Viral: ట్రాఫిక్ రద్దీ.. ఉబెర్‌కు బదులు హెలికాఫ్టర్‌లో మహిళ ప్రయాణం! చివరకు..
ABN, Publish Date - Jun 20 , 2024 | 09:47 PM
ప్రయాణ సమయం తగ్గించుకునేందుకు ఓ మహిళ ఊబెర్ క్యాబ్ కాదనుకుని హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఆమె చేసింది సబబేనని కొందరు అంటే మరికొందరు మాత్రం పర్యావరణానికి హాని తలపెట్టిందని తిట్టిపోశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణ సమయం తగ్గించుకునేందుకు ఓ మహిళ ఉబెర్ క్యాబ్ కాదనుకుని హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఉబెర్, హెలికాఫ్టర్ జర్నీల మధ్య ఖర్చు వ్యత్యాసాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఆమె చేసింది సబబేనని కొందరు అంటే మరికొందరు మాత్రం పర్యావరణానికి హాని తలపెట్టిందని తిట్టిపోశారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో (Trending) ఉంది.
Viral: లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం కొత్త రూల్.. సంస్థ సీఈఓకు ఊహించని షాక్!
పూర్తి వివరాల్లోకి వెళితే, ఖుషీ సూరీ అనే మహిళ క్లీనర్ పర్కిన్స్‌లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఓ రోజు మాన్‌హట్టన్ నుంచి క్వీన్స్ లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు క్యా్బ్ బుక్ చేసుకోవాలనుకుంది. అయితే, ఊబెర్ క్యాబ్‌లో వెళ్లేందుకు ప్రయాణ సమయం గంట అని, ఖర్చు రూ.11 వేలు అని ( మన కరెన్సీలో చెప్పుకోవాలటే..) యాప్‌లో కనిపించింది. మరోవైపు హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే గమ్యస్థానికి చేరుకోవచ్చని ఆమె గుర్తించింది. ఇందుకు సుమారు. రూ.13 వేల ఖర్చు అవుతుంది. దీంతో, ఆమె మరో ఆలోచన లేకుండా హెలికాఫ్టర్‌ను ఎంచుకుంది. చివరకు, ఆమె ఈ వివరాలను తెలుపుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది (Woman In New York Ditches Uber And Travels By Helicopter Instead ).
ఈ ఉదంతం ఆసక్తికరంగా ఉండటంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. 40 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఆమెను మెచ్చుకున్నారు. సమయం ఆదా అవడంతో పాటు హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన అనుభూతి ఆమెకు మిగిలిందని కామెంట్ చేశారు. రెండిటి మధ్య ధరల్లో పెద్ద తేడా లేనప్పుడు ఇలా చేయడం సబబేనని కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఆమె తీరును విమర్శించారు. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు వెదజల్లే హెలికాఫ్టర్‌ను సామాన్యులు కూడా కొద్ది పాటి దూరాలు ప్రయాణించేందుకు వినియోగించడం దారుణమని కొందరు విమర్శించారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.
Updated Date - Jun 20 , 2024 | 10:07 PM