IND vs ENG: అతను జడేజా కాదు కదా.. సుందర్ ఎంపికపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 30 , 2024 | 12:05 PM
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
వైజాగ్: హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంతలోనే తొలి టెస్టులో భారీ హాఫ్ సెంచరీలతో చెలరేగిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడం టీమిండియాకు ప్రతికులాంశంగా మారింది. దీంతో వారిద్దరి స్థానంలో సెలెక్టర్లు వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌ను ఎంపిక చేశారు. దీంతో స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో భర్తీ చేయనున్నారు. అయితే స్టార్ ఆల్‌రౌండరైనా జడేజా స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలడా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ఈ క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ రెండో టెస్టుకు రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుందని చెప్పాడు. సౌరాష్ట్రకు చెందిన జడేజాకు తమిళనాడు ఆటగాడు వాషింగ్టన్ సుందర్ సరైన ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘జడేజా దూరం కావడంతో టీమిండియా మంచి బ్యాటర్, బౌలర్‌ను కోల్పోతుంది. జడేజా జట్టుకు బలం. అతను వరల్డ్ నంబర్ 1 టెస్టు ఆల్ రౌండర్ అనడంలో సందేహం లేదు. జడేజా కారణంగానే హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ అధిక్యం లభించింది. జడేజా బ్యాటింగ్ చేయడంతోపాటు బౌలింగ్‌లో కనీసం రెండు లేదా మూడు వికెట్లు కూడా తీస్తాడు. అలాగే ఫీల్డింగ్‌లో గన్ ఫీల్డర్. జడ్డూ లేనప్పుడు బ్యాటింగ్ చేయగల బౌలర్‌ను ఎంచుకోవాలి. కాబట్టి వాషింగ్టన్ సుందర్ గురించి ఆలోచించడం మంచిది. సుందర్ పరుగులను నియంత్రణ చేయగలడు కానీ వికెట్లు తీయలేడు. అలాగే సుందర్ బ్యాటింగ్ బాగా చేస్తాడు. అతను మంచి బ్యాటర్. కానీ అతను జడ్డూ కాదు’’ అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు గతంలో భారత్‌లో పర్యటించినప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా 3 టెస్టులు ఆడాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 90 సగటుతో 181 పరుగులు చేసి బ్యాటుతో అదరగొట్టాడు. కానీ బాల్‌తో మాత్రం రెండు వికెట్లే తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 30 , 2024 | 12:05 PM