T20 World Cup Group A : కెనడా సంచలనం
ABN, Publish Date - Jun 08 , 2024 | 06:00 AM
టీ20 వరల్డ్‌క్‌పలో వరుసగా రెండో రోజు కూడా సంచలన ఫలితం. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు తమకన్నా పటిష్టమైన ఐర్లాండ్‌ను 12 పరుగులతో ఓడించింది.
ఐర్లాండ్‌పై విజయం
న్యూయార్క్: టీ20 వరల్డ్‌క్‌పలో వరుసగా రెండో రోజు కూడా సంచలన ఫలితం. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు తమకన్నా పటిష్టమైన ఐర్లాండ్‌ను 12 పరుగులతో ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలి విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు చేసింది. టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా మిడిలార్డర్‌లో నికోలస్ కిర్టన్ (49), శ్రేయాస్ మొవ్వ (37) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. అలాగే ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించడంతో జట్టు ఓ మాదిరి స్కోరందుకుంది. మెక్‌కార్తి, యంగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడింది. ఆఖర్లో అడెయిర్ (34), డాక్‌రెల్ (30 నాటౌట్) పోరాటం ఫలితాన్నివ్వలేదు. కెనడా బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డారు. అలాగే ఆరో ఓవర్ నుంచి వరుసగా సాగిన వికెట్ల పతనంతో ఐర్లాండ్ మరిక కోలుకోలేకపోయింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (9), బల్బిర్నీ (17), టెక్టర్ (7), టక్కర్ (10), కాంఫర్ (4), డెలాని (3) ఇలా అందరూ చకచకా పెవిలియన్ చేరడంతో 59/6 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే డెత్ ఓవర్లలో డాక్‌రెల్, అడెయిర్ భారీ షాట్లతో బౌండరీలు రాబట్టి విజయంపై ఆశలు రేపారు. దీంతో ఆఖరి ఓవర్‌లో సమీకరణం 17 పరుగులకు మారగా పేసర్ గార్డన్ నాలుగు పరుగులే ఇచ్చి అడెయిర్ వికెట్ తీయడంతో కెనడా సంబరాలు చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
కెనడా: 20 ఓవర్లలో 137/7 (కిర్టన్ 49, శ్రేయాస్ 37; మెక్‌కార్తి 2/24, యంగ్ 2/32)
ఐర్లాండ్: 20 ఓవర్లలో 125/7 (అడెయిర్ 34, డాక్‌రెల్ 30 నాటౌట్; గార్డన్ 2/16, హేలిగర్ 2/18).
Updated Date - Jun 08 , 2024 | 06:00 AM