IPL Auction: ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:47 AM
ఒకప్పుడు తమ జట్టులో ఆడేందుకు పనికిరారంటూ ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన క్రికెటర్లు ఆ తర్వాత తమ రీఎంట్రీతో మైండ్ బ్లాకయ్యే రేంజ్లో సత్తా చాటారు..
ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీషా, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, శార్దూల్ ఠాకూర్ వంటి క్రికెటర్లు అమ్ముడుపోకపోవడం వారి అభిమానులను తీవ్రంగా బాధించింది. అయితే, ఇలా అమ్ముడుపోకుండా మిగిలిపోయిన క్రికెటర్ల కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఒకప్పుడు తమ జట్టులో ఆడేందుకు పనికిరారంటూ ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన క్రికెటర్లు ఆ తర్వాత తమ రీఎంట్రీతో మైండ్ బ్లాకయ్యే రేంజ్లో సత్తా చాటారు. అలాంటి ఓ నలుగురు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..
వదిలేసిన జట్టుకు గేల్ గుణపాఠం..
వెస్టిండీస్ స్టార్ గా పేరుగాంచిన క్రిస్ గేల్ ను మొదటి ఐపీఎల్ వేలం సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే, అతను అంతర్జాతీయ డ్యూటీ, వెన్ను గాయం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఆ ఫ్రాంచైజీ గేల్ ను జట్టు నుంచి తప్పించింది. ఇక 2011 వేలంలోనూ అతడిని ఎవరూ కొనలేదు. అనుకోకుండా తమ బౌలర్ డిర్క్ నాన్స్ గాయపడటంతో ఆర్సీబీ గేల్ ను అతడి స్థానంలో తీసుకుంది. కొన్ని మ్యాచుల వరకు బెంచ్ పైనే కూర్చున్న గేల్ ఆ తర్వాత తనను వదిలేసిన కేకేఆర్ జట్టుతో ఆర్సీబీ తరపున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో గేల్ 55 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సీజన్ లో 12 ఇన్నింగ్స్ లో 608 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు సాధించాడు. ప్లేఆఫ్స్ లో సీఎస్‌కే చేతిలో అతడి జట్టు ఓడిపోయింది. కానీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న గేల్ తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకున్నాడు.
ఆఖరు నిమిషంలో వచ్చి అదరగొట్టాడు..
మరో వెస్టిండీస్ ఆటగాడిదీ ఇదే పరిస్థితి. ఎవ్వరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని లెండిల్ సిమన్స్‌కు ముంబై ఇండియన్స్ నుంచి అనుకోని విధంగా పిలుపు అందింది. 2013-14లో అప్పటికే మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనాను జట్టులో చేర్చుకున్న ఎమ్ఐ.. ఆసీజన్ ఆరంభంలోనే వరసగా 4 మ్యాచుల్లో ఓడిపోయి నిరాశతో ఉంది. దీంతో తొలిసారి సిమన్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. వెళ్లడంతోనే ఓపెనింగ్ బాధ్యతలను అతడిపై మోపారు. అయినా వెనకడుగు వేయలేదు. సీఎస్క్ తో జరిగిన మొదటి మ్యాచ్లో 38 పరుగులు తీశాడు. ఆ తర్వాత హైదరాబాద్ తో హాఫ్ సెంచరీ.. ఇక పంజాబ్ పై సెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 8 ఇన్నింగ్స్ లో 394 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
అశ్విన్ స్థానంలో వచ్చి..
ఇమ్రాన్ తాహిర్‌ను 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. సహచర లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో కలిసి అతను విజయం సాధించాడు. 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. తర్వాతి సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2016లో సీజన్ తర్వాత తాహిర్ ను జట్టు నుండి తొలగించారు. అతను వేలంలో పాల్గొన్నా ఎవరూ కొనుగోలు చేయలేదు. మిచెల్ మార్ష్ గాయపడటంతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తాహిర్‌ను జట్టులోకి తీసుకుంది. తమ ప్రీమియర్ స్పిన్నర్ అశ్విన్ జట్టు నుంచి వైదొలగడంతో ఫ్రాంచైజీకి ఇది వరంగా మారింది. ఇక ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఫైనల్లో ముంబైపై పుణె జట్టు ఓడిపోయింది.
ఈ దిగ్గజ స్టార్ వేలం బాధితుడే..
రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దిగ్గజ ఆటగాడే కావచ్చు.. కానీ ఐపీఎల్ వేలంలో అతన్ని కూడా పక్కనపెట్టిన సందర్భాలున్నాయి. 2012లో స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ సీజన్‌కు ముందు మిచెల్ మార్ష్ గాయం కారణంగా పుణె వారియర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్మిత్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మొత్తం 362 పరుగులు చేసి అందరికీ షాకిచ్చాడు.
IND vs PM XI: పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్: టాస్ గెలిచిన రోహిత్.. ఇవాళైనా ఆడతారా..
Updated Date - Dec 01 , 2024 | 12:29 PM