BCCI-Team India: వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు కళ్లు చెదిరే బంపర్ బొనాంజా ప్రకటించిన బీసీసీఐ
ABN, Publish Date - Jun 30 , 2024 | 08:52 PM
దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌కు ఐసీసీఐ టైటిల్‌ని అందించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ముంబై: దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌కు ఐసీసీఐ టైటిల్‌ని అందించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2024 సాధించిన భారత జట్టుకు కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం బంపర్ బొనాంజా ప్రకటన చేశారు.
‘‘ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిచినందుకుగానూ టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నందుకు ఆనందిస్తున్నాను. టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అత్యుత్తమ ఈ విజయానికి కారకులైన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు’’ అంటూ జైషా ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటన చేశారు.
కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్‌ను భారత్ గెలుచుకుంది. 28 రోజుల పాటు కొనసాగిన 20 జట్లు పాల్గొన్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో ఇన్ని జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 11.25 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ.93.7 కోట్లు) ఉంది. ట్రోఫీని గెలిచిన భారత్‌కు ప్రైజ్‌మనీ 2.45 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.20 కోట్లు) ఉంది. ఇక రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ప్రైజ్‌మనీ కనీసం 1.28 మిలియన్ డాలర్లుగా ఉంది. అంతే భారతీయ కరెన్సీలో సుమారు రూ.10 కోట్లుగా ఉంది.
Updated Date - Jun 30 , 2024 | 09:16 PM