Virat Kohli: విరాట్ కోహ్లీ అందుకు అర్హుడు కాదు.. మరొకరికి ఇవ్వాల్సింది!
ABN, Publish Date - Jul 04 , 2024 | 07:25 PM
‘పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ’ అనే సామెత ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుని విశ్వవిజేతగా..
‘పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ’ అనే సామెత ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup 2024) భారత జట్టుని విశ్వవిజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన అతనిపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. దూకుడుగా ఆడకుండా బంతులను వృధా చేశాడని, అతని స్ట్రైక్‌రేట్ చాలా తక్కువగా ఉందంటూ పెదవి విరుస్తూనే ఉన్నారు. కోహ్లీ దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అంతర్జాతీయ మీడియా కోహ్లీకి జేజేలు కొడుతుంటే.. మన భారతీయులు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇప్పుడు ఈ విమర్శకుల జాబితాలోకి తాజాగా భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ చేరిపోయాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం అతనికి ఇవ్వాల్సింది కాదని బాంబ్ పేల్చాడు. అంతేకాదు.. కోహ్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఉందని, దాని కారణంగా హార్దిక్ పాండ్యా తక్కువ బంతులు ఆడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘కోహ్లీ నిదానంగా ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అయిన పాండ్యాకు కేవలం రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం దొరికింది. 128 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ ఒక్కడే సగం ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ భారత జట్టుని టైట్ కార్నర్‌లో పడేసింది. చివరికి బౌలర్లే జట్టుని కాపాడారు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
తన దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు కోహ్లీ ఏమాత్రం అర్హుడు కాదని మంజ్రేకర్ పేర్కొన్నాడు. అతనికి బదులు బౌలర్లలో ఎవరో ఒకరికి ఆ అవార్డు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే.. అసాధ్యం అనుకున్న ఫీట్‌ని వాళ్లు సుసాధ్యం చేశారని, ఉత్కంఠభరితమైన సమయంలో మలుపు తిప్పి మ్యాచ్‌ని గెలిపించింది వాళ్లేనని తెలిపాడు. భారత జట్టు దాదాపు ఓటమి అంచుల్లోకి వెళ్లిందని, సౌతాఫ్రికాకు గెలిచే అవకాశం 90% ఉందని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లు అద్భుతంగా రాణించి.. జట్టుని విశ్వవిజేతలుగా నిలిపారని మంజ్రేకర్ చెప్పాడు. చూస్తుంటే.. కోహ్లీ ఇన్నింగ్స్ పట్ల ఆయన ఏమాత్రం సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. కోహ్లీ ఓ వెన్నముకలా నిలిచాడు. పేకమేడలా జట్టు కూలిపోకుండా.. సమర్థవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతవరకూ.. అతనితో భారీ షాట్లు ఆడిస్తూ, తాను క్రీజులో పెద్దన్నలా నిలిచాడు. అందుకే.. కోహ్లీ ఇన్నింగ్స్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ.. జీర్ణించుకోలేని కొందరు మాత్రం మంజ్రేకర్‌లాగా విమర్శిస్తున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 04 , 2024 | 07:25 PM