ఢిల్లీ అదుర్స్
ABN, Publish Date - May 08 , 2024 | 04:08 AM
అరుణ్‌జైట్లీ మైదానంలో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ 220కిపైగా స్కోరు నమోదైన వేళ.. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయ్యింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), ఫ్రేజర్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) మెరుపు...
నేటి మ్యాచ్
హైదరాబాద్ X లఖ్‌నవూ, రాత్రి 7.30 గం. వేదిక: హైదరాబద్
రాజస్థాన్‌పై విజయం
పోరాడిన శాంసన్
ఫ్రేజర్, పోరెల్ మెరుపు ఇన్నింగ్స్
న్యూఢిల్లీ: అరుణ్‌జైట్లీ మైదానంలో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ 220కిపైగా స్కోరు నమోదైన వేళ.. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయ్యింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), ఫ్రేజర్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) మెరుపు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా.. ఆ తర్వాత బౌలర్లు ప్రతాపం చూపారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 20 పరుగులతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. అటు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఢిల్లీ 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. చివర్లో స్టబ్స్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41) చెలరేగాడు. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడింది. శుభమ్ దూబే (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్, ముకేశ్, ఖలీల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుల్దీప్ నిలిచాడు.
శాంసన్ ఒక్కడే: భారీ ఛేదనలో కెప్టెన్ శాంసన్ ఒంటరి పోరు సాగించాడు. కానీ సరైన సమయంలో అతడి వికెట్ తీసి ఢిల్లీ మ్యాచ్‌ను వశం చేసుకుంది. రెండో బంతికే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయినా శాంసన్ దూకుడుగా ఆడాడు. మూడో ఓవర్‌లో 6,4తో బ్యాట్‌కు పనిజెప్పిన అతను.. నాలుగో ఓవర్‌లో 4,4,6.. ఐదో ఓవర్‌లో 6,4,4తో బౌలర్లను ఆడుకున్నాడు. అయితే అక్షర్ ఓవర్‌లో బట్లర్ (19) 4,6 బాదినా అతడికే చిక్కడంతో రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (27) ఉన్న కాసేపు వేగం కనబరిచి 11వ ఓవర్‌లో అవుటయ్యాడు. అప్పటికే స్కోరు వంద దాటింది. ఈ దశలో శాంసన్‌కు శుభమ్ జత కలిశాడు. ఓ భారీ సిక్సర్‌తో 26 బంతుల్లోనే శాంసన్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రసిక్ ఓవర్‌లో వరుసగా 6,4,6 బాదడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. అటు శుభమ్ కూడా ఇషాంత్ ఓవర్‌లో 4,6తో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు ఛేదన వైపు సజావుగా సాగుతున్న వేళ 16వ ఓవర్‌లో శాంసన్ భారీ షాట్‌కు వెళ్లి వివాదాస్పదరీతిలో క్యాచ్ అవుటయ్యాడు. లాంగాన్‌లో బౌండరీ దగ్గర హోప్ ఆ క్యాచ్‌ను అందుకున్నప్పుడు రీప్లేలో అతడి కాళ్లు లైన్‌ను తాకాయా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకపోయింది. ఈ విషయమై శాంసన్ అంపైర్లతో మాట్లాడినా, చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం రాజస్థాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. వేగంగా ఆడుతున్న శుభమ్ అవుటవడంతో ఆర్‌ఆర్ ఒత్తిడిలో పడింది. 18వ ఓవర్‌లో కుల్దీప్.. ఫెరీరా (1), అశ్విన్ (2) వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్‌లో 29 రన్స్ కావాల్సి ఉండగా, రెండో బంతికే పోవెల్ (13) బౌల్డవడంతో రాజస్థాన్‌కు నిరాశ తప్పలేదు.
ఫ్రేజర్, స్టబ్స్ దూకుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలో ఓపెనర్ ఫ్రేజర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. తర్వాత అభిషేక్ పోరెల్.. చివర్లో స్టబ్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టు భారీస్కోరు అందుకుంది. తొలి ఏడు బంతులకు 7 రన్స్ చేసిన ఫ్రేజర్.. మూడో ఓవర్ నుంచి శివాలెత్తాడు. ముందుగా బౌల్ట్ ఓవర్‌లో 6,4,4తో 15 రన్స్ అందించిన ఫ్రేజర్.. నాలుగో ఓవర్‌లో మరింత చెలరేగాడు. అవేశ్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా 4,4,4,6,4,6తో 28 రన్స్ రాబట్టిన అతడు... 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఐదో ఓవర్ రెండో బంతికి అశ్విన్ అతడిని అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 26 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వెంటనే హోప్ (1) రనౌటవడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 78/2తో నిలిచింది. ఆ తర్వాత మరో ఓపెనర్ అభిషేక్ బ్యాట్ ఝుళిపించడంతో రన్‌రేట్ తగ్గలేదు. అతను 11వ ఓవర్‌లో 6,4తో 28బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అలాగే అక్షర్(15)తో కలిసి మూడో వికెట్‌కు 42 రన్స్ జోడించాడు. ఈ దశలో అశ్విన్ తన వరుస ఓవర్లలో అక్షర్, అభిషేక్ వికెట్లు తీశాడు. ఇక పంత్ (15)ను 14వ ఓవర్‌లో చాహల్ దెబ్బతీశాడు. దీనికి తోడు 13-17 ఓవర్ల మధ్య 26 రన్సే రావడంతో స్కోరు 200 కష్టమే అనిపించింది. కానీ 18వ ఓవర్‌లో స్టబ్స్ 4,4,4,6 బాదడంతో 21 రన్స్ సమకూరాయి. 19వ ఓవర్‌లో నయీబ్ (19) అవుటవడంతో ఆరో వికెట్‌కు 45 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రసిక్ (9) రెండు ఫోర్లతో స్కోరు 200 దాటింది. ఇక ఆఖరి ఓవర్‌లోనూ స్టబ్స్ చెలరేగి రెండు సిక్సర్లతో 18 రన్స్ రాబట్టినా సందీప్‌కు చిక్కాడు.
స్కోరుబోర్డు
ఢిల్లీ: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50, అభిషేక్ పొరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65, హోప్ (రనౌట్) 1, అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15, పంత్ (సి) బౌల్ట్ (బి) చాహల్ 15, స్టబ్స్ (ఎల్బీ) సందీప్ 41, గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19, రసిక్ (రనౌట్) 9, కుల్దీప్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 221/8; వికెట్ల పతనం: 1-60, 2-68, 3-110, 4-144, 5-150, 6-195, 7-215, 8-221; బౌలింగ్: బౌల్ట్ 4-0-48-1, సందీప్ 4-0-42-1, అవేశ్ 2-0-42-0, అశ్విన్ 4-0-24-3, పరాగ్ 2-0-17-0, చాహల్ 4-0-48-1.
రాజస్థాన్: జైస్వాల్ (సి) అక్షర్ (బి) ఖలీల్ 4, బట్లర్ (బి) అక్షర్ 19, సంజూ శాంసన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86, పరాగ్ (బి) రసిక్ 27, శుభమ్ దూబే (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25, పావెల్ (బి) ముకేశ్ 13, ఫెరీరా (ఎల్బీ) కుల్దీప్ 1, అశ్విన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2, బౌల్ట్ (నాటౌట్) 2, అవేశ్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 201/8; వికెట్ల పతనం: 1-4, 2-67, 3-103, 4-162, 5-180, 6-181, 7-185, 8-194; బౌలింగ్: ఖలీల్ 4-0-47- 2, ఇషాంత్ 3-0-34-0, ముకేశ్ 3-0-30-2, అక్షర్ 3-0-25-1, కుల్దీప్ 4-0-25-2, రసిక్ 3-0-36-1.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 11 8 3 0 16 1.453
రాజస్థాన్ 11 8 3 0 16 0.476
చెన్నై 11 6 5 0 12 0.700
హైదరాబాద్ 11 6 5 0 12 -0.065
ఢిల్లీ 12 6 6 0 12 -0.316
లఖ్‌నవూ 11 6 5 0 12 -0.371
బెంగళూరు 11 4 7 0 8 -0.049
పంజాబ్ 11 4 7 0 8 -0.187
ముంబై 12 4 8 0 8 -0.212
గుజరాత్ 11 4 7 0 8 -1.320
1
20 బంతుల్లోపే ఎక్కువ అర్ధసెంచరీలు (3) చేసిన ఐపీఎల్ బ్యాటర్‌గా ఫ్రేజర్.
1
టీ20 ఫార్మాట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చాహల్. ఓవరాల్‌గా అతను ఐదో స్థానంలో ఉండగా, రషీద్ (572) టాప్‌లో ఉన్నాడు.
Updated Date - May 08 , 2024 | 04:08 AM