David Warner: డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్.. ఆ కల చెదిరిందిగా!
ABN, Publish Date - Jul 15 , 2024 | 08:55 PM
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాలన్న అతని కల పూర్తిగా చెదిరింది. అసలు...
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు (David Warner) భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) ఆడాలన్న అతని కల పూర్తిగా చెదిరింది. అసలు అతడ్ని తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ (George Bailey) బాంబ్ పేల్చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన కెరీర్ కొనసాగించిన అతను ఇక రిటైర్ అయ్యాడని, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతడు పాకిస్తాన్‌కు రాడని ఆయన తేల్చి చెప్పేశాడు.
అసలు విషయం ఏమిటంటే.. టీ20 వరల్డ్‌కప్ (2024) ముగిశాక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్, తనని పరిగణనలోకి తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతానని ప్రకటించాడు. తాను అనుకున్న స్థాయిలో రిటైర్‌మెంట్ జరగని నేపథ్యంలో.. జట్టులోకి తిరిగిరావడానికి తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. అయితే.. బెయిలీ అతని ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయబోయే జట్టులో వార్నర్ ఉండడని స్పష్టం చేశాడు. అతను ఎప్పుడు జోక్ చేస్తాడో, ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో తెలియదని సెటైర్ వేశాడు. ఏదేమైనా అతని కెరీర్ అద్భుతంగా సాగిందని తెలిపాడు. తమ ప్రణాళికలో కొత్త ఆటగాళ్లే ఉన్నారని పేర్కొన్నాడు.
ఇదే సమయంలో.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌ల భవిష్యత్తుపై కూడా బెయిలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెరీర్ గురించి ఆ ఇద్దరితో ఇంతవరకూ ఎలాంటి సంభాషణలు కొనసాగలేదని అన్నాడు. తదుపరి టీ20 వరల్డ్‌కప్ 2026లో ఉందని, కాబట్టి ఆ సమయంలోపు జట్టులో కొన్ని మార్పులు తప్పకుండా ఉండొచ్చని కుండబద్దలు కొట్టాడు. టీ20లో వాళ్లిద్దరు కొనసాగుతారా? లేదా? అనేది తాను ఇప్పుడే ఏం చెప్పలేనని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే.. టీ20 స్క్వాడ్ నుంచి మ్యాక్స్‌వెల్, స్టార్క్‌లను తొలగించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. బెయిలీ మాటల్ని బట్టి చూస్తే ఇక డేవిడ్ వార్నర్ ఎప్పటికీ జట్టులోకి పునరాగమనం ఇవ్వడని మనం స్పష్టం చేసుకోవచ్చు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 15 , 2024 | 08:55 PM