SA Vs IND: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు వాళ్లిద్దరిపై వేటు తప్పదా?
ABN, Publish Date - Jan 02 , 2024 | 02:49 PM
SA Vs IND: దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 0-1తో వెనుకబడింది. సెంచూరియన్ టెస్టులో ఇన్నింగ్స్ పరాజయంతో నిరాశ పరిచిన భారత్ ఇప్పుడు బుధవారం నుంచి ప్రారంభమయ్యే కేప్ టౌన్ టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం జట్టులో మార్పులు ఉంటాయని స్పష్టం అవుతోంది.
దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 0-1తో వెనుకబడింది. సెంచూరియన్ టెస్టులో ఇన్నింగ్స్ పరాజయంతో నిరాశ పరిచిన భారత్ ఇప్పుడు బుధవారం నుంచి ప్రారంభమయ్యే కేప్ టౌన్ టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం జట్టులో మార్పులు ఉంటాయని స్పష్టం అవుతోంది. తొలి టెస్టులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తప్ప బ్యాటర్లు రాణించలేదు. యషస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ విఫలమైనా వాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ నేరుగా తొలి టెస్టులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. కాబట్టి తొలి టెస్టులో విఫలమైనా రోహిత్ రెండో టెస్టులో తన సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే టీమిండియా పుంజుకున్నట్లే.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా రెండో టెస్టు కోసం బాగా సన్నద్ధం అయ్యాడు. బౌన్సర్లతో ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే తొలి టెస్టులో బౌలింగ్ కూడా తేలిపోయింది. బౌలింగ్‌లో బుమ్రా మినహా ఎవరూ రాణించట్లేదు. షమీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బుమ్రాకు సిరాజ్ కాస్త సహకారం ఇస్తున్నా పూర్తిస్థాయి సామర్థ్యంతో బౌలింగ్ చేయడం లేదు. కొత్త కుర్రాడు ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ముకేష్ కుమార్‌ను తీసుకునే అవకాశం ఉంది. శార్దూల్ ఠాకూర్‌కు కూడా మరో అవకాశం లభించనుంది. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోసం సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. అశ్విన్ నాణ్యమైన టాప్ బౌలర్ అయినా ఏడో స్థానంలో విలువైన పరుగులు చేయగలిగే జడేజా వైపు టీమిండియా మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 02 , 2024 | 02:50 PM