T20 World Cup: ‘కోహ్లీనే కాదు.. అతడూ ఎంతో కీలకం.. అతని స్థానంపై ప్రశ్నించలేం’
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:04 PM
భారతీయ అభిమానులు కోరుకున్నట్టుగానే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌ని ముద్దాడేందుకు మరో అడుగు దూరంలోనే ఉంది. సౌతాఫ్రికాతో జరగబోయే హోరీహోరీ...
భారతీయ అభిమానులు కోరుకున్నట్టుగానే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup 2024) ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌ని ముద్దాడేందుకు మరో అడుగు దూరంలోనే ఉంది. సౌతాఫ్రికాతో జరగబోయే హోరీహోరీ ఫైనల్ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే.. భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్ల ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారే.. విరాట్ కోహ్లీ (Virat Kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja). కోహ్లీ ఇంతవరకూ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. అటు.. జడేజా సైతం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో.. ఫైనల్ మ్యాచ్‌లో అయినా వీళ్లు సత్తా చాటాలని కోరుకుంటున్నారు.
Read Also: ఫైనల్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంది?
ఇలాంటి తరుణంలో.. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుసార్లు కోహ్లీకి మద్దతు తెలిపిన ఆయన.. తాజాగా జడేజాకూ అండగా నిలిచాడు. జడేజా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, జట్టులో అతడి స్థానంపై ప్రశ్నించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అతను బ్యాటింగ్‌లో పరుగులు రాబట్టకపోయినా.. ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్నాడని ప్రశంసించాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి అందిపుచ్చుకోవడానికి జడేజా ముందుంటాడని అన్నాడు. అతను మెరుపు ఫీల్డింగ్ చేస్తాడని, క్యాచ్‌లు పట్టడంతో పాటు రనౌట్‌లు కూడా చేస్తాడని.. ఫలితంగా మైదానంలో 20 నుంచి 30 పరుగులను కాపాడుతాడని చెప్పాడు. జడేజా ఆపే పరుగులు ఎంతో కీలకమైనవని గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా రాణిస్తే.. జట్టుకి అదనపు విలువ తోడైనట్టేనని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
భారతీయ అభిమానులతో ఓ సమస్య ఉందని.. ఎవరైనా రెండు ఆటల్లో సరిగ్గా రాణించకపోతే, అతడు జట్టులో అవసరమా? అని చర్చించుకోవడం మొదలుపెడతారని గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఇప్పుడు జడేజా విషయంలోనూ అదే జరుగుతోందని.. అయితే అతని స్థానంపై ప్రశ్నించాల్సిన అవసరమే లేదని ఆయన తేల్చి చెప్పాడు. జడేజా ఓ రాక్‌స్టార్ అని.. ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టుకి మరెంతో కీలకంగా తయారవుతాడని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో.. కోహ్లీపై నమ్మకం ఉంచాలని, కీలక మ్యాచ్‌ల్లో ఎలా రాణించాలో అతనికి బాగా తెలుసని కూడా వెల్లడించాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 29 , 2024 | 03:04 PM