నిజంగానే ‘చాక్లెట్’బాయ్
ABN, Publish Date - Nov 17 , 2024 | 07:34 AM
అమరి గుయిచన్... చూడటానికి చాక్లెట్‌బాయ్‌లా కనిపిస్తాడు. అయితే నిజంగానే అతడో ‘చాక్లెట్’బాయ్. గుయిచన్ చాక్లెట్ తయారీకి దిగాడంటే మామూలుగా ఉండదు. అది తప్పకుండా ఓ కళాఖండమే అవుతుంది. ఇటీవలే ఈ ‘పేస్ట్రీ చెఫ్’ ప్రపంచంలోనే అతి పెద్ద బనానా చాక్లెట్ తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
అమరి గుయిచన్... చూడటానికి చాక్లెట్‌బాయ్‌లా కనిపిస్తాడు. అయితే నిజంగానే అతడో ‘చాక్లెట్’బాయ్. గుయిచన్ చాక్లెట్ తయారీకి దిగాడంటే మామూలుగా ఉండదు. అది తప్పకుండా ఓ కళాఖండమే అవుతుంది. ఇటీవలే ఈ ‘పేస్ట్రీ చెఫ్’ ప్రపంచంలోనే అతి పెద్ద బనానా చాక్లెట్ తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
చాక్లెట్స్ రుచి భిన్నంగా ఉన్నా, అన్నీ కూడా చదరంగానో, గుండ్రంగానో ఉంటాయి. చాక్లెట్ తయారీలో అమరి గుయిచన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పులి, సింహం, ఐఫిల్ టవర్, యాపిల్, పాము, డ్రాగన్, క్యారెట్, అరటిపండు.. ఇలా వివిధ ఆకృతుల్లో చాక్లెట్స్ తయారుచేసి ఆకట్టుకుంటాడు.
అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడు ఇటీవలే లాస్ వెగాస్‌లోని తన ‘పేస్ట్రీ అకాడమీ’లో 66 అంగుళాల పొడవు, 29.57 అంగుళాల వెడల్పున్న ‘బనానా చాక్లెట్’ను తయారు చేశాడు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ ఆకృతి ఇదేన’ని గుర్తించి ‘గిన్నిస్ రికార్డు’ సర్టిఫికెట్‌ను అతడికి అందించారు. ‘‘చాక్లెట్ తయారు చేసేప్పుడు ఘన, ద్రవ పదార్థాలను ఒకే ఉష్ణోగ్రతలో ఉంచటం అతి పెద్ద సవాల్. వాటితో శిల్పాలు చేసేప్పుడు నేను ఈ సవాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటా. నా కెరీర్‌లో బనానా చాక్లెట్ ప్రాజెక్ట్ మర్చిపోలేనిది. ఈ కళకు ఉన్న సరిహద్దు లను దాటి నేను దీన్ని తయారుచేశాను. దానికి అరుదైన గుర్తింపు దక్కడం నా అదృష్టం’’ అంటున్నాడు గుయిచన్.
బాల్యం నుంచే..
గుయిచన్ తల్లి స్విట్జర్లాండ్, తండ్రి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతంలో పెరిగాడు. ఇతనికో అన్న, తమ్ముడు ఉన్నారు. చాక్లెట్లకు స్వర్గధామం అయిన యూరోపియన్ బెల్ట్‌కు చెందిన వ్యక్తి కాబట్టి స్వతహాగానే చిన్నప్పటి నుంచి చాక్లెట్లను ఇష్టపడేవాడు. తాను కూడా చాక్లెట్ తయారు చేయాలనే ఆలోచన అతడికి పధ్నాలుగేళ్ల వయసులో పుట్టింది. జెనీవాలోని ‘ఓల్ఫిస్‌బర్గ్ బేకరీ’లో చేరి, పేస్ట్రీ మేకింగ్‌లో మెళకువలు నేర్చుకన్నాడు.
2005లో తూర్పు ఫ్రాన్స్‌లో కలినరీ ఆర్ట్‌లో చేరాడు. రెండున్నరేళ్ల డిప్లొమా శిక్షణలో అడ్వాన్స్ మేకింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. ఆ అనుభవంతో బొమ్మల రూపంలో చాక్లెట్లను తయారు చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత పారిస్‌లో ‘లెనొట్రే కలినరీ ఆర్ట్ స్కూల్’లో పేస్ట్రీ మేకింగ్ టీచర్‌గా, మేనేజర్‌గా బాధ్యతలూ తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన అనేక చాక్లెట్ మేకింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాడు. జాతీయ స్థాయిలో జరిగే టీవీ కాంటెస్ట్‌లో చెఫ్‌గా ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.
వీడియోలతో క్రేజ్...
అమెరికాలోని ‘జీన్ ఫిలిప్ పేస్ట్రీ’ పేరున్న కంపెనీ. ఫ్రెంచ్ టీవీ షోలో అతడి ప్రతిభను చూసి తమ దగ్గర పని చేయాలని ఆహ్వానించింది. దాంతో అమరి గుయిచన్ ఆనందంగా లాస్ వెగాస్‌లో వాలాడు. అక్కడ అతడికి చాక్లెట్‌తో సృజనాత్మక రూపాలు తయారుచేసే అవకాశం దక్కింది. కొత్త ఆకృతులను చేయటంతో పాటు ఆర్ అండ్ డీలో పని చేశాడు. 2016లో వివిధ చాక్లెట్ కళాకృతులను వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో సంస్థకూ, అతడికి మంచి పేరొచ్చింది. ఆ వీడియోలకు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రయిబర్లు, కోట్ల వీక్షణలు వచ్చాయి. దాంతో ఈ చాక్లెట్ చెఫ్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అక్కడి నుంచి కెరీర్‌లో గుయిచన్ వెనక్కి తిరిగిచూసుకోలేదు.
తనే సొంతంగా ఓ సంస్థను నెలకొల్పాడు. చాక్లెట్ తయారీలో తనలా ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను తయారు చేయాలనుకున్నాడు. ‘పేస్ట్రీ అకాడమీ’ని నెలకొల్పి మొదట రష్యన్లకు ఈ కళను నేర్పించాడు. ఆ తర్వాత వివిధ దేశాలు తిరిగి ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను దగ్గరగా చూస్తూ, విభిన్న ఆకృతుల్లో చాక్లెట్లను రూపొందించాడు. లండన్, గ్రీస్, ఇటలీ, ఉక్రెయిన్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, తైవాన్, మెక్సికో, మెల్‌బోర్న్ తదితర దేశాల్లో తరగతులు నిర్వహించి ఎంతోమందికి ‘పేస్ట్రీ, చాక్లెట్ మేకింగ్’లో టెక్నిక్స్ నేర్పించాడు. అనతికాలంలోనే స్టార్ చెఫ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన కళతో అనేక రికార్డులు సృష్టించాడు. తాజాగా అతి పెద్ద బనానా చాక్లెట్‌ను తయారుచేసి, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
పర్సనల్ టచ్
- చిన్నప్పటి నుంచి ‘చాక్లెట్‌బాయ్’ అని పిలిచేవారట.
ఫ ఖాళీగా ఉంటే తన ప్రేయసితో రెస్టారెంట్స్‌కు వెళ్తాడు.
- పంతొమ్మిదేళ్ల కెరీర్‌లో ఈ రంగంలో ఎన్నో అపజయాలు చూశాడు. అయితే అనుభవంతో ‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్’గా కనిపించే టెక్నిక్స్ కనుక్కున్నాడు.
- ‘ది ఆర్ట్ ఆఫ్ ఫ్లేవర్’ అనే పుస్తకం రాశారు. తన సిగ్నేచర్ డెజర్ట్స్ ఇందులో ఉంటాయి.
Updated Date - Nov 17 , 2024 | 07:35 AM