T20 World Cup: ఆస్ట్రేలియా అలాంటి పని చేస్తే.. నిషేధం తప్పదు!
ABN, Publish Date - Jun 13 , 2024 | 06:21 PM
ఆస్ట్రేలియా ప్లేయర్లు మైదానంలో ఎంత అద్భుతంగా రాణిస్తారో.. మైకుల ముందు అంతే నోటిదురుసు ప్రదర్శిస్తుంటారు. తమకు ఐసీసీ ఈవెంట్స్‌లో ఎక్కువ సక్సెస్ రేటు ఉందనో లేక అహంకారమో..
ఆస్ట్రేలియా (Australia) ప్లేయర్లు మైదానంలో ఎంత అద్భుతంగా రాణిస్తారో.. మైకుల ముందు అంతే నోటిదురుసు ప్రదర్శిస్తుంటారు. తమకు ఐసీసీ ఈవెంట్స్‌లో ఎక్కువ సక్సెస్ రేటు ఉందనో లేక అహంకారమో తెలీదు కానీ.. అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్పి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టిమ్ పైన్ (Tim Paine) కూడా అలాంటి పనే చేశాడు. ఇంగ్లండ్ (England) జట్టు తర్వాతి దశకు చేరుకోకుండా.. స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయాలంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ఈ అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
టిమ్ పైన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ టోర్నీ నుంచి ఇంగ్లండ్ జట్టుని బయటకు పంపించేందుకు.. స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫలితాలను తప్పకుండా తారుమారు చేయాలని టిమ్ పైన్ చెప్పాడు. దీనిపై వివాదం చెలరేగగా.. తానేమీ జోక్ చేయడం లేదని మరోసారి స్పందించాడు. ఆసీస్ తప్పకుండా ఆ మ్యాచ్ ఫలితాల్ని తారుమారు చేయాల్సిందేనని, దీనిపై తాను సీరియస్‌గానే ఉన్నానని అన్నాడు. అలాగని ఆసీస్ ఓడిపోవాలని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. స్కాట్లాండ్ రన్‌రేట్ మరీ దెబ్బపడకుండా.. మోస్తరు తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాలని చెప్పాడు. ఫలితంగా.. ఇంగ్లండ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని పైన్ చెప్పుకొచ్చాడు.
అలా చేస్తే చర్యలు తప్పవు
ఒకవేళ టిమ్ పైన్ చెప్పినట్లు ఆస్ట్రేలియా జట్టు స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఫలితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తే.. అప్పుడు ఐసీసీ రంగంలోకి దిగి కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. ముఖ్యంగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్‌కే ఎక్కువ దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.11 ప్రకారం.. అతనిపై కనీసం రెండు మ్యాచ్‌ల నిషేధం పడుతుంది. ఒకవేళ అదే జరిగితే.. తదుపరి దశలో (సూపర్-2) జరగబోయే రెండు మ్యాచ్‌లకు మిచెల్ మార్ష్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టుకి పెద్ద నష్టమే వాటిల్లుతుంది. కాబట్టి.. ఆసీస్ జట్టు పైన్ చెప్పినట్లు రిస్క్ చేయకపోవడమే మంచిది.
ఇంగ్లండ్ పరిస్థితి ఇది
ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లండ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తొలి మ్యాచ్ రద్దై, రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్-బీలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా మూడు విజయాలతో సూపర్-8కు అర్హత సాధిస్తే.. స్కాట్లాండ్ 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించడం దాదాపు అసాధ్యం. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. స్కాట్లాండ్ రన్‌రేట్ (+2.164)ని ఇంగ్లండ్ (-1.800) అందుకోవడం కష్టమే. ఒకవేళ స్కాట్లాండ్ భారీ తేడాతో ఘోర పరాజయం ఎదుర్కుంటే.. అప్పుడు లెక్కలు మారొచ్చేమో!
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 06:21 PM