Women Cricket: అక్కడ అబ్బాయిలు.. ఇక్కడ అమ్మాయిలు.. ఆసిస్ చేతిలో టీమిండియాకు వరుస షాకులు
ABN, Publish Date - Dec 08 , 2024 | 02:57 PM
ఒకే రోజు టీమిండియాతో రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఓ వైపు పురుషుల క్రికెట్ జట్టు పింక్ బాల్ టెస్టులో ఉసూరుమనిపించగా.. మరోవైపు మహిళల జట్టుకు సైతం షాక్ తగిలింది..
టీమిండియాను ఒకే రోజు వరుస ఓటములు పలకరించాయి. ఆదివారం ఆడిలైడ్ లో రోహిత్ సేన పింక్ బాల్ టెస్టులో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అదే రోజు బ్రిస్బేన్ లో జరిగిన రెండో మహిళల వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 122 పరుగుల తేడాతో సిరీస్ ను ఓడిపోయింది. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆస్ట్రేలియా ఒక్కసారిగా విజృంభించింది. 8 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వన్డే మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఆ తర్వాత ఆతిథ్యజట్టు భారత్ ను 44.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ చేసింది. మ్యాచ్ ను సునాయాసంగా ముగించి సత్తా చాటింది. మ్యాచ్ అనంతరం భారత మహిళల జట్టు హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. మధ్యలో మాకు భాగస్వామ్యం లభించింది. మేము పాజిటివ్ గానే ఉన్నాం. కానీ కొన్ని పరుగుల తేడాతో మ్యాచ్ ను ఓడిపోవాల్సి వచ్చింది అని తెలిపింది.
మేము కొన్ని అవకాశాలను సృష్టించుకోగలిగాం. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాం. వారి బ్యాటింగ్ ప్రదర్శనకు కచ్చితంగా క్రెడిట్ దక్కుతుంది. తర్వాతి గేమ్ లో ఎలాంటి ప్లాన్స్ అమలు చేయాలనే విషయాలపై ఆలోచించాల్సి ఉంది. మొత్తం 50 ఓవర్లలోనూ బ్యాటింగ్ చేసేలా సరికొత్త ప్రణాళికతో ముందుకు రావలసి ఉంది అని హర్మన్ ప్రీత్ తెలిపింది.
చెలరేగిన ఆసిస్ మహిళలు..
ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (60), వోల్ కలిసి 130 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆస్ట్రేలియా గెలుపు రేసులోకి దూసుకువచ్చింది. వోల్.. పెర్రీతో కలిసి 92 పరుగుల స్టాండ్‌కు చేరగా.. పెర్రీ.. బెత్ మూనీ (56)తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్లను గందరగోళంలో పడేసారు.
పోరాటం సరిపోలేదు..
ఓపెనర్ రిచా ఘోష్ 72 బంతుల్లో 54 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, జెమిమా రోడ్రిగ్స్ (43), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38) తమ ఓపెనింగ్ తో మ్యాజిక్ చేయలేకపోయారు. మిన్ను మణి 45 బంతుల్లో అజేయంగా 46 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ అది జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ బుధవారం వాకాలో జరగనుంది.
IND vs AUS: టీమిండియా చెత్త రికార్డు.. ఇంతకంటే అవమానం లేదు
Updated Date - Dec 08 , 2024 | 03:43 PM