిలకిస్తున్నారు. అందుకే ట్రక్‌ వ్లాగర్స్‌కి ప్రత్యేక అభిమానులు కూడా ఏర్పడ్డారు. గిరిధర్‌ అనే లారీ డ్రైవర్‌ ‘లారీ వాలా’ ఛానెల్‌ నడుపుతున్నాడు. అలానే ‘భద్రాద్రి ట్రక్‌ వ్లాగ్స్‌’, ‘ఎల్‌సీవీ ట్రక్‌ వ్లాగ్స్‌’, ‘సిఎస్‌ఆర్‌ ట్రక్‌ వ్లాగ్స్‌’, ‘హని ట్రక్‌ వ్లాగ్‌’, ‘ఎఆర్‌ వెహికల్స్‌’.. లాంటి ట్రక్‌వ్లాగ్స్‌ జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇంకొన్నాళ్లుపోతే లారీలు, ట్రక్‌ ఛానళ్లతో యూట్యూబ్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందేమో చూడాలి.

Updated Date - Oct 27 , 2024 | 08:08 AM