Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు తిరిగొచ్చేందుకు సర్వం సిద్ధం
ABN, Publish Date - Jul 02 , 2024 | 02:04 PM
టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..
టీమిండియా (Team India) అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ (BCCI) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో జులై 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ఆటగాళ్లు బయలుదేరనున్నారు. అంటే.. భారత కాలమానం ప్రకారం వాళ్లు బుధవారం (జులై 3వ తేదీన) తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు అక్కడి నుంచి ప్రారంభమవుతారు. అదే రోజున.. అంటే బుధవారం రాత్రి 7:45 గంటలకు వాళ్లు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
నిజానికి.. షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు ఎప్పుడో భారత్‌కు తిరిగి రావాల్సింది. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే భారత గడ్డపై అడుగుపెట్టాల్సింది. కానీ.. బెరిల్ హెరికేన్ ఆ ద్వీపదేశాన్ని తాకడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బార్బడోస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. విమాన సేవల్ని నిలిపివేశారు. ప్రజల సంక్షేమం కోసం అక్కడి అధికారులు కర్ఫ్యూ కూడా విధించారు. దీంతో.. భారత ఆటగాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లోని తమ హోటల్ గదుల్లోనే బస చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో.. వారు తిరుగుపయనానికి రెడీ అయ్యారు.
ఈ విషయాన్ని ఓ క్రీడా విశ్లేషకుడు ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ‘‘భారత క్రీడాభిమానులకు శుభవార్త. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు దేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. బీసీసీఐ వీరికోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. భారత కాలమానం ప్రకారం వాళ్లు బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు బయలుదేరి, రాత్రి 7:45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు’’ అంటూ విక్రాంత్ గుప్తా రాసుకొచ్చాడు. దీంతో.. ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు సమాయత్తమవుతున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 02:05 PM