Virat Kohli: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్!
ABN, Publish Date - Jun 19 , 2024 | 02:48 PM
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఎన్నో అంచనాలు ఉండేవి. ఐపీఎల్-2024 సీజన్‌లో అతను హయ్యస్ట్ స్కోరర్‌గా నిలవడంతో..
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై (Virat Kohli) ఎన్నో అంచనాలు ఉండేవి. ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌లో అతను హయ్యస్ట్ స్కోరర్‌గా నిలవడంతో.. ఈ మెగా టోర్నీలో అదే జోరు కొనసాగిస్తాడని, పరుగుల సునామీ సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా కోహ్లీ ఫ్యాన్స్ ఆశల్ని నీరుగార్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగినట్టే దిగి.. పెవిలియన్ బాట పడుతున్నాడు. ఒక మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అవ్వగా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ బ్యాటింగ్ స్థానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ టోర్నీలో కోహ్లీ ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ, ఇప్పుడు మాత్రం వన్ డౌన్‌లో (మూడో స్థానంలో) వస్తేనే బెటరని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. వన్ డౌన్‌లో కోహ్లీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. అతను పరుగులు చేయడమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టుని ముందుండి నడిపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వన్ డౌన్‌లోనే దిగి.. సింగిల్ హ్యాండెడ్‌గా జట్టుని గెలిపించిన ఘనతలూ అతనికి సొంతం. ఆ స్థానంలో దిగితే.. కోహ్లీ ముందుగా బౌలర్లతో పాటు పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని, ఆచితూచి ఆడుతాడు. అందుకే.. అతనికి వన్ డౌన్ బాగా అచ్చొచ్చింది. ఈ క్రమంలోనే.. కోహ్లీ ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లో వన్ డౌన్‌గా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. క్రీడా నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఇదిలావుండగా.. గ్రూప్ దశలో తొలుత ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో మ్యాచ్‌లో అయితే మరీ దారుణం. యూఎస్ఏ బౌలర్ సౌరభ్ నెట్రవాల్కర్ బౌలింగ్‌లో తొలి బంతికే క్యాచ్ ఇచ్చి, గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలోనే.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానం మారడం వల్లే కోహ్లీ తన ఫామ్ కోల్పోయాడని, వన్ డౌన్‌లో వస్తే తిరిగి తన బ్యాట్‌కు పని చెప్పగలడని అభిమానులు, క్రీడా నిపుణులు అనుకుంటున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 02:48 PM