ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దీప్తి.. పతక స్ఫూర్తి

ABN, Publish Date - Sep 04 , 2024 | 02:57 AM

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మరో రెండు పతకాలతో మెరిశారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జీవాంజితో పాటు 19 ఏళ్ల షట్లర్‌ నిత్యశ్రీ సివాన్‌ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్‌ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో 16 పతకాలతో...

Deepthi

400 మీ. రేసులో తెలుగు అథ్లెట్‌కు కాంస్యం

షట్లర్‌ నిత్యశ్రీ కంచు మోత

పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మరో రెండు పతకాలతో మెరిశారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జీవాంజితో పాటు 19 ఏళ్ల షట్లర్‌ నిత్యశ్రీ సివాన్‌ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్‌ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో 16 పతకాలతో కొనసాగుతోంది. అలాగే పట్టికలో 18వ స్థానంలో ఉంది. ఇక మంగళవారం జరిగిన మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌34 ఫైనల్లో భాగ్యశ్రీ జాదవ్‌ 7.28మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచింది.


స్వర్ణంపై ఆశలు రేపినా..: మహిళల 400మీ. టీ20 విభాగంలో 20 ఏళ్ల తెలుగు అథ్లెట్‌ దీప్తి జీవాంజి గతంలో వరల్డ్‌ రికార్డు (55.07సె) సాధించింది. అందుకే పారాగేమ్స్‌లో స్వర్ణం అందుకుంటుందనే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే హీట్స్‌లో దీప్తి 55.45 సె.లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆశించిన పతకం రాకపోయినా.. 55.82 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో మురిపించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో దీప్తి ఏడో లైన్‌ నుంచి రేసు ఆరంభించింది. ఆరంభం నెమ్మదిగానే సాగినా మధ్యలో వేగం పుంజుకుని రేసుగుర్రంలా దూసుకెళ్లింది. కొద్ది మీటర్లలో ఫినిషింగ్‌ లైన్‌ వస్తుందనగా అలసటగా కనిపించిన దీప్తి వేగం తగ్గింది. అయితేనేం.. డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రియానా క్లార్క్‌ (యూఎస్‌ఏ)ను వెనక్కినెడుతూ మూడో స్థానంతో ముగించింది. యులియా షులియర్‌ (ఉక్రెయిన్‌, 55.16సె)కు స్వర్ణం, ఏసెల్‌ ఒన్‌డర్‌ (తుర్కియే, 55.23సె) రజతం సాధించారు. ఇదిలావుండగా ట్రాక్‌ రన్నింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు గతంలో ఒక్క పతకం కూడా రాకపోయినా.. పారిస్‌ గేమ్స్‌లో మాత్రం ఏకంగా మూడు పతకాలు దక్కడం విశేషం. ప్రీతి పాల్‌ రెండు కాంస్యాలు సాధించిన విషయం తెలిసిందే.


తొలిసారే పతకం సాధించి..: బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6 విభాగంలో 19 ఏళ్ల నిత్యశ్రీ సివాన్‌ కాంస్య పతకం సాధించింది. ఈసారే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఈవెంట్‌లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన తను 21-14, 21-6 తేడాతో రినా మర్లినా (ఇండోనేసియా)ను చిత్తు చేసింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌ను వరల్డ్‌ నెంబర్‌వన్‌ నిత్యశ్రీ కేవలం 23 నిమిషాల్లోనే ముగించింది. అంతకుముందు సెమీస్‌లో చైనా షట్లర్‌ లిన్‌ షుంగ్‌బో చేతిలో ఓడిన నిత్య ఈ కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. మరోవైపు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు లభించిన ఐదో పతకమిది. ఇప్పటికే నితేశ్‌కు స్వర్ణం, సుహాస్‌, తులసీమతిలకు రజతం, మనీషకు కాంస్యం దక్కాయి. అయితే టోక్యో పారాగేమ్స్‌లో షట్లర్లకు నాలుగు పతకాలే లభించడం గమనార్హం.


గురి తప్పిన అవని: మహిళల 50మీ. రైఫిల్‌ 3పొజిషన్‌ ఎస్‌హెచ్‌1లో స్టార్‌ షూటర్‌ అవని లేఖారాకు నిరాశే ఎదురైంది. ఫైనల్లో 420.6 పాయింట్లతో తను ఐదో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లతో ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో షూటర్‌ మోనా అగర్వాల్‌ క్వాలిఫయింగ్‌లో 13వ స్థానంలో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.

క్వార్టర్స్‌లో ఓడిన పూజ: మహిళల వ్యక్తిగత రికర్వ్‌ ఆర్చరీ ఓపెన్‌లో పూజ ప్రస్థానం క్వార్టర్స్‌లో ముగిసింది. చైనా ఆర్చర్‌ వు చున్‌యాన్‌ (చైనా)తో జరిగిన ఈ ఆసక్తికర పోరులో పూజ 4-6 తేడాతో ఓడింది. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో పూజ 6-0తో యగ్ముర్‌ సెన్‌గుల్‌ (తుర్కియే)ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.


అవమానాలు దిగమింగి..

పిచ్చిది.. కోతిలా ఉంది. ఇలాంటి అమ్మాయిని ఎలా పెంచుతారు.. అనాథ శరణాలయంలో వదిలేయండి.. ఇలా ఒకప్పుడు ఆ అమ్మాయికి ఎదురైన అవమానాలు ఎన్నో! కానీ, ఇప్పుడా అమ్మాయే ఎంతో స్పెషల్‌. చిన్ననాటి నుంచి అవహేళనలు.. ఛీత్కారాలు ఎదురైనా తన పరుగుతో వాటిని నెట్టి పారాలింపిక్‌ చాంపియన్‌గా నిలిచింది జీవాంజి దీప్తి. తనను అవమానించిన చోటే ప్రశంసలు అందుకుంటూ ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి గర్వకారణంగా నిలవడంతో.. దీప్తి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. వరంగల్‌ జిల్లా, కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో జన్మించింది. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి వ్యవసాయ కూలీలు. పేద కుటుంబంలో పుట్టెడు కష్టాల మధ్య ఎన్నో అవమానాలను దిగమింగుకొంటూ దీప్తి పెరిగింది. అయితే, స్కూల్లో పీఈటీ వెంకటేశ్వర్లు ఆమెలోని అథ్లెట్‌ను గుర్తించాడు. దీప్తి ఎంత శ్రమించినా అలసిపోని తత్వం, పరుగుతీసే విధానం ఆకట్టుకోవడంతో తగు విధంగా శిక్షణ ఇచ్చాడు.


ఈ క్రమంలో 2019లో కోచ్‌ నాగపురి రమేష్‌ దృష్టిలో పడడంతో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకొంటున్న సమయంలో దీప్తిని గమనించిన బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ ఐక్యూ టెస్ట్‌ చేయించాడు. ఆమెకు గ్రహణ శక్తి తక్కువనీ, ఏవిషయాన్నయినా వేగంగా అర్థం చేసుకోలేదని డాక్టర్లు సర్టిఫై చేశారు. దీంతో దీప్తికి టీ20 కేటగిరీలో పారా అథ్లెట్‌గా బరిలోకి దిగే అవకాశం దక్కింది. ట్రాక్‌పై దుమ్మురేపిన దీప్తి 2022 ఆసియా పారా క్రీడల్లో 400 మీ. రేస్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. ఈ ఏడాది మేలో వరల్డ్‌ పారా చాంపియన్‌షి్‌పలో 400 మీటర్ల రేస్‌లో ప్రపంచ రికార్డుతో విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఇప్పుడు పారాలింపిక్‌ పతకంతో మరో మెట్టు పైకెదిగింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Sep 04 , 2024 | 08:34 AM

Advertising
Advertising