కల నెరవేరె.. కెరీర్ ముగించె
ABN, Publish Date - Jul 01 , 2024 | 06:11 AM
భారత క్రికెట్‌లో ఇలాంటి దృశ్యం మునుపెన్నడూ చూడలేదు.. పేరుకే స్టార్ ఆటగాళ్లనీ, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించలేకపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో.. అందకుండా ఊరిస్తున్న వరల్డ్‌క్‌పను అందుకున్న వేళ వారి భావోద్వేగాలు...
టీ20లకు రోహిత్, విరాట్, జడేజా అల్విదా
ఫైనల్ వీక్షకులు 5.3 కోట్లు
న్యూఢిల్లీ: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ వీక్షణలోనూ రికార్డులను నెలకొల్పింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ పోరును ఏకంగా 5 కోట్ల 30 లక్షల మంది వీక్షించారు. అయితే గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ రికార్డును మాత్రం దాటలేకపోయింది. అప్పుడు 5.9 కోట్ల మంది వీక్షించగా.. అదే ఆల్‌టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. ఇక స్టార్‌స్పోర్ట్స్‌లో ఎంతమంది తిలకించారనే లెక్కలు వచ్చే వారం బార్క్ విడుదల చేయనుంది.
భారత క్రికెట్‌లో ఇలాంటి దృశ్యం మునుపెన్నడూ చూడలేదు.. పేరుకే స్టార్ ఆటగాళ్లనీ, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించలేకపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో.. అందకుండా ఊరిస్తున్న వరల్డ్‌క్‌పను అందుకున్న వేళ వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయి.. అందుకేనేమో.. ఇంతకు మించిన సమయం ఇంకేముంటుందన్న ఆలోచనతో ఒకరు కాదు, ఇద్దరు కాదు టీమిండియా విజయాలకు మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. తమ చిరకాల స్వప్నం నెరవేరిందన్న అంతులేని సంతృప్తితో.. కప్పును చూస్తూ మైమరుస్తూ.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ, ‘సర్’ రవీంద్ర జడేజా ఒకరి తర్వాత మరొకరుగా యువతరానికి ద్వారాలు తెరిచారు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
‘టీ20ల నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కప్‌ను సాధించాక గుడ్‌బై చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది’.. ఫైనల్ ముగిశాక కెప్టెన్ రోహిత్ చేసిన కామెంట్ ఇది. ధనాధన్ ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన సారథిగా హిట్‌మ్యాన్ పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. కపిల్‌దేవ్, ఎంఎస్ ధోనీల తర్వాత భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా చిరస్థాయిగా నిలుస్తాడు. విరాట్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకన్నా గొప్ప ఆటగాడైన విరాట్‌కు సముచిత గౌరవాన్నిస్తూ జట్టులో చక్కటి వాతావరణం ఉండేలా చూసుకున్నాడు. సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్ సారథ్యంలో భారత్ 61 టీ20 మ్యాచ్‌లు ఆడితే 50 గెలవగా, టీ20 వరల్డ్‌క్‌పలో 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలున్నాయి. ఇక ఐపీఎల్ సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా ఐదు టైటిళ్లతో అదరగొట్టాడు. ఈక్రమంలో వ్యక్తిగత రికార్డులను ఏనాడూ పట్టించుకోకపోయినా ఎన్నో ఘనతలు అతని ఖాతాలో చేరాయి. అలాగే సహచరులతో ఎంత సరదాగా ఉన్నా.. మైదానంలో మందలింపుతో తప్పులను సరిదిద్దేందుకు వెనుకాడడు. అయితే ఎంఎస్ ధోనీ మాదిరే ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న దశలో రోహిత్ వారికి అండగా నిలిచాడు.
తాజా టీ20 వరల్డ్‌క్‌పలో జట్టు ఆరంభం నుంచి ముగింపు వరకు ఒకే బృందంతో ఆడిన విషయం గమనించవచ్చు. పిచ్‌ను అంచనా వేసి పేసర్ సిరాజ్‌ను మాత్రమే తప్పించారు. విరాట్, దూబేలపై ఎన్ని విమర్శలు వచ్చినా వారిపై నమ్మకాన్ని ఉంచాడు. ఫైనల్లో ఈ ఇద్దరి విలువైన పరుగులే జట్టు విజయంలో కీలకమైన విషయం తెలిసిందే. 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ 159 మ్యాచ్‌లు ఆడగా ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు (4231), అత్యధిక సెంచరీలు (5), అత్యధిక సిక్సర్ల (205)తో ఘనంగా వీడ్కోలు పలికాడు.
చాంపియన్లకు రూ.125 కోట్లు
టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. విజేతకు ఐసీసీ రూ.20.42 కోట్లే అందించగా... బోర్డు మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగా ఏకంగా రూ.125 కోట్లు రోహిత్ సేనకు ఇవ్వనుంది. ‘టోర్నీ అంతటా భారత జట్టు పట్టుదల, అంకితభావం, క్రీడాస్ఫూర్తి ప్రదర్శించింది. అందుకే విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ గెలుపులో భాగమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు’ అని బోర్డు కార్యదర్శి జైషా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
సమర్థ నాయకుడు గేమ్ ఛేంజర్
టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో ఉన్న కోట్లాది మంది అభిమానులకు విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ వార్తతో కాస్త షాక్‌కు గురిచేశాడు. నిజానికి తను ఈ మెగా టోర్నీలో సభ్యుడిగా ఉంటాడని అనుకోలేదు. 2022 టోర్నీలో జట్టు నిష్క్రమణ తర్వాత యువ ఆటగాళ్లతోనే టీమిండియా ముందుకెళ్లింది. అయితే ఐపీఎల్‌లో విరాట్ తన అద్భుత ఫామ్‌తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. కానీ విశ్వక్‌పల్లో తిరుగులేని రికార్డున్న తను ఈసారి అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. అందుకే ఫైనల్లోనూ అతడి మీద ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఇదే తన చివరి మ్యాచ్ అనే భావనలో కోహ్లీ మొండిగా క్రీజులో నిలబడ్డాడు. అనుకున్నది సాధించి కప్ దక్కడంలో కీలక భూమిక పోషించాడు. వాస్తవానికి తన ఆటతీరుకు పొట్టి ఫార్మాట్ శైలి సరిపోదు.
అందుకే పదేపదే అతని స్ట్రయిక్ రేట్ గురించి విమర్శలు ఎక్కుపెడుతుంటారు. కానీ వెటరన్‌గా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. 2022 టీ20 ప్రపంచక్‌పలో పాక్‌పై 31/4 స్కోరుతో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో అతడి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను అంత సులువుగా మర్చిపోగలమా? పొట్టి ఫార్మాట్‌లో 2010లో అరంగేట్రం చేసిన విరాట్ 125 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో 4,188 పరుగులు సాధించాడు. రోహిత్ తర్వాత అతడివే అత్యధిక పరుగులు.
వరల్డ్‌క్‌పను మళ్లీ దేశానికి తీసుకువస్తున్నందుకు ధన్యవాదాలు. క్లిష్టపరిస్థితుల్లో ఎంతో ప్రశాంతంగా ఆడారు. మ్యాచ్ చూస్తున్నప్పుడైతే గుండె వేగం అమాంతం పెరిగింది. నా పుట్టినరోజుకు గొప్ప బహుమతి.
- ఎంఎస్ ధోనీ
మనకు నాలుగో స్టార్ లభించింది. భారత జెర్సీకి లభించిన ప్రతీ స్టార్.. భవిష్యత్ తరంలో మరింత స్ఫూర్తిని నింపుతుంది. మిత్రుడు ద్రవిడ్ నేతృత్వంలో కప్‌ను సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.
-సచిన్ టెండూల్కర్
భారత్.. ఎట్టకేలకు సాధించింది.
విశ్వవిజేతకు అభినందనలు.
- సునీల్ గవాస్కర్
సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ప్రపంచకప్ సాధించారు. ఇదే జోరులో మరిన్ని విజయాలు అందుకొంటారని భావిస్తున్నా.
- సౌరవ్ గంగూలీ
ఆనందభాష్పాలు ఆగడం లేదు. టీమిండియా తరహాలోనే నా భావోద్వేగాలు కూడా..! భారత్ వరల్డ్ చాంపియన్. నేను చూస్తే ఓడిపోతారేమోనని.. మ్యాచ్‌ను వీక్షించలేదు. భారత్ మాతాకీ జై.
- అమితాబ్ బచ్చన్
ఏం మ్యాచ్..! ఊపిరి బిగబట్టి చూశా. కంగ్రాట్స్ భారత్.. అద్భుత ప్రదర్శనకు పురస్కారం దక్కింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
ఉత్కంఠభరిత ఫైనల్..! భారత్‌కు శుభాకాంక్షలు. సౌతాఫ్రికా కూడా గొప్పగా ఆడింది. వెస్టిండీస్, అమెరికాలో మరిన్ని క్రికెట్ ఈవెంట్లు జరగాలి.
- మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల
Updated Date - Jul 01 , 2024 | 06:11 AM