ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బౌలర్లు మాయ చేసేనా?

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:02 AM

మూడున్నర దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత గడ్డపై టెస్టు విజయం అందుకునేలా కనిపిస్తోంది. ఆ జట్టు చివరి రోజు ఆదివారం 107 పరుగులు సాధిస్తే చాలు. అయితే అంతకుముందు భారత్‌కు అంతా సవ్యంగా...

న్యూజిలాండ్‌ లక్ష్యం 107

సర్ఫరాజ్‌ భారీ శతకం

పంత్‌ సెంచరీ మిస్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 462

బెంగళూరు: మూడున్నర దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత గడ్డపై టెస్టు విజయం అందుకునేలా కనిపిస్తోంది. ఆ జట్టు చివరి రోజు ఆదివారం 107 పరుగులు సాధిస్తే చాలు. అయితే అంతకుముందు భారత్‌కు అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వేళ.. ఒక్కసారిగా బ్యాటర్ల తడబాటు. ఓ దశలో సర్ఫరాజ్‌ (195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150) వీరోచిత శతకం, రిషభ్‌ పంత్‌ (105 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్స్‌లతో 99) అద్భుత పోరాటం ఫలితంగా జట్టు 408/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. దీంతో మరో 150-200 పరుగులైనా జత చేస్తారని అంతా భావించారు. కానీ రెండో కొత్త బంతి అందుకున్న కివీస్‌ బౌలర్లు మ్యాచ్‌ గమనాన్నే మార్చేశారు. టపటపా వికెట్లు తీసేయడంతో 54 పరుగుల వ్యవధిలోనే భారత్‌ చివరి 7 వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సేన 462 రన్స్‌కు ఆలౌటైంది. మ్యాట్‌ హెన్రీ, ఓరోక్‌ మరోసారి చెలరేగి మూడేసి వికెట్లతో దెబ్బతీశారు. ఎజాజ్‌ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. 107 పరుగుల లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్‌ నాలుగోరోజైన శనివారం ఆట ముగిసేసరికి కేవలం నాలుగు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను ముందుగానే ముగించారు. ఆదివారం కూడా వరుణుడు ఆటంకపరిచే అవకాశం ఉంది. దీంతో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవాలంటే రోజంతా వర్షం కురవాలి.. లేదంటే బౌలర్లు ఏమైనా అద్భుతం చేయాలి. ఇక.. కివీస్‌ ఇక్కడ చివరిసారిగా 1989లో టెస్టు గెలవడం గమనార్హం.


సర్ఫరాజ్‌-పంత్‌ అద్భుత పోరాటం: ఓవర్‌నైట్‌ స్కోరు 231/3తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం చూపింది. యువ బ్యాటర్లు సర్ఫరాజ్‌-పంత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దాదాపు ప్రతీ ఓవర్‌లో బౌండరీతో చెలరేగారు. సర్ఫరాజ్‌ తన సహజశైలిలో ఆడేస్తూ చక్కటి ఫోర్‌తో తొలి సెంచరీ (110 బంతుల్లో)ని పూర్తి చేశాడు. అటు ఆరంభంలోనే రనౌట్‌ నుంచి తప్పించుకున్న పంత్‌ కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించాడు. సౌథీ ఓవర్‌లో 6,4 కొట్టిన పంత్‌.. ఎజాజ్‌ ఓవర్‌లో 6,6,4తో చెలరేగాడు. 54 బంతుల్లోనే పంత్‌ ఫిఫ్టీ పూర్తయ్యింది. అయితే ఉదయం 11కు వర్షం కురవడంతో మ్యాచ్‌కు రెండు గంటల అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలోనే లంచ్‌ బ్రేక్‌ను ప్రకటించారు.


కొత్త బంతితో బెంబేలు: రెండో సెషన్‌ ఆరంభంలోనూ సర్ఫరాజ్‌-పంత్‌ జోరును చూపారు. ఎడాపెడా బౌండరీలతో స్కోరును 80 ఓవర్లలో 400కి చేర్చారు. కానీ ఆ ఓవర్‌ తర్వాత కివీ్‌సకు కొత్త బంతి తీసుకునే అవకాశం రావడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. చక్కటి పేస్‌, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో పరుగుల సంగతి ఏమో కానీ వికెట్లు కూడా కాపాడుకోలేకపోయారు. 150 పరుగులతో ఉన్న సర్ఫరాజ్‌ను ముందుగా సౌథీ అవుట్‌ చేయడంతో తడబాటు ఆరంభమైంది. దీంతో నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే.. సెంచరీకి పరుగు దూరంలో పంత్‌ను ఓరోక్‌ బౌల్డ్‌ చేశాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను తాకింది. కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్‌ చేరడంతో భారత్‌ భారీ ఆధిక్యంపై ఆశలు వదులుకుంది. సెషన్‌ చివరి ఓవర్‌లో రాహుల్‌ (12)ను కూడా ఓరోక్‌ అవుట్‌ చేశాడు. ఇక ఆఖరి సెషన్‌ అయితే పది ఓవర్లలోనే ముగిసింది. హెన్రీ టెయిలెండర్లను టపటపా పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ స్వల్ప లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందుంచగలిగింది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 46;

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (స్టంప్డ్‌) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 35; రోహిత్‌ (బి) ఎజాజ్‌ 52; కోహ్లీ (సి) బ్లండెల్‌ (బి) ఫిలిప్స్‌ 70; సర్ఫరాజ్‌ (సి) ఎజాజ్‌ (బి) సౌథీ 150; పంత్‌ (బి) ఓరోక్‌ 99; రాహుల్‌ (సి) బ్లండెల్‌ (బి) ఓరోక్‌ 12; జడేజా (సి) యంగ్‌ (బి) ఓరోక్‌ 5; అశ్విన్‌ (ఎల్బీ) హెన్రీ 15; కుల్దీప్‌ (నాటౌట్‌) 6; బుమ్రా (సి) బ్లండెల్‌ (బి) హెన్రీ 0; సిరాజ్‌ (సి) సౌథీ (బి) హెన్రీ 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 99.3 ఓవర్లలో 462 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-72, 2-95, 3-231, 4-408, 5-433, 6-438, 7-441, 8-458, 9-462, 10-462. బౌలింగ్‌: సౌథీ 15-2-53-1; హెన్రీ 24.3-3-102-3; ఓరోక్‌ 21-4-92-3; ఎజాజ్‌ పటేల్‌ 18-3-100-2; ఫిలిప్స్‌ 15-2-69-1; రచిన్‌ 6-0-30-0.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 0; కాన్వే (బ్యాటింగ్‌) 0; మొత్తం: 0.4 ఓవర్లలో 0/0. బౌలింగ్‌: బుమ్రా 0.4-0-0-0.


జీరో టు హీరో!

లావుగా ఉండడంతో ఎగతాళి.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా సెలెక్టర్ల నుంచి రాని పిలుపు. నిరాశ ఆవరించినా.. సర్ఫరాజ్‌ మాత్రం తన బ్యాటింగ్‌ విన్యాసాలతో సెలెక్టర్ల తలుపులు బాదుతూనే ఉన్నాడు. గిల్‌ ఫిట్‌నెస్‌ లేమితో.. తుది జట్టులో చాన్స్‌ దక్కించుకొన్న 26 ఏళ్ల సర్ఫరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జీరో అయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన తీరు అతడి ప్రతిభపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేశాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడాడు. కోహ్లీలాంటి సీనియర్లే ఆచితూచి ఆడుతున్న పరిస్థితుల్లో సర్ఫరాజ్‌ ప్రత్యర్థి బౌలర్లపై వ్యూహాత్మకంగా దాడి చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక, పంత్‌తో కలసి బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు పరిణతి కనబర్చాడు. రిషభ్‌ కాలికి బంతి తగలడంతో అతడిని ఎక్కువగా పరుగులు తీయించలేదు. అంతేకాకుండా లెఫ్టామ్‌ స్పిన్నర్‌ వచ్చినప్పుడు పంత్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తూ.. తాను ఎక్కువగా పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొత్తంగా ఒక్క ఇన్నింగ్స్‌తో తాను ఎవరికీ బ్యాకప్‌ కాదనే విషయాన్ని చాటాలనే కసి మాత్రం అతడిలో కనిపించింది. ఇనేళ్ల కష్టానికి.. ఎదురుచూపులకు దక్కిన ఫలితమే.. సర్ఫరాజ్‌ భావోద్వేగ సంబరాలు!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


1

టెస్టుల్లో వేగంగా (62 ఇన్నింగ్స్‌) 2500 పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌గా పంత్‌. ఈక్రమంలో అతను ధోనీ (69 ఇన్నింగ్స్‌)ని అధిగమించాడు.

3

టెస్టుల్లో ఎక్కువసార్లు (7) 90+ దగ్గర అవుటైన మూడో భారత బ్యాటర్‌గా పంత్‌. సచిన్‌ (10) టాప్‌లో ఉన్నాడు. అలాగే టెస్టుల్లో 99 దగ్గర అవుటైన నాలుగో వికెట్‌ కీపర్‌గా పంత్‌. గతంలో మెకల్లమ్‌, ధోనీ, బెయిర్‌స్టో కూడా ఇలాగే వెనుదిరిగారు.

3

ఒకే టెస్టులో డకౌట్‌, 150+ స్కోరు నమోదు చేసిన మూడో భారత బ్యాటర్‌గా సర్ఫరాజ్‌. గతంలో మాధమ్‌ ఆప్టే (0, 163 నాటౌట్‌), నయన్‌ మోంగియా (152, 0) ఉన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 02:02 AM