India vs USA: భారత్‌కు ఛాలెంజింగ్ టార్గెట్ నిర్దేశించిన అమెరికా.. లక్ష్యం ఎంతంటే?
ABN, Publish Date - Jun 12 , 2024 | 09:43 PM
టీ20 వరల్డ్ కప్ 2024కు ఆతిథ్యమిస్తున్న వేదికల్లో ఒకటైన న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు అమెరికా ఛాలెంజింగ్ లక్ష్యాన్ని నిర్దేశించింది.
న్యూయార్క్: టీ20 వరల్డ్ కప్ 2024కు ఆతిథ్యమిస్తున్న వేదికల్లో ఒకటైన న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు అమెరికా ఛాలెంజింగ్ లక్ష్యాన్ని నిర్దేశించింది. బలమైన జట్లు సైతం స్వల్ప లక్ష్యాలు ఛేదించలేక చతికిల పడుతున్న ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది. దీంతో భారత్ లక్ష్యం 111 పరుగులుగా ఉంది.
భారత బౌలర్లు ఆరంభంలోనే కీలకమైన వికెట్లు పడగొట్టడం ద్వారా అమెరికా భారీ స్కోరు చేయకుండా నియంత్రించగలిగారు. ముఖ్యంగా పేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి అదరగొట్టాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్షదీప్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. అమెరికా ఇన్నింగ్స్ ఆరంభం బంతికే తొలి వికెట్ తీసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అదే ఓవర్‌లో మరో వికెట్ తీశాడు. దీంతో అతిథ్య జట్టు అమెరికా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు నష్టపోయింది. మిగత భారత బౌలర్లలో వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 చొప్పున వికెట్లు తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.
అమెరికా బ్యాటర్లలో 27 పరుగులు చేసిన నితీశ్ కుమార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో స్టీవెన్ టైలర్ 24, ఆడ్రీస్ గౌస్ 2, ఆరోన్ జోన్స్ 11, కోరీ అండర్సన్ 14, హర్మీత్ సింగ్ 10, వాన్ 11 (నాటౌట్), జస్దీప్ సింగ్ 2 చొప్పున పరుగులు చేశారు.
Updated Date - Jun 12 , 2024 | 09:57 PM