Virat Kohli: ఇదీ.. విరాట్ కోహ్లీ క్రేజ్.. న్యూయార్క్‌లో లార్జర్ దాన్ లైఫ్ విగ్రహం!
ABN, Publish Date - Jun 26 , 2024 | 07:21 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత దశాబ్దన్నర కాలం నుంచి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతను..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత దశాబ్దన్నర కాలం నుంచి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతను.. క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన అథ్లెట్‌గా నిలిచాడు. హేమాహేమీలకు సైతం సాధ్యం కాని రీతిలో క్రికెట్‌లో గొప్ప రికార్డులను నెలకొల్పి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు. అంతటి ఘన చరిత్ర కలిగి ఉన్నాడు కాబట్టి.. అమెరికా గడ్డపై అతని విగ్రహం (Kohli Statue) వెలిసింది.
డ్యూరోఫ్లెక్స్ అనే మ్యాట్రెస్ కంపెనీ.. బంగారపు పూతతో కూడిన కోహ్లీ విగ్రహాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించింది. ఈ విగ్రహంలో కోహ్లీ తన చేత బ్యాట్ పట్టుకొని నిలబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఎంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో కోహ్లీ విగ్రహం కనిపించడంతో.. అతని అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో, అది కూడా నడిరోడ్డుపై కోహ్లీ విగ్రహం ఆవిష్కరించబడటంతో.. అతని ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా ఆవిష్కరించబడిన ఈ విగ్రహం.. కోహ్లీ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విగ్రహం చూసిన ఫ్యాన్స్.. కోహ్లీని ‘GOAT’ (Greatest Of All Time) అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
అయితే.. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అది నిజమైన విగ్రహం కాదు.. కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ (CGI). డ్యూరోఫ్లెక్స్‌కు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. తమ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆ మ్యాట్రెస్ కంపెనీ ఈ సీజీఐ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కోహ్లీకి గ్లోబల్‌వైడ్‌గా ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం.. ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. ఎలాగో కోహ్లీ ఇప్పుడు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు కాబట్టి.. ఇలాంటి ప్రచారం తమకు మరింత కలిసొస్తుందన్న ఉద్దేశంతో ఇంత గ్రాండ్‌గా సీజీఐ విగ్రహాన్ని సిద్ధం చేసింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 26 , 2024 | 07:21 PM