అహో.. అభిషేక్
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:22 AM
ఒక్క రోజులోనే ఎంత తేడా! భారత ఆటగాళ్లంతా కలిసి వంద పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన చోటే.. రోజైనా గడవక ముందే ఒక్కడే శతకంతో చెలరేగాడు. ఎక్కడ తడబడ్డారో, అదే పిచ్‌పై మనోళ్లు రికార్డుల మోత మోగించారు. అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) తన రెండో మ్యాచ్‌లోనే
రెండో టీ20లో భారత్ ఘనవిజయం
జింబాబ్వే చిత్తు
జింబాబ్వేపై అధిక స్కోరు (234/2) సాధించిన జట్టుగా భారత్. ఆస్ట్రేలియా (229/2)ను అధిగమించింది.
అంతర్జాతీయ టీ20ల్లో చివరి పది ఓవర్లలో అత్యధిక పరుగులు (160) సాధించిన జట్టుగా భారత్.
హరారే: ఒక్క రోజులోనే ఎంత తేడా! భారత ఆటగాళ్లంతా కలిసి వంద పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన చోటే.. రోజైనా గడవక ముందే ఒక్కడే శతకంతో చెలరేగాడు. ఎక్కడ తడబడ్డారో, అదే పిచ్‌పై మనోళ్లు రికార్డుల మోత మోగించారు. అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) తన రెండో మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో అదుర్స్ అనిపించుకున్నాడు. ఇక భారీ ఛేదనలో జింబాబ్వేను భారత బౌలర్లు ఆటాడుకున్నారు. దీంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్ ఈనెల 10న జరుగుతుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల స్కోరు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 నాటౌట్), రింకూ సింగ్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) అజేయ ఆటతీరుతో చివర్లో జోరును ప్రదర్శించారు. ఆ తర్వాత కష్టసాధ్యమైన ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. భారీ ఛేదనలో వేగంగా ఆడాలనే తాపత్రయంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. టాపార్డర్‌లో ఓపెనర్ మధెవెరె (43), బెన్నెట్ (26) రాణించగా మిడిలార్డర్ కుప్పకూలింది. ఆఖర్లో జోంగ్వే (33) జోరు చూపి ఓటమితేడాను తగ్గించగలిగాడు. అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లకు మూడేసి వికెట్లు దక్కగా.. రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు.
అభిషేక్-రుతురాజ్ దూకుడు: బ్యాటింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై భారత్ ఆరంభం కష్టంగానే సాగింది. కెప్టెన్ గిల్ (2) రెండో ఓవర్‌లోనే వెనుదిరగగా.. పవర్‌ప్లేలో జట్టు చేసింది 36 పరుగులే. అభిషేక్ శర్మ ఆచితూచి ఆడగా.. రుతురాజ్ తొలి 15 బంతుల్లో 9 పరుగులే చేశాడు. తొలుత ఓపిక ప్రదర్శించిన ఈ జోడీ కుదురుకున్నాక బౌలర్లకు చుక్కలు చూపించింది. అభిషేక్ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు వెల్లింగ్టన్ క్యాచ్‌ను వదిలేయడం కూడా లాభించింది. 8వ ఓవర్‌లో అభిషేక్ 4,6తో పరుగుల వేట ఆరంభమైంది. తర్వాతి ఓవర్‌లోనే రుతురాజ్ 2 ఫోర్లు సాధించగా, 11వ ఓవర్‌లో శర్మ 4,6,4,6,4తో 28రన్స్‌తో స్కోరును వంద దాటించాడు. అంతేకాకుండా 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో అభిషేక్ 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే మసకద్జకు చిక్కాడు. శర్మ తన చివరి 16 బంతుల్లోనే 59 రన్స్ రాబట్టాడు. రెండో వికెట్‌కు అభిషేక్, రుతురాజ్ జోడీ 137 రన్స్ జోడించింది. అటు రుతురాజ్ 38 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే 18వ ఓవర్‌లో రుతురాజ్ 4,6,4,4తో 20 రన్స్ వచ్చాయి. రింకూ సైతం ఇదే జోరుతో 19వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఆఖరి ఓవర్‌లో 4,6,6తో అదిరే ఫినిషింగ్ ఇచ్చాడు. వీరి మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 87 రన్స్ సమకూరాయి. ఓవరాల్‌గా ఆఖరి 10 ఓవర్లలోనే భారత్ 160 రన్స్ రాబట్టింది.
ఈ ఏడాది అభిషేక్ బాదిన టీ20 సిక్సర్ల సంఖ్య. రోహిత్ (46)ను దాటాడు.
జింబాబ్వేపై ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (137) నమోదు చేసిన అభిషేక్ -రుతురాజ్ జోడీ.
టీ20ల్లో వేగవంతమైన శతకం (46 బంతుల్లో) చేసిన మూడో భారత బ్యాటర్‌గా రాహుల్‌తో సమంగా నిలిచిన అభిషేక్. రోహిత్ (35), సూర్య (45) టాప్‌లో ఉన్నారు.
భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్ (2)లోనే టీ20 శతకం సాధించిన బ్యాటర్‌గా అభిషేక్. అలాగే జింబాబ్వేపై భారత బ్యాటర్‌కిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
స్కోరుబోర్డు
భారత్: గిల్ (సి) బెన్నెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ (సి) మైర్స్ (బి) మసకద్జ 100; రుతురాజ్ (నాటౌట్) 77; రింకూ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 234/2. వికెట్ల పతనం: 1-10, 2-147. బౌలింగ్: బెన్నెట్ 2-0-22-0; ముజరబాని 4-1-30-1; చటార 4-0-38-0; రజా 3-0-34-0; జోంగ్వే 4-0-53-0; మైర్స్ 1-0-28-0; మసకద్జ 2-0-29-1.
జింబాబ్వే: ఇన్నోసెంట్ (బి) ముకేశ్ 4; మధెవెరె (బి) బిష్ణోయ్ 43; బెన్నెట్ (బి) ముకేశ్ 26; మైర్స్ (సి) రింకూ (బి) అవేశ్ 0; రజా (సి) జురెల్ (బి) అవేశ్ 4; క్యాంప్‌బెల్ (సి) బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదండె (ఎల్బీ) బిష్ణోయ్ 0; మసకద్జ (రనౌట్) 1; జోంగ్వే (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ 2; చటార (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.4 ఓవర్లలో 134 ఆలౌట్. వికెట్ల పతనం: 1-4, 2-40, 3-41, 4-46, 5-72, 6-73, 7-76, 8-117, 9-123, 10-134. బౌలింగ్: ముకేశ్ 3.4-0-37-3; అభిషేక్ 3-0-36-0; అవేశ్ 3-0-15-3; రవి బిష్ణోయ్ 4-0-11-2; సుందర్ 4-0-28-1; పరాగ్ 1-0-5-0.
Updated Date - Jul 08 , 2024 | 06:22 AM