Maharashtra: తీవ్ర విషాదం.. మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్..
ABN, Publish Date - Nov 29 , 2024 | 12:04 PM
అప్పటివరకూ తోటి ఆటగాళ్లతో సరదాగా గడిపిన ఓ యువ క్రికెటర్ రెప్పపాటు క్షణాల్లో ప్రాణాలు వదిలేశాడు. ఈ వార్త పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ముంబై: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్యాట్ పట్టుకుని అభిమానులను పలకరిస్తూ బరిలోకి దిగిన ఓ యువ క్రికెటర్ అంతలోనే తనువు చాలించాడు. గుండె పోటుతో మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిన అతడు కొద్ది నిమిషాలకే మరణించాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని గార్‌వేర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం చోటుచేసుకుంది. లక్కీ బిల్డర్స్, యంగ్ ఎలెవన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ సికందర్ పటేల్(35) అనే యువ క్రికెటర్ మృతి చెందాడు.
గ్రౌండ్ నుండి బయటకు వెళ్తుండగా అతడు ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. లక్కీ జట్టు కెప్టెన్ అయిన పటేల్ ఆరో ఓవర్లో రెండు డిగ్నిఫైడ్ ఫోర్లు బాదాడు. లీగ్ మ్యాచ్ కోసం గార్వేర్ స్టేడియంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా పటేల్ పిచ్‌లోకి ప్రవేశించాడు. కొన్ని ఓవర్ల తర్వాత, అతను తన ఎడమ చేయి, ఛాతీలో నొప్పి కలుగుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కావడంతో ఇదంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డయ్యింది.
అతడికి ఇంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. శారీరకంగా మంచి స్థితిలో ఉన్నాడు. క్రికెటర్‌ను ఎంతగానో ప్రేమించాడు అని ఆటగాళ్లలో ఒకరైన నసీర్ ఖాన్ తెలిపాడు. గతంలో పూణెలో హబీబ్ షేక్ అనే క్రికెటర్ సైతం ఇదేవిధంగా మరణించడం గమనార్హం. తాజా ఘటనలో మరణించిన క్రికెటర్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో నాలుగు నెలల వయసున్న చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేస్తోంది.
దౌత్య సంబంధాల్లో క్రికెట్ అంతర్భాగం
Updated Date - Nov 29 , 2024 | 01:16 PM