IND vs ENG: వైజాగ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ.. 11 ఫోర్లు, 2 సిక్సులతో ఊచకోత
ABN, Publish Date - Feb 04 , 2024 | 01:29 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్ కష్టాల్లో జట్టును ఆదుకోవడమే కాకుండా అద్భుత సెంచరీతో దుమ్ములేపాడు.
వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా అద్భుత సెంచరీతో దుమ్ములేపాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన గిల్ ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 132 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. గిల్ విధ్వంసకర సెంచరీలో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. టెస్ట్ కెరీర్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న గిల్ ఈ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ఫామ్‌లో లేడంటూ తనపై కొంతకాలంగా వస్తున్న విమర్శలకు గిల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 28/0తో మూడో రోజు ఆటలో తమ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(13), యశస్వి జైస్వాల్(17)ను ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. రోహిత్ శర్మ అయితే రెండో రోజు సాధించిన స్కోర్‌కు ఒక పరుగు కూడా జోడించలేకపోయాడు. దీంతో 30 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో జట్టును శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరు జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఈ భాగస్వామ్యాన్ని 28వ ఓవర్‌లో స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ విడదీశాడు. 29 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్‌కు దొరికిపోయాడు. పరిగెత్తుతూ స్టోక్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో 111 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 9 పరుగులు చేసిన అరంగేట్ర ఆటగాడు రజత్ పటీదార్ కూడా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్ విరామ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. లంచ్ అనంతరం గిల్, అక్షర కలిసి జట్టు స్కోర్‌ను రెండు వందలు దాటించారు. ఈ క్రమంలో వీరిద్దరి భాగస్వామ్యం హాఫ్ సెంచరీ దాటింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 04 , 2024 | 01:37 PM