SRH vs LSG: బదోనీ, పూరన్ మెరుపులు.. హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే?
ABN, Publish Date - May 08 , 2024 | 09:34 PM
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55) ...
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55) అర్థశతకంతో రాణించడంతో పాటు నికోలస్ పూరన్ (48) మెరుపులు మెరిపించడంతో.. లక్నో జట్టు ఆ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అంతకుముందు హైదరాబాద్ బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ చూసి.. లక్నో జట్టు 150 పరుగుల మార్క్‌ని అందుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ.. బదోనీ, పూరన్ మెరుపులు మెరిపించడంతో 150 పరుగుల మార్క్‌ని దాటేసి, హైదరాబాద్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది మరీ అంత పెద్ద లక్ష్యం కాదు కాబట్టి.. ఎస్ఆర్‌హెచ్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తుందని భావించొచ్చు. కానీ.. వికెట్లు కోల్పోతే మాత్రం కష్టమే.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకి ఆదిలోనే రెండు బారీ ఎదురుదెబ్బలు తగిలాయి. డికాక్ (2), స్టోయినిస్ (3) తక్కువ పరుగులకే చాపచుట్టేశారు. కేఎల్ రాహుల్ (29), కృనాల్ పాండ్యా (24) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు కానీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. అప్పుడు క్రీజులోకి వచ్చిన పూరన్, బదోనీ కలిసి తమ జట్టుని ఆదుకున్నారు. చివరివరకూ క్రీజులో నిల్చొని, మైదానంలో పరుగుల వర్షం కురిపించి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుని బయటపడేశారు. ఇక హైదరాబాద్ బౌలర్ల విషయానికొస్తే.. భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. నటరాజన్ కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చేశాడు.
Updated Date - May 08 , 2024 | 09:34 PM