VandeBharat: ‘వందేభారత్’ మీల్స్‌లో బొద్దింక.. క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:02 PM
వందేభారత్ రైల్లో ప్రయాణికులకు సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక ఉండటం కలకలానికి దారితీసింది. ఈ ఉదంతానికి సంబంధించి బాధితులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అత్యాధునిక ‘వందేభారత్’ రైళ్లల్లోనూ ప్రయాణికులు మునుపటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వందేభారత్ లో భారీ రద్దీ నెలకొన్న వీడియో వైరల్ గా (Viral) మారింది. తాజాగా రైల్లో సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక ఉండటం కలకలానికి దారి తీసింది. బాధితులు నెట్టింట ఈ విషయాన్ని పంచుకోవడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Viral: యువతి దారుణం.. రీల్స్ కోసం పసిపాపతో చెలగాటం!
తమ బంధువుల వందేభారత్‌లో ఎదుర్కొన్న అనుభవాన్ని వివరిస్తూ విదిత్ వర్షనే అనే నెటిజన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రైల్లో వారికి సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక కనిపించిందని చెప్పుకొచ్చారు.
‘‘ఈ నెల 18న మా అంకుల్, ఆంటీ భోపాల్ నుంచి ఆగ్రాకు వందేభారత్‌లో వెళ్లారు. అయితే, రైల్లో వారికి సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది. ఈ ఫుడ్‌ను సరఫరా చేసిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్, రైల్వే సేవ, రైల్వే మంత్రిత్వ శాఖలను తన పోస్టులో ట్యాగ్ చేశారు. ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్ కావడంతో ఇప్పటివరకూ 69 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి (Vande Bharat passengers find cockroach in food Railways reacts).
ఈ పోస్టుపై రెండు రోజుల తరువాత ఐఆర్‌సీటీసీ స్పందించింది. బాధితులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా, ఈ ఫుడ్ సరఫరా చేసిన వారిపై తగు జరిమానా విధిస్తామని పేర్కొంది. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. ఫుడ్ తయారీ, రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు వెల్లడించింది. ఘటనపై రైల్ సేవా కూడా స్పందిస్తు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
భారతీయ రైళ్లల్లో సరఫరా చేసే ఆహారంలో నాణ్యతాలోపంపై గతంలోనూ పలు ఉదంతాలు నెట్టింట వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో రేవా వందేభారత్‌లో ప్రయాణించిన ఓ వ్యక్తి తనకు ఇచ్చిన ఆహారంలో చచ్చిన బొద్దింక ఉందని నెట్టింట ఫిర్యాదు చేశాడు. జనవరిలో న్యూఢిల్లీ నుంచి వారణాసి విమానంలో కూడా దాదాపు ఇదే తరహా ఘటన బయటపడింది. తనకు, తోటి ప్రయాణికులకు దుర్వాసన వస్తున్న ఆహారాన్ని సరఫరా చేశారంటూ ఓ ప్రయాణికుడు నెట్టిం ఫిర్యాదు చేశారు.
Updated Date - Jun 20 , 2024 | 04:03 PM